Monday, January 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసిరియాపై విరుచుకుపడిన అమెరికా

సిరియాపై విరుచుకుపడిన అమెరికా

- Advertisement -

ఐఎస్‌ఐస్‌ ఉగ్రవాదులు లక్ష్యంగా దాడులు

డెమాస్కస్‌ : ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐస్‌ను లక్ష్యంగా చేసుకొని అమెరికా దళాలు సిరియాపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి. అమెరికా సిబ్బందిపై ఐఎస్‌ జరిపిన దాడికి ప్రతీకారంగా గత నెలలోనే అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఆపరేషన్‌ ప్రారంభించాయి. దీనికి కొనసాగింపుగా సిరియా వ్యాప్తంగా శనివారం దాడులు జరిగాయని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్‌కామ్‌) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ దాడుల కారణంగా ప్రాణనష్టం జరిగిందీ లేనిదీ ఆ ప్రకటనలో వివరించలేదు. మరిన్ని వివరాలు అందజేసేందుకు పెంటగాన్‌ నిరాకరించింది. కాగా ఈ ఆపరేషన్‌లో 35కు పైగా లక్ష్యాలపై దాడి చేసి 90 ఆయుధాలు, పేలుడు పదార్థాలు, బులెట్లు వంటి యుద్ధ సామగ్రిని ప్రయోగించామని ఓ అధికారి సీబీఎస్‌ న్యూస్‌కు తెలియజేశారు.

ఈ దాడిలో ఎఫ్‌-15ఈ, ఏ-10, ఏసీ-130జే, ఎంక్యూ-9, జోర్డాన్‌కు చెందిన ఎఫ్‌-16 సహా 20 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ‘మేము దేనినీ మరచి పోము. ఎన్నడూ పశ్చాత్తాపపడం’ అని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌ సేథ్‌ చెప్పారు. గత నెల 13వ తేదీన సిరియాలోని పామిరా నగరంలో ఇద్దరు అమెరికా సైనికులను, ఓ పౌరుడిని ఐఎస్‌ ఉగ్రవాదులు హతమార్చారని, దానిని ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నామని సెంట్‌కామ్‌ చెబుతోంది. ప్రస్తుతం సిరియాలో వెయ్యి మంది అమెరికా సైనికులు మకాం వేశారు. ‘మా సందేశం స్పష్టంగా ఉంది. మా యుద్ధ వీరులకు మీరు నష్టం కలిగిస్తే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మిమ్మల్ని హతమారుస్తాం. తప్పించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండదు’ అని సెంట్‌కామ్‌ తన ప్రకటనలో ఉగ్రవాదులను హెచ్చరించింది.

కాగా సిరియాలోని గ్రామీణ ప్రాంతాలలో వేర్వేరు చోట్ల అనేక పేలుళ్లు సంభవించాయని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. భాగస్వామ్య దేశాల దళాలతో కలిసి దాడులు చేశామని సెంట్‌కామ్‌ తెలిపింది. అయితే ఏయే దేశాల దళాలు దాడిలో భాగస్వాములయ్యాయో వెల్లడించలేదు. దాడిలో తమ దళాలు కూడా పాల్గొన్నాయని ఆ తర్వాత జోర్డాన్‌ సైన్యం ప్రకటించింది. ఐఎస్‌ ఉగ్రవాదులపై గత నెల 19న ప్రారంభించిన ఆపరేషన్‌కు అమెరికా ‘హాకీ స్ట్రైక్‌’ అని పేరు పెట్టింది. ఆ రోజు సెంట్రల్‌ సిరియాలోని 70 లక్ష్యాలపై దాడి జరిగింది. అక్కడ ఐఎస్‌ మౌలిక సదుపాయాలు, ఆయుధాలు ఉన్నాయని అమెరికా అనుమానం. డిసెంబర్‌ 30న జరిపిన మరో దాడిలో పాతిక మంది ఐసిస్‌ ఉగ్రవాదులను పట్టుకోవడమో లేదా మట్టుపెట్టడమో చేశామని అమెరికా తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -