Monday, January 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅట్టుడికిన మినియాపొలిస్‌

అట్టుడికిన మినియాపొలిస్‌

- Advertisement -

‘ఐస్‌’ కాల్పుల్లో మహిళ మృతిపై జనాగ్రహం
పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు
పాల్గొన్న వేలాది మంది ఆందోళనకారులు


వాషింగ్టన్‌ : అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐస్‌) అధికారి కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందిన ఘటన అక్కడి ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఈ ఘటనకు నిరసనగా మినియాపోలిస్‌ నగరంలో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. భారీ నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. మహిళపై యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్‌ కాల్పులను తీవ్రంగా ఖండించారు. నిరసనలను మరింత ఉధృతం చేసేందుకు ఆందోళనాకారులు నిర్ణయించారు. ఫెడరల్‌ గవర్నమెంట్‌ బహిష్కరణ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో వెయ్యికి పైగా ర్యాలీలకు నిరసనకారులు ప్రణాళికలు రచించారు. గత బుధవారం రెనీ గుడ్‌ (37) అనే మహిళను ఒక ఐస్‌ అధికారి కాల్చి చంపిన ఘటన ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

తీవ్రమైన చలి, బలమైన గాలులు ఉన్నప్పటికీ.. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ నిరసనల్లో పాల్గొన్నారు. మినియాపొలిస్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంత జనాభా సుమారు 38 లక్షలు. అక్కడ స్థానిక పోలీసుల అంచనా ప్రకారం.. నిరసనల్లో పదివేల మంది వరకు పాల్గొన్నారు. ఆదివాసీ మెక్సికన్‌ నృత్యకారుల బృందం ముందుండగా.. నిరసనకారులు రెనీ గుడ్‌ను తన కారులో కాల్చిన వీధి వైపు ర్యాలీగా వెళ్లారు. ‘ఐస్‌ను రద్దు చేయాలి’, ‘న్యాయం లేకపోతే శాంతి లేదు’, ‘ఐస్‌ మా వీధుల నుంచి వెళ్లిపోవాలి’ వంటి నినాదాలతో నగరం మార్మోగింది. ”నేను తీవ్ర కోపంతో ఉన్నాను. అయినా.. పరిస్థితులు మెరుగుపడతాయన్న ఆశ మాత్రం వదలడం లేదు” అని ఎల్లిసన్‌ మౌంట్‌గోమరి (30) అనే ఓ నిరసనకారుడు తన ఆందోళనను వ్యక్తం చేశాడు.

‘ఐస్‌’కు వ్యతిరేకంగా ర్యాలీలు
మినియాపోలిస్‌లో ఓ మహిళను ఐస్‌ కాల్చి చంపిన ఘటన లాంటిదే గురువారం ఒరెగాన్‌ రాష్ట్రంలోని పోర్ట్‌ల్యాండ్‌లో కూడా జరిగింది. ఒక బోర్డర్‌ పెట్రోల్‌ అధికారి వాహనంలో ఉన్న ఇద్దరిపై కాల్పులు జరిపి గాయపరిచాడు. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణమయ్యాయి. ఇండివిజిబుల్‌, అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ (ఏసీఎల్‌యూ) వంటి పౌరహక్కుల సంఘాలు కలిసి ‘ఐస్‌ ఔట్‌ ఫర్‌ గుడ్‌’ పేరుతో వెయ్యికి పైగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ‘ఐస్‌ వెళ్లిపోవాలి’, ‘ఫాసిస్ట్‌ అమెరికా వద్దు’ అనే నినాదాలతో ఫిలడెల్ఫియాలో ర్యాలీలు జరిగాయి. మాన్‌హట్టన్‌లో వందలాది మంది ఐస్‌ వ్యతిరేక ప్లకార్డులతో ఇమ్మిగ్రేషన్‌ కోర్టు వద్ద ర్యాలీ చేశారు. ”రెనీకి న్యాయం కావాలి. ఐస్‌ మా నుంచి వెళ్లిపోవాలి. ఎన్నికైన నాయకులు చర్యలు తీసుకోవాలి. ఇక చాలు” అని ఇండివిజిబుల్‌ సహనిర్వాహకురాలు లియా గ్రీన్‌బర్గ్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -