Monday, January 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజైలులో వీఐపీ మర్యాదలు

జైలులో వీఐపీ మర్యాదలు

- Advertisement -

ధనిక ఖైదీలకు సపర్యలు
కోరుకున్న మెనూ ప్రకారం భోజన సదుపాయాలు
ప్రతిగా ఉన్నతాధికారులకు ముడుపులు
ఆరా తీస్తున్న జైళ్ళ శాఖ డీజీ సౌమ్యమిశ్రా

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలోని ఒక జైలులో ధనిక ఖైదీలకు అధికారులు వీఐపీ మర్యాదలు చేస్తూ అందుకు ప్రతిగా డబ్బులను దండుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. జైళ్ల శాఖలో కలకలం రేపిన ఈ వార్తపై ఆ శాఖ అధిపతి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. వివరాళ్లోకి వెళ్తే…సంగారెడ్డి జైలులో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఉన్నతాధికారులు అంతర్గతంగా దర్యాప్తు జరుపుతున్నట్టు సమాచారం. ఈ జైలులో కొందరు డబ్బున్న ఖైదీలకు వారు ఉంటున్న బ్యారక్‌లలో అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా ఆ బ్యారక్‌ ఒక హౌటల్‌ గది మాదిరిగా అత్యంత శుభ్రంగా ఉంచడగమేగాక, వారు వాడుకునే టాయిలెట్లను సైతం నీట్‌గా ఉంచుతున్నట్టు తెలిసింది. వారు తినే భోజనం సైతం సాధారణ ఖైదీలకు ఒకతీరు, వీరికి మంచి రుచులతో సమకూరుస్తున్నట్టు సమాచారం. వారు ఆ ఖైదీలు కోరుకున్న మెనూ ప్రకారం భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిసింది.

ఒక విధంగా ఈ వీఐపీ ఖైదీలు పేరుకు మాత్రం జైలులో ఉన్నప్పటికీ, వారికి అందుతున్న సౌకర్యాలు వాళ్ల ఇండ్లల్లో కూడా ఉండకపోవచ్చనే మాటలు వినబడుతున్నాయి.ఇటీవల సంగారెడ్డిలోని ఒక ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పెద్ద సంఖ్యలో కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన ఆ ఫ్యాక్టరీ యజమానిని ఇటీవలనే అరెస్టు చేసి సంగారెడ్డి జైలులో ఉంచారు. ఆయనతో పాటు మరో ఆరు నుంచి ఏడు మంది ఖైదీలకు కూడా వీఐపీ స్థాయిలో మర్యాదలు ఈ జైలులో లభిస్తున్నట్టు తెలిసింది. జైలు ఉన్నతాధికారులే పూనుకొని మర్యాదలు, సపర్యలను ఈ ఖైదీలకు చేస్తున్నట్టు విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. అందుకు ప్రతిగా భారీ మొత్తంలోనే ఈ అధికారులకు ముడుపులు ముడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో సమాచారం అందుకున్న జైళ్ళ శాఖ అధిపతి డాక్టర్‌ సౌమ్యమిశ్రా ఒక డీఐజీ స్థాయి అధికారిని జైలులో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అతిథి మర్యాదల గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ జైలుకు చెందిన ఒక ఉన్నతాధికారిపై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -