భారీ క్రైమ్‌ను ఛేదించిన పోలీసులు
నిందితుల ఖాతాల్లో రూ.547 కోట్లు.. సొత్తు జమ
నేరాలకు నిరుద్యోగులను ఉపయోగించుకున్న వైనం
అరెస్టు అయిన వారిలో ఓ ప్రముఖ పార్టీ నేత సమీప బంధువు
నవతెలంగాణ-పెనుబల్లి
సైబర్ నేరాలు అంతుచిక్కడం లేదు. రోజుకొకచోట ఏదో రకంగా సైబర్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లక్షలు, కోట్లల్లో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతోమందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినా నేరాలు మాత్రం ఆగడం లేదు. నిన్న గాక మొన్న భూభారతిలో ఎన్నివేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో బయటపడింది. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మరోటి చోటు చేసుకుంది. పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి అండ్ ముఠా రూ.547 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. దానిని పోలీసులు ఛేదించి అరెస్టు చేశారు. ఉడతనేని వికాస్ చౌదరి అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడి సమీప బంధువు. సైబర్ దోపిడీకి సహకరించిన 17 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు.
సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెల 24వ తేదీన సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన మోదుగ సాయికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన పేరుతో వలవిసిరి ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రకాష్, మేడా సతీష్, మోరంపూడి చెన్నకేశవ అనే వ్యక్తులు సైబర్ నేరాలకు పాల్పడుతూ రూ. 547 కోట్ల భారీ మొత్తాన్ని కొల్లగొట్టారు. కేసు విచారణలో భాగంగా నిందితులైన ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్‌ల కుటుంబ సభ్యుల, అనుచరుల బ్యాంక్ అకౌంట్లను పోలీసులు పరిశీలించగా దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెల్లడయ్యాయి.
పోట్రు మనోజ్ కళ్యాణ్ బ్యాంకు ఖాతాలో రూ. 114.18 కోట్లు, అతని భార్య మేడా భానుప్రియకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో రూ. 45.62 కోట్లు, మనోజ్ కళ్యాణ్ బామ్మర్ది మేడా సతీష్ ఖాతాలో రూ.135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో రూ. 81.72 కోట్లు, కరీంనగర్‌కు చెందిన తాటికొండ రాజు అనే వ్యక్తికి చెందిన నరసింహా కిరాణం అండ్ డెయిరీ ఖాతాలో రూ.92.54 కోట్లు, ఉడతనేని వికాస్ చౌదరి ఖాతాలో రూ.80.41 కోట్ల చొప్పున లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. సత్తుపల్లి పరిసర గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువకులను ఉద్యోగాల కల్పన పేరుతో పిలిపించుకుని, వారికి ఉద్యోగం ఇచ్చి, వారితో ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాను తెరిపించి, ఆయా అకౌంట్లలో క్రెడెన్షియల్స్‌ను తీసుకుని నిందితులు కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ నేరాల సొత్తును జమ చేయడానికి వినియోగించారు. ఈ సైబర్ నేరాల రాకెట్‌లో నిందితులకు సహకరించినందుకుగాను సదాశివపాలెం, సీతారాంపురం, రామానగరం, తుమ్మూరు గ్రామాలకు చెందిన జుంజునూరి శివక్రిష్ణ, వడ్లమూడి నరేంద్ర, మల్లాది శివ, సాధు పవన సందీప్, సాదు సంధ్య, సాధు లేఖలను అరెస్ట్ చేశారు.



