మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాజీపేటలో జాతీయస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం
నవతెలంగాణ – కాజీపేట
ఖోఖో, కబడ్డీ క్రీడల్లో క్రీడాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, సాగునీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జాతీయస్థాయి ఖోఖో క్రీడా పోటీలకు చారిత్రక వరంగల్ నగరం వేదికగా నిలవడం సంతోషకరంగా ఉందన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో 58వ సీనియర్ నేషనల్ ఖో ఖో ఛాంపియన్షిప్ 2025-2026 మెన్, ఉమెన్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సుధాంశ్ మిట్టల్, రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డిలతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో పాటు నేవి, పోలీస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. క్రీడాకారులతో కలిసి క్రీడా జ్యోతితో రాష్ట్ర అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి ర్యాలీగా వేదిక వద్దకు వచ్చారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదగడానికి ఇలాంటి వేదికలు అవసరమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 79 జట్లు ఈ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ హనుమకొండ జేఎన్‌ఎస్‌లోని ఇండోర్ స్టేడియంలో ఖోఖోతో పాటు ఇతర క్రీడల అభివృద్ధి కోసం కోటిన్నర రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. గ్రామస్థాయి నుంచే క్రీడాకారుల ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాలసీని అమలు చేయనుందని మంత్రి చెప్పారు. నిర్వాహకులు జంగా రాఘవరెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, నర్సంపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, నేషనల్ ఖోఖో ఫెడరేషన్ ప్రతినిధులు త్యాగి, గోవింద్ శర్మ , రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు, కోచ్ లు, క్రీడాకారులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఖోఖో, కబడ్డీ క్రీడలను ప్రోత్సహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



