అందుకు చిన్న దేశాలన్నీ ఏకం కావాలి : హైకోర్ట్ న్యాయమూర్తి(రిటైర్డ్) జస్టిస్ జి.రాధారాణి
భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్) రాష్ట్ర రెండో మహాసభ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆయా దేశాల్లోని చమురు వనరులు, డాలర్లపైన అగ్రరాజ్యాల ఆధిపత్యం, నియంతృత్వాన్ని నియంత్రించాల్సిందేననీ, దీని కోసం చిన్నదేశాలన్నీ ఏకమై కలిసికట్టుగా పోరాడాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మెన్, హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.రాధారాణి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం(ఇస్కఫ్) తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభ జరిగింది. దీనికి ఇస్కఫ్ రిసిప్షెన్ కమిటీ అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది కడారు ప్రభాకర్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాధారాణి మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి దేశాల మధ్య సహకారం అత్యవసరమనీ, పరస్పర జ్ఞాన మార్పిడి, వనరుల భాగస్వామ్యం ద్వారానే ప్రపంచం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లగలదని నొక్కి చెప్పారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తలెత్తిన సంక్షోభాలను ఉదాహరణగా చూపుతూ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని అగ్రరాజ్యాలు తమ ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం కోసం ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు.
ఒక దేశ అధ్యక్షున్ని ఆ దేశంలోకి వెళ్లి తీసుకెళ్లడం ప్రపంచాన్ని షాక్ గురిచేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలు, రాజకీయ అస్థిరత పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నెహ్రూ ‘అలీన విధానం’ వల్ల అనేక ఆసియా, ఆఫ్రికా దేశాలు ఏకమై తమ ఉనికిని చాటుకున్నాయని గుర్తు చేశారు. అలీన విధానాన్ని అనుసరించి ప్రపంచానికే భారతదేశం ఆదర్శంగా నిలిచిందనీ, మానవళి, ప్రపంచ శాంతి కోసం, అణ్వాయుధ అంతం కోసం భారతదేశం కృషి చేసిందని వివరించారు. శాంతి, సహకారం అనే ప్రాతిపదికన ఏర్పడిన భారతదేశం ఒక పుష్పగుచ్ఛం లాంటిదన్నారు. భారతదేశ ప్రజలను సమీకరించి, చైతన్యపర్చడంలో ఇస్కఫ్ కృషి చేస్తోందన్నారు. ఇస్కఫ్ నేషనల్ ప్రిసీడీయం సభ్యులు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ..వెనిజులాలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షున్ని అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు.
క్యూబా, గ్రీన్‌లాండ్ దేశాలను కూడా అమెరికా బెదిరిస్తున్నదనీ, భారతదేశంపై కూడా అదనపు పన్నుల రూపంలో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. 1941లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వేసిన పునాదులతో ప్రారంభమైన ఈ సంస్థ, నాటి నుంచి నేటి వరకు అంతర్జాతీయ శాంతి కోసం కృషి చేస్తోందని వివరించారు. తమ సంస్థ రష్యాతో పాటు నేపాల్, శ్రీలంక, వియత్నాం వంటి దేశాలతో సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరుస్తోందని తెలిపారు. ఆర్టీఏ మాజీ జాయింట్ కమిషనర్ సి.ఎల్.ఎన్. గాంధీ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచ రాజకీయా పరిణామాలు ప్రమాదకరంగా మారాయని, ప్రజాస్వామ్యం పేరుతో అగ్రదేశాలు నియంతృ త్వంగా వ్వవహారిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కడారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అంతర్జాతీయ శాంతి కోసం మావవాళి మధ్య సంబంధాలను కొనసాగిం చేందుకు ఇస్కఫ్ ప్రయత్నిస్తుందన్నారు. ఈ సదస్సులో ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.గోపాల్, ప్రధాన కార్యదర్శి అరుణ్ రాజశేఖర్, న్యాయవాది బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.



