నవతెలంగాణ-తుంగతుర్తి
తుంగతుర్తి డివిజన్ పరిధిలో ఈ యాసంగిలో 98 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ ఏడాది గతానికి భిన్నంగా వరి పంటలకు చీడ పీడల దాడి ఎక్కువగా ఉండడంతో తాము వేసిన పంటను రక్షించుకునేందుకు రైతన్న నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎన్నో కష్ట నష్టాలకోర్చి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చిన రైతన్నకు అక్కడ భంగపాటు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన తరువాత తాము పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని విక్రయించడం తలకు మించిన భారంగా మారుతోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిన్న మొన్నటి వరకు తేమ, తాలు పేరిట ఇబ్బందులకు గురి చేసిన నిర్వాహకులు ప్రస్తుతం ధాన్యం తూకంలో జాప్యం చేయడంతో ఎక్కడ పోసిన ధాన్యపు రాశులు అక్కడే ఉన్నాయి.ఒక్కో కొనుగోలు కేంద్రంలో రోజుకు నాలుగు లారీలకు సరిపడా ధాన్యాన్ని తూకం వేస్తే కానీ త్వరగా అయిపోని పరిస్థితి నెలకొంది. మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులు పర్యవేక్షణ కొరవడింది.తాలు పేరిట ఇబ్బందులు పెడుతున్నారని తరుగు పేరుతో బస్తాకు అదనంగా రెండు నుంచి రెండున్నర కిలోల ధాన్యం తీసి,తూకం వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.దీంతో పలు చోట్ల ఆందోళనలు సైతం చోటు చేసుకున్నాయి.
పేరుకుపోతున్న ధాన్యం..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. అత్యధక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ధాన్యంలో తేమ సమస్య ఉండదు.ధాన్యం ఆరబెట్టిన ఒకటి రెండు రోజుల్లో నిబంధన ప్రకారం ఉండాల్సిన 17శాతం తేమ కంటే తక్కువనే ఉంటుంది.అయినా సెంటర్ నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే చేతికి అందిన ధాన్యం ఒక్క వర్షం పడితే తడిసి ముద్దవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు భగభగమనే ఎండలో ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతన్నకు సాయంత్రం ఆకాశంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి.అనుకున్న సమయానికి కొనుగోళ్లు పూర్తి చేస్తారా లేరా అనే అనుమానాలు కలుగుతున్నాయి.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులను ఇబ్బందుల నుండి కాపాడాలని వేడుకుంటున్నారు.
ఏపీఎం యాదమ్మ.
తుంగతుర్తి మండల పరిధిలో ఐకెపిల ద్వారా 20,సొసైటీ ద్వారా 8,మొత్తం 28 కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.ఇప్పటివరకు 280 లారీల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని,ఇది మొత్తం ధాన్యంలో 10 శాతం మాత్రమేనని అన్నారు.మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ ఉండడం,ప్రతి సెంటర్కురెండు లారీలు మాత్రమే కేటాయించడం వలన కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని అన్నారు.సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి,కొనుగోలు ప్రక్రియ వేగవంతమయ్యేలా చేస్తానని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు.



