వామపక్ష కార్మిక సంఘాల డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ, సిఐటి యు, టి యు సి ఐ సంఘాల ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రధానంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని, అనారోగ్యం పాలైన, లేదా మరణించిన కార్మికుల స్థానంలో సభ్యులకు ఉపాధిని కల్పించాలని, ఇటీవల మున్సిపల్ అధికారులు 7 గురు కార్మికులకు ఒక గ్రూపు చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారని దీని మూలంగా నెలలో రెండు మూడు రోజులపాటు అనేకమంది కార్మికులు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుందని. దానికన్నా ఇప్పటికే ఉన్న సెల్ఫ్, హెల్ప్ గ్రూపులను కొనసాగిస్తూ. మిగతా కార్మికులకు 50 నుంచి 100 మంది వరకు ఒక గ్రూపును ఏర్పాటు చేసి వాటి ద్వారా వారి అకౌంట్లో జీతాలను వేయాలని వారు కోరారు.
గతంలో ప్రభుత్వం పెంచిన ఒక వెయ్యి రూపాయల వేతనం శానిటేషన్ డ్రైవర్లుగా పని చేస్తున్న వారికి ఇవ్వకుండా నిలుపుదల చేయటం సరైనది కాదని వారికి వెంటనే చెల్లించాలని కోరారు. అదేవిధంగా వారాంతపు సెలవులను, మరియు పండగ సెలవులను, కొనసాగించాలని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులకు మోటార్ సైకిళ్లను, టార్చ్ లైట్లను, శానిటేషన్ విభాగంలో పనిచేసే కార్మికులకు 2జతల బట్టలను, చెప్పులు, సబ్బులు, నూనెలు , పనిముట్లు వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించని ఎడల కార్మికులతో ఆందోళన చేయాల్సి వస్తుందని తెలిపారు. అదేవిధంగా గతంలో హామీ ఇచ్చిన మేరకు మెకానిక్ షెడ్ ను ఏర్పాటు చేయటంతో పాటు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికులను పెంచాలని పని భారాన్ని తగ్గించాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై . ఒమయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, టి యు సి ఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.



