ఈ వృద్ధి సరిపోదు

This growth is not enough–  ఉద్యోగాల కల్పనపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పించాలంటే ఎనిమిది శాతం ఆర్థికాభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉన్నదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆర్థిక వృద్ధి రేటు 6%-6.5% మధ్య నిలకడగా బాగానే ఉన్నప్పటికీ అవసరమైన ఉద్యోగాల కల్పనకు అది సరిపోదని చెప్పారు. దేశంలోని యువత ఉద్యోగ అవసరాలు తీర్చాలంటే ఆర్థిక వృద్ధిని త్వరితగతిన వేగవంతం చేయాలని సూచించారు. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజన్‌ వీడియో లింక్‌ ద్వారా పాల్గొంటూ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆర్థిక వృద్ధి రేటు 6%-6.5% మధ్య బలంగానే ఉన్నదని అన్నారు. అయితే ఉద్యోగాలు కల్పించాల్సిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుంటే ఇది తక్కువేనని చెప్పారు. దేశంలో ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చే కార్మికుల సంఖ్య లక్షల సంఖ్యలో ఉంటోందని అంటూ వారికి అవసరమైన ఉద్యోగాలను కల్పించలేకపోతున్నామని తెలిపారు.
దేశంలో నిరుద్యోగ రేటు రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా అక్టోబరులో 10.05%కి చేరింది. రాబోయే పది సంవత్సరాల్లో దేశంలో ఏడు కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ మూడింట రెండు వంతుల నిరుద్యోగ సమస్య మాత్రమే తీరుతుంది. వరుసగా మూడోసారి అధికార పీఠం అధిష్టించాలని ఆశిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని నిరుద్యోగ సమస్య కలవరపెడుతోంది.
చైనా, వియత్నాం సహా ఉత్పత్తి రంగంలో సమర్ధవంతంగా దూసుకుపోతున్న దేశాలతో పోటీ పడాలంటే దేశంలోని కార్మికులకు అవసరమైన శిక్షణ అందించాలని రాజన్‌ సూచించారు. ఇప్పుడిప్పుడే కోవిడ్‌ దెబ్బ నుండి కోలుకుంటున్నామని, ఇక నిలకడగా వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ఖర్చును పెంచాలని, బ్యాలన్స్‌ షీట్లను పారదర్శకంగా ఉంచాలని, ఎగువ మధ్య తరగతి ప్రజల డిమాండ్లను తీర్చాలని, అప్పుడే వృద్ధి సాధ్యపడుతుందని వివరించారు. చిప్‌ల ఉత్పత్తిలో చైనా అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని, ఈ విషయంలో మన దేశం బాగా వెనుకబడి ఉన్నదని రఘురామ్‌ రాజన్‌ అన్నారు.

Spread the love