– తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్
నవతెలంగాణ – బోనకల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలు చేస్తాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ తెలిపారు. లేబర్ కోడ్స్ వివి రామ్ జి చట్టం జాతీయ విత్తన విద్యుత్ సవరణ బిల్ల రద్దు చేయాలని సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలు చేపట్టిన జీపు జాత ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామానికి సోమవారం చేరుకుంది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బంధం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో మాదినేని రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ప్రజల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు.
అదేవిధంగా రాష్ట్రాల జాబితాలో ఉన్న హక్కులను కూడా బీజేపీ హరించి పార్లమెంట్ లొ చట్టాలు చేస్తూ నియంత్రత్వ ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. అత్యంత ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్లను అమలు, విద్యుత్ సాధన చట్టం విత్తన బిల్లు చట్టం వంటి అనేక వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. ఈ చట్టాలు దేశ ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తాయన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా వర్గీకరణ చేసిందన్నారు. వేతనాల కోడ్ 2019 ప్రకారం పారిశ్రామికవేత్తలు కనీస వేతనాలు ఇవ్వకుండా, తక్కువ వేతనాలతో పని చేయించుకునే వెసులుబాటుని కేంద్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇప్పటికే కనీస వేతనాలు కూడా లభించక కార్మికులు వేతనాల కొరకు ఆందోళన చేస్తున్నారన్నారు.
పారిశ్రామిక సంబంధాల కోడ్, కార్మికుల ట్రేడ్ యూనియన్లు పెట్టుకోకుండా ఆంక్షలు పెడుతుందన్నారు. సామాజిక భద్రత కోడ్ 2020 అసంఘీత కార్మికుల ద్వారానే కార్పొరేటర్ లాభాలు పొందవచ్చునని ఈ చట్టం స్పష్టం చేస్తుందన్నారు. ఈ చట్టాల వలన కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు తమ స్వలాభం కొరకే తప్ప కార్మికుల జీవన ప్రమాదాలు పెంచడం సామాజిక న్యాయం పాటించడం సామాజిక బాధ్యత నిర్వర్తించటం పన్నులు సక్రమంగా చెల్లించడం లాంటి పనులు చేయకుండా అక్రమ మార్గాల ద్వారా లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. వీరికి కేంద్ర ప్రభుత్వం నేరుగా చట్టాల రూపంలో హక్కు కల్పిస్తుందని విమర్శించారు.
ఒక షిఫ్ట్ భారత్ జి రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు
వికసిత్ భారత్ – జి రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం రూపొందించబడిందన్నారు. చట్టం వల్ల దేశంలోనే వ్యవసాయ కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ చట్టం ద్వారా ప్రతి వ్యవసాయ కార్మికుడికి వంద రోజులు పని కల్పించాలని, రోజుకు రూ. 307 రూపాయలు ఇవ్వాలని చట్టం పేర్కొంది అన్నారు. దేశంలో మొత్తం వ్యయంలో 90 శాతం కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్రాలు భరించవలసి ఉందన్నారు. ఈ చట్టం ద్వారా కరువు సమయంలో, కరోనా సందర్భంగా గ్రామీణ ప్రజలకు ఉపాధి దొరికింది అన్నారు. అందులో దళితుల 18.63 శాతం, గిరిజనుల 17.32 శాతం ఉపాధి పొందుతున్నారన్నారు. ఈ పథకానికి ప్రతి సంవత్సరం 2.5 లక్షల కోట్ల కేటాయించాలని ఒకవైపు ప్రజలు ఆందోళన చేస్తుండగా, మరొకవైపు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చి ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేస్తుందని ఆయన విమర్శించారు. మహాత్మ గాంధీ పేరు తొలగించి వికసిత్ భారత్ – జి రామ్ జి పేరుతో మార్పు చేయటమే కాక రాష్ట్రాలు 10 శాతం నుండి 40 శాతం భరించాలని నిర్ణయించడం దారుణం అన్నారు. ప్రస్తుతం అనేక రాష్ట్రాలు పది శాతం కూడా భరించలేని పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్ – జి రామ్ జి చట్టాన్ని రద్దుచేసి యధావిధిగా మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని అయిన డిమాండ్ చేశారు.
విద్యుత్ ఉత్పత్తి రాజ్యాంగం రీత్యా రాష్ట్ర జాబితాలోనిది: సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు
2025 విద్యుత్ సవరణ చట్టం రాష్ట్రాల హక్కులను హరించడమేనని సిఐటియు జిల్లా అధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు విమర్శించారు. ఉత్పత్తి కూడా రాజ్యాంగం రీత్యా రాష్ట్రాల జాబితాలోదన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి బలవంతంగా లాక్కొని పార్లమెంట్లో చట్టం చేసిందన్నారు. ఈ చట్టం ప్రకారం ఇకనుంచి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ బాధ్యతలు కేంద్ర పరిధిలో ఉంటాయన్నారు. ఇది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలుగజేస్తుందన్నారు. విద్యుత్ చార్జీలు కేంద్రమే విద్యుత్ రెగ్యులేటరీ కమిషనర్ ద్వారా నిర్ణయిస్తుందని తెలిపారు.
స్మార్ట్ మీటర్లు పెట్టి టారిఫ్ ముందుగానే వసూలు చేస్తారని తెలిపారు. ఉచిత విద్యుత్ రద్దు చేస్తారన్నారు. క్రాస్ సబ్సిడీ రద్దు చేయటం వల్ల వినియోగదారులందరూ ఉత్పత్తి ఖర్చు చెల్లించాల్సి ఉంటుందన్నారు. విదేశాల నుంచి విద్యుత్తును దిగుమతి చేసుకోవచ్చు అన్నారు. రాష్ట్ర హక్కులు పూర్తిగా తొలగించబడతాయి అన్నారు. సాంప్రదాయ విద్యుత్ సోలార్ వినియోగం పేరుతో చార్జీలు పెంచుతారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలలోకి 100 శాతం విదేశీ పెట్టుబడిన ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అన్నారు. ముఖ్యంగా ఇన్సూరెన్స్శ రంగంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడును అనుమతించటం వలన మన దేశ ప్రజల సంపదను విదేశాలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, వ్యతిరేక విధానాలన నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా జరిగే ఆందోళనలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. జనవరి 19న జరిగే కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగే నిరసన ప్రదర్శన, బహిరంగ సభలో వేలాది మంది కార్మికులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు
మెరుగు సత్యనారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మ విష్ణువర్ధన్, రాష్ట్ర కమిటీ సభ్యులు బంధం వెంకటరాజ్యం, ఎర్ర శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యురాలు పిన్నింటి రమ్య, శీలం నరసింహారావు, తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిఐటియు మండల కన్వీనర్ గుగులోత్ నరేష్ కో కన్వీనర్ నరేష్, బోయినపల్లి వీరబాబు సిపిఎం మండల కమిటీ సభ్యులు పిల్లలమర్రి వెంకట అప్పారావు, దొప్ప కొరివి వీరభద్రం, కందికొండ శ్రీనివాసరావు, దూబ భద్రాచలం, కొమ్మినేని సీతారాములు తదితరులు పాల్గొన్నారు.



