Friday, May 23, 2025
Homeప్రధాన వార్తలుజనానికి 'జయత్రి' కుచ్చుటోపీ

జనానికి ‘జయత్రి’ కుచ్చుటోపీ

- Advertisement -

ప్లాట్లు, కమర్షియల్‌ స్పేస్‌ పేరిట రూ.700 కోట్లు వసూలు
మూడేండ్లుగా తప్పించుకు తిరుగుతున్న యాజమాన్యం
ఎట్టకేలకు అరెస్ట్‌…
తూతూ మంత్రంగా కేసు నమోదు
డబ్బుల రికవరీ మా పని కాదంటూ చేతులెత్తేసిన వైనం
ఒకే కేసులో రెండు సార్లు అరెస్ట్‌లా?
లబోదిబోమంటున్న బాధితులు
లోతుగా దర్యాప్తు చేసి బినామీ ఆస్తులు వెలికి తీయాలని డిమాండ్‌

వెయ్యి రూపాయలు మోసం చేసినా…. వెయ్యి కోట్లు మోసం చేసినా ఒకటే కేసు. చట్టంలోని లొసుగులు ఆర్థిక నేరస్థులకు చుట్టంగా మారాయి. వాటిని ఆసరా చేసుకుని రియల్‌ ఎస్టేట్‌ పేరిట కొంతమంది భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరకే విల్లాలు… ప్లాట్లు అంటూ మధ్యతరగతిని నిండా ముంచుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఉదంతం ఆ కోవలోనిదే.. కాకర్ల శ్రీనివాస్‌ ఎండీగా జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ను మరి కొంత మందితో కలిసి 2021లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాడు. ప్రజల దగ్గర రూ.700 కోట్ల వరకు వసూలు చేసి మూడేండ్లుగా తప్పించుకుని తిరుగుతున్నారు. బాధితుల ఒత్తిడి మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు తాజాగా మరో సారి అరెస్ట్‌ చేసి తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కంపెనీ డైరెక్టర్లు, వారి బంధువులు, ఇతర బినామీల పేరున ఉన్న ఆస్తులపై విచారణ చేసి, తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర్ల శ్రీనివాస్‌ 2021లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. కొల్లా వీర వెంకట సత్యనారాయణ మూర్తి, రాజేష్‌ దిండు. యెల్లంటి చంద్రశేఖర్‌, మల్లయ్య సానెం, కొల్లా శ్రీనివాసరావు, హరిప్రసాద్‌ నాగుబండి, బొల్లా శ్రీనివాసరావులు కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. హైదరాబాద్‌లోని బాచుపల్లి, గోపనపల్లి మొదలగు ప్రాంతాల్లో వెంచర్లు ఏర్పాటు చేశారు. వాటిపై పెట్టుబడి పెడితే మంచి రాబడి ఉంటుందని ఏజెంట్లు, బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ప్రజలను నమ్మించారు. ప్లాట్ల విక్రయంతో పాటు బైబ్యాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఒక్కొక్కరి నుంచి వసూ లు చేశారు. 2021 నుంచి 2022 వరకు జయత్రి సంస్థ దాదాపు 2 వేల మంది దగ్గర రూ.700 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఆరో పణలున్నాయి. ఇందులో విల్లాలు, ప్లాట్ల నిర్మాణం పేరిట నిధులను సమీక రించారు. ఆరంభంలో పెట్టుబడి పెట్టిన పలు వురు… ప్లాట్ల అప్పగింత, కమర్షియల్‌ స్పేస్‌ల అద్దెల కోసం డిమాండ్‌ చేయడంతో సంస్థకు తాళాలు వేశారు. దాంతో కొంతమంది కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2002 డిసెంబర్‌లో కాకర్లతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అప్పటి నుంచి వారు తప్పించుకు తిరుగుతున్నారు. బాధితులు ఎన్ని సార్లు పోలీసులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. తాజాగా శుక్రవారం ఎండీ కాకర్లతో పాటు పలువురు డైరెక్టర్లను పోలీ సులు అరెస్ట్‌ చేసి మరోసారీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పలువురు బాధితులు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయిస్తే వారి వివరాలు నమోదు చేసుకుని పంపించారు. డబ్బులకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు లాభాలు వద్దనీ, చెల్లించిన అసలు నగదు ఇవ్వాలని వారు వేడుకుంటు న్నారు. డబ్బులు డిమాండ్‌ చేయటంతో వాయిదాలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నా రని బాధితులు వాపోతున్నారు. అందమైన బ్రోచర్లు, ఏజెంట్ల మాటలు నమ్మి తాము మోసపోయినట్టు తెలిపారు. తమను మోసం చేసిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేశారు.
జయత్రి సంస్థ ప్లాట్ల పేరిట జనం దగ్గర దాదాపు రూ.700 కోట్ల వరకు వసూలు చేసినట్టు బాధితులంటు న్నారు.. బాచుపల్లి, కోకాపేట తదితర ప్రాంతాల్లో తూతూ మంత్రంగా అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని మొదలుపెట్టి మధ్యలో వదిలేశారు. వాటిని ప్రారంభించిన సమయంలో 2021 నుంచి 2022 వరకు రెండేండ్లలో ఏజెంట్లు, ఇతర ప్రచార సాధనాల ద్వారా ప్రజలను ఆకర్షించి నిధులను సేకరించారు. అయితే వసూలు చేసిన మొత్తాన్ని విల్లాలు, ప్లాట్ల నిర్మాణం వైపు మళ్లించలేదనే ఆరోపణలున్నాయి. ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని డైరెక్టర్ల బంధువులు, స్నేహితులు ఇతర బినామీల పేరిట ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్టు బాధితులు ఆరోపించారు.
క్రైం ఒకటే .. అరెస్ట్‌లు రెండు సార్లా అంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఈ బ్యాచ్‌ను రక్షిస్తున్న అజ్ఞాత వ్యక్తులెవరని ప్రశ్నిస్తున్నారు. ఈ కోణంలో పోలీసుల దర్యాప్తు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీన్ని పాలకులు చెవికెక్కించు కుంటారా? లేదా అనే అనుమానాలూ వ్యక్తమవు తున్నాయి. గతంలో జరిగిన అనుభవాలే ఇందుకు నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు. 24 డిసెం బర్‌ 2022లో రావి శ్రీకాంత్‌ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు జయత్రి సంస్థపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు (ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 1045..2025 ) నమోదు చేశారు. జయత్రి ఎండీ కాకర్ల శ్రీనివాస్‌తో పాటు బొల్ల శ్రీనివాస్‌, మునీశ్వర్‌, శ్రీనివాస్‌లను నిందితు లుగా చేర్చారు. అయితే కాకర్ల ఒక్కడినే అరెస్ట్‌ చేయగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారని రిమాండ్‌ రిపోర్ట్‌లో రాశారు. అప్పటి నుంచి సదరు నిందితులను పట్టుకోలేదని బాదితులు ఆరోపిస్తున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని కంపెనీ డైరెక్టర్లు వారి బంధువులు, స్నేహితులు ఇతర బినామీల పేరిట ఈ మొత్తాన్ని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్టు బాధితులం టున్నారు. వాటిని రికవరీ చేసి అటాచ్‌ చేయాలంటే లోతుగా దర్యాప్తు చేయాలనీ, అందుకోసం సిట్‌ ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం
జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ మోసాలపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఎండీతో పాటు పలువురు డైరెక్టర్లను అరెస్ట్‌ చేశార. త్వరలో అతనితో పాటు మిగతా వారిని కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తాం. కంపెనీ చేతుల్లో మోసపోయిన వారికి సానుభూతి తెలియజేయడం తప్ప మేమేం చేయలేం. డబ్బుల రికవరీ మా పని కాదు.
రాజశేఖర రెడ్డి, సీఐ, కేపీహెచ్‌బీ, హైదరాబాద్‌
రేరా మధ్యంతర ఉత్తర్వు….
జయత్రి సంస్థ బాధితులు జయ డైమండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకుని తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీలో 2022లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై చర్య తీసుకున్న రేరా ప్రాజెక్ట్‌లోని ఇతర ప్లాట్లు అమ్మకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆలస్యానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని కంపెనీ రేరాకు తెలిపింది. జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సేకరించిన నిధులను ఎలా ఉపయోగించారనే దానిపై సమాచారాన్ని కంపెనీ ఇప్పటి వరకు వెల్లడించలేదు. మిగిలిన ప్లాట్లకు సంబంధించి రేరా ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -