Friday, May 23, 2025
Homeజాతీయంపైన పటారం…లోన లొటారం

పైన పటారం…లోన లొటారం

- Advertisement -

– కాంట్రాక్ట్‌ సిబ్బందితో నెట్టుకొస్తున్న కేవీలు, జేఎన్‌వీలు ొ శాశ్వత నియామకాలకు మంగళం
– కేటాయించిన నిధులనూ ఖర్చు చేయని దుస్థితి
– దిగజారిపోతున్న విద్యా ప్రమాణాలు

న్యూఢిల్లీ : కేంద్రీయ విద్యాలయాలలో (కేవీలు) గత సంవత్సరం డిసెంబర్‌ నాటికి 8,900 అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో జవహర్‌ నవోదయ విద్యాలయాలలో (జేఎన్‌వీలు) 6,800 అధ్యాపక (ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ పోస్టులు సహా), అధ్యాపకేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి….ఇవేవో ప్రతిపక్షాలు చెప్పిన లెక్కలు కావు. మహిళలు, పిల్లలు, విద్య, యువత, క్రీడలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ మార్చి 26న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలోని చేదు నిజాలు. ఈ గణాంకాలు రెండు విధాలుగా ఆందోళన కలిగిస్తున్నాయి.
2024వ సంవత్సరపు ఏన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ (ఏఎస్‌ఈఆర్‌) ప్రకారం…మూడో తరగతి చదువుతున్న ప్రతి నలుగురు విద్యార్థులలో కేవలం ఒకరు మాత్రమే రెండో తరగతి పాఠ్యపుస్తకంలోని విషయాలను చదవగలుగుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు మాత్రమే ప్రాథమిక తీసివేతలు చేయగలుగుతున్నారు. గత దశాబ్ద కాలంలో ప్రాథమిక విద్యా స్థాయి ఇంతగా దిగజారడం ఇదే ప్రథమం. గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత ఎంత నాసిరకంగా ఉన్నదో దీనిని బట్టి అర్థమవుతోంది.
లక్షకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు
కేవలం ఉపాధ్యాయుల కొరతే ఈ దుస్థితికి కారణం కాదు. 2023-24 సంవత్సరపు యూడీఐఎస్‌ఈ నివేదిక ప్రకారం దేశంలోని 1.1 లక్షల పాఠశాలలు ఒకే ఒక టీచర్‌తో నెట్టుకొస్తున్నాయి. కేంద్రీయ విద్యాలయాలలో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండడం దిగ్భ్రాంతిని కలిగిస్తోందని, ఉన్నత ప్రమాణాలు పాటించే కేవీలలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన పాఠశాలల పరిస్థితి ఏమిటని ఆర్థికవేత్త మిత్రా రంజన్‌ ప్రశ్నించారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే కేవీలు, జేఎన్‌వీలకు ప్రభుత్వం భారీగా నిధులు అందిస్తోంది. కానీ అవన్నీ ఖర్చు కాకుండా అలాగే మిగిలిపోతున్నాయి. మరోవైపు ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య పెరిగిపోతోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే 2030 నాటికి అందరికీ సెకండరీ విద్యను అందించాలన్న నూతన విద్యా విధాన లక్ష్యం ఎలా నెరవేరుతుంది?
అటానమస్‌ సంస్థలకు కేటాయింపులు
2025-26 ఆర్థిక సంవత్సరంలో పాఠశాల విద్య-అక్షరాస్యత శాఖకు రూ.78,572 కోట్లు కేటాయించారు. ఇందులో సింహ భాగం (79.75 శాతం) సమగ్ర శిక్షా అభియాన్‌ (పీఎం శ్రీ) వంటి కేంద్ర పథకాలకు ఖర్చు చేసేందుకు ఉద్దేశించారు. ఇదిలావుంటే మొత్తం నిధులు రూ.15,430.58 కోట్లలో 19.64 శాతం సొమ్మును కేవీలు, జేఎన్‌వీలు సహా పాఠశాల విద్య-అక్షరాస్యత శాఖ పరిధిలోకి వచ్చే నాలుగు స్వయంప్రతిపత్తి సంస్థలకే కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలకు బడ్జెట్‌ పంపిణీ అంచనాలు ఇలా ఉన్నాయి… కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌)కు రూ.9,503.84 కోట్లు (2024-25 సవరించిన అంచనాలు రూ.8727 కోట్లు), నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌)కి రూ.5,305.23 కోట్లు (2024-25 సవరించిన అంచనాలు రూ.5,370.79 కోట్లు), ఎన్సీఈఆర్టీకి రూ.593.71 కోట్లు (2024-25 సవరించిన అంచనాలు రూ.560.77 కోట్లు), నేషనల్‌ బాల్‌ భవన్‌ (ఎన్‌బీబీ)కి రూ.27.8 కోట్లు (2024-25 సవరించిన అంచనాలు రూ.24.32 కోట్లు) కేటాయించారు.
పెరిగిపోతున్న కాంట్రాక్ట్‌ నియామకాలు
సబ్జెక్టులను బోధించే అధ్యాపకుల కొరత కారణంగా అనేక మంది విద్యార్థులు మధ్యలోనే చదువులకు స్వస్తి చెబుతున్నారని రంజన్‌ అన్నారు. 8-12 తరగతులలో డ్రాపవుట్లు అధికంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. 6-8 తరగతుల విద్యార్థులతో పోలిస్తే 8-12 తరగతుల విద్యార్థులలో డ్రాపవుట్లు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9-10, 11-12 తరగతులు బోధించే అధ్యాపకుల సంఖ్య బాగా తక్కువగా ఉన్నదని యూడీఐఎస్‌ఈ నివేదిక చెప్పింది. ఇక్కడ ఆందోళన కలిగించే మరో విషయమేమంటే కేవీలలో కాంట్రాక్ట్‌ నియామకాలు పెరిగిపోవడం. 2023తో పోలిస్తే 2024లో కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమితులైన అధ్యాపకుల సంఖ్య రెట్టింపు అయింది.
కేవీల వంటి మోడల్‌ స్కూల్స్‌లో కాంట్రాక్ట్‌ నియామకాలు పెరగడంపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్‌ సిబ్బందికి తక్కువ వేతనాలు ఇస్తుండడంతో వారు విద్యాబోధనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. పైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ వంటి రిజర్వేషన్లు వీటిలో అమలు కావు. దేశంలోని 192 కేవీలు ఇప్పటికీ తాత్కాలిక భవనాల్లోనే నడుస్తున్నాయని పార్లమెంటరీ కమిటీ గుర్తించింది.
జేఎన్‌వీలదీ అదే దారి
ఇక నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌) విషయానికి వస్తే అది జవహర్‌ నవోదయ విద్యాలయాలను (జేఎన్‌వీలు) నిర్వహిస్తోంది. వీటి నిర్వహణ కోసం 2024-25లో రూ.5,800 కోట్లు కేటాయించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తాన్ని రూ.5,305 కోట్లకు కుదించడం పట్ల పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. జేఎన్‌వీలలో 23.6 శాతం అధ్యాపక పోస్టులు, 26.6 శాతం అధ్యాపకేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. 2023-24లో రూ.5,486 కోట్లు కేటాయించి దానిని రూ.5,470 కోట్లకు సవరించారు. అందులో రూ.5,469 కోట్లు ఖర్చు చేశారు. 2024-25లో రూ.5,800 కోట్లు కేటాయించి దానిని రూ.5,370 కోట్లకు సవరించారు. అందులో ఖర్చు చేసింది రూ.5,030.5 కోట్లు. జేఎన్‌వీలలోని ప్రతి నాలుగు పోస్టులలోనూ ఒకటి ఖాళీగా ఉంది. 2024 డిసెంబర్‌ 31 నాటికి ఖాళీగా ఉన్న 6,800 పోస్టులలో 4,022 పోస్టులు (58.6 శాతం) ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సహా ఉపాధ్యాయ పోస్టులే.
పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పింది?
సిబ్బంది కొరత, నిధుల వినియోగంలో అలసత్వం కారణంగా ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో విశ్వాసం సన్నగిల్లిపోతోందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారంతా ప్రైవేటు పాఠశాలల వైపు దృష్టి సారించాల్సి వస్తోంది. 2023-24లో ఒక్క టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ పోస్టును కూడా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయలేదని పార్లమెంటరీ కమిటీ గుర్తించింది. 2024-25లో ఎంతమంది ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించారన్న దానిపై డేటా అందుబాటులో లేదు. సెలవలు, సామాజిక భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు వంటి విషయాలలో కాంట్ట్రాక్ట్‌ అధ్యాపకుల సర్వీస్‌ నిబంధనలు భిన్నంగా ఉంటాయని, దీంతో వారు తమ విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నారని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. అధ్యాపకులకు, విద్యార్థులకు మధ్య సంబంధాలు దీర్ఘకాలం కొనసాగాల్సిన అవసరం ఉన్నదని, స్వల్పకాలిక ప్రాతిపదికన అధ్యాపకులను నియమిస్తే ఇది సాధ్యపడదని వారు తెలిపారు. కాంట్రాక్ట్‌ పద్ధతిని అధ్యాపకుల నియామకాలను వెంటనే నిలిపివేయాలని, బ్యాక్‌లాగ్స్‌ సహా ఖాళీలను ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా 2026 నాటికి భర్తీ చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది.
కేంద్రీయ విద్యాలయాల దుస్థితి
ఇక ఖాళీలు, ఖర్చు చేయని నిధుల విషయానికి వస్తే…కేవీలలో 8,977 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేటాయించిన నిధులలో రూ.620 కోట్లను ఖర్చు చేయలేదు. గత సంవత్సరం అక్టోబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 1,256 కేవీలు ఉన్నాయి. వాటిలో 13.56 లక్షల మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. 2024-25లో కేవీలకు రూ.9,302 కోట్లు కేటాయించారు. దానిని ఆ తర్వాత రూ.8,727 కోట్లకు సవరించారు. ఇందులో రూ.8,105 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్న సమయంలో సవరించిన అంచనాలను తగ్గించడం అవాంఛనీయమని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. పెద్ద సంఖ్యలో ఉన్న ఖాళీలు కేవీల పనితీరును, పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తాయని తెలిపింది. ఖాళీగా ఉన్న 8,977 పోస్టులలో 7,400 అధ్యాపక పోస్టులే. విద్యా శాఖ నుండి నిధుల విడుదలలో జాప్యం జరగడం వల్ల బడ్జెటరీ కేటాయింపులు తగ్గుతున్నాయని రంజన్‌ చెప్పారు. కొన్ని సంక్షేమ పథకాలు, ఉపకార వేతన కార్యక్రమాలను కొనసాగించకపోవడం కూడా నిధుల తగ్గింపుకు కారణం కావచ్చునని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -