Friday, May 23, 2025
Homeప్రధాన వార్తలుపేదల ఇండ్లకు కేంద్రం మోకాలడ్డు

పేదల ఇండ్లకు కేంద్రం మోకాలడ్డు

- Advertisement -

పీఎంఏవై లోగో తప్పనిసరంటూ మెలిక
ఉమ్మడి అకౌంట్‌లో రాష్ట్రం వాటా వేస్తేనే పీఎంఏవై పథకం వర్తింపు
1.30 లక్షల ఇండ్లకు అనుమతి కాగితాల్లోనే…
మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వలేదని రూ.500 కోట్ల బకాయి
షరతులు ఒప్పుకోబోమంటున్న రాష్ట్ర ప్రభుత్వం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన (పీఎంఏవై)లో ‘హౌస్‌ ఫర్‌ ఆల్‌’ అంటూ కేంద్ర ప్రభుత్వం నినాదమిచ్చినా… ఈ స్కీమ్‌లో అనేక కఠిన నిబంధనలు పెట్టింది. బీజేపీయేతర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వకుండా మెలిక పెడుతూ ఆంక్షలు విధించింది. ఆ నిబంధనలు మన రాష్ట్రానికీ నిధులు రాకుండా బ్రేకులు వేస్తున్నాయి. దీంతో ఆ స్కీమ్‌ నిర్వీర్యమవుతున్నది. ‘లబ్దిదారుడికి కరెంటు బిల్లు ఉండకూడదు. టూవీలర్‌ ఉండకూడదు. వికలాంగులు, ఒంటరి మహిళలు ఉండాలి’ అంటున్న కేంద్ర సర్కారు వీటితోపాటు మరెన్నో షరతులు విధించింది. మరో ముఖ్యమైన షరతు రాష్ట్రంలో నిర్మించే ఇండ్లకు పీఎంఏవై లోగో పెట్టాలనే నిబంధనా ఉంది. పేదల ఇండ్లకు సింహభాగం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. కేంద్రం చేసే కొద్దిపాటి సాయానికి కూడా ఆ లోగో ఎలా పెడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు గ్రామాల్లో రూ. 5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ఏడున్నర లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తమ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే నిధులిస్తాంటూ కేంద్రం కొర్రీలు పెట్టింది. అందుకే కేంద్ర ప్రతిపాదనను మాజీ సీఎం కేసీఆర్‌ తిరస్కరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా దాన్ని ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు.
పట్టణాల్లో రూ. 1.50 లక్షలు, గ్రామాల్లో రూ. 72 వేలే
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో ఇల్లులేని పేదవారికి రూ.ఐదు లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ. ఆరు లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ. 1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాలకు రూ. 72వేలు ఇస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. ఆ నిధులను కూడా షరతులకు లోబడి విడుదల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమేమో ఇల్లు లేని పేదలు అని చెప్పింది. ఈ రెండింటి మధ్యన పొంతన కుదరకపోవడంతో రాష్ట్రానికి నిధులు రావడం లేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రావాల్సిన రూ. 500 కోట్లు ఇప్పటికీ రాలేదు. దీనికి మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వలేదనే సాకును కేంద్రం చెబుతున్నది. షరతులు సడలించకుండా నిధులు ఇస్తున్నామంటూ కాగితాల్లో చూపిస్తున్నది. పీఎంఏవై స్కీమ్‌ అర్బన్‌ ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల పేదలకు వర్తించటం లేదనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ హయాంలో పట్టణ ప్రాంతాల్లో 1.60 లక్షల ఇండ్లకు మంజూరు ఇచ్చింది. తాజాగా మరో 1.13 లక్షల ఇండ్లను మంజూరు చేసింది. కానీ నిధులు మాత్రం ఉమ్మడి అకౌంట్‌లో ఉన్నాయి. రాష్ట్రానికి ఉపయోగం లేకుండా మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఎలా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన.
పది మందికి కూడా రాని పరిస్థితి
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో వంద మందిని సర్వే చేస్తే పది మందికి కూడా పీఎంఏవై ఇండ్లు రావడం లేదు. పీఎంఏవై లోగోను అప్‌లోడ్‌ చేయటం, ప్రతి ఇంటికి జియోట్యాగింగ్‌ చేయాలనే నిబంధనలు ఈ పథకానికి అడ్డుపడుతున్నాయి. సర్వే చేసిన రిపోర్టును కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేస్తే అసలు తీసుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా ఇల్లులేని పేదలు ఉన్నప్పటికీ వారి పేర్లు అప్‌లోడ్‌ చేసినా కంప్యూటర్‌ తీసుకోవడం లేదు.ఫలితంగా లబ్దిదారులు ఎంపిక కావడం లేదు. దీంతో గత పదేండ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఇంటికి కూడా కేంద్ర సాయం అందడంలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -