ఆంధ్రాలో సిద్ధమైన బరులకు రాష్ట్ర సరిహద్దు జిల్లాల పరుగులు
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆన్‌లైన్ కేపీఎల్‌కు ఎంట్రీలు
రూ.5 లక్షలకుపైగా పందెంకు ఇప్పటికే బుకింగ్
నేటి నుంచి ఆదివారం వరకూ జోరు
గతేడాది ఒక పందెం రూ.1.25 కోట్లు.. ఈసారి ఎంతో..?
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
”ఆన్‌లైన్‌లోనూ కోడి ‘ఢీ’ అంటోంది. పందెంకు పుంజు కాలు దువ్వుతోంది. ఆంధ్రాలోని పందెపు బరుల వైపు ఆ రాష్ట్ర సరిహద్దు జిల్లాలు పరుగులు తీస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం రూ.5లక్షలకు పైగా కేపీఎల్ ఆన్‌లైన్ పందెం కాసేందుకు సిద్ధమయ్యారు. మొత్తమ్మీద సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేల జోరు మంగళవారం నుంచి ఆదివారం వరకూ హోరాహోరీగా సాగనుంది”.
ఆంధ్రప్రదేశ్‌లోని ఇటు గుంటూరు మొదలు అటు ఉభయగోదావరి జిల్లాల వరకూ చంకన పుంజుతో బరిలో దిగేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్ తదితర ప్రాంతాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్, ఆ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆన్‌లైన్ కోడి పందేల లీగ్(కేపీఎల్)పై ఆసక్తి చూపుతున్నారు.
రూ.5లక్షలకు పైగా పందెంకు షెడ్యూల్స్ ప్రకటిస్తూ ఆన్‌లైన్‌లోనే ఎంట్రీలు నమోదు చేసుకుంటున్నారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోడి పందెంలను నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నా.. పందెం రాయుళ్లకు అవేమీ పట్టడం లేదు. కోర్టులు తీర్పులివ్వటం, పోలీసులు చూసీచూడనట్టు ఉండటం సర్వసాధారణమనే చర్చ సాగుతోంది. ఏడాదిపొడువునా వ్యయప్రయాసలకు ఓర్చి.. ఎంతో జాగ్రత్తగా పెంచిన పందెం పుంజులకు కుక్కుటశాస్త్రం ప్రకారం కత్తులు కడుతున్నారు. సంక్రాంతి నేపథ్యంలో మంగళవారం నుంచి ఆదివారం వరకు పందేలు జోరుగా సాగుతాయని కోడిపందేల ఔత్సాహికులు చెబుతున్నారు. గతేడాది ఒక పందెం రూ.1.25 కోట్లు పలికిందని, ఈ సంవత్సరం దానిని మించి నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
బరులు సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో పేరు మోసిన కోడి పందెం రాయుళ్ల పేరుతో బరులు సిద్ధమయ్యాయి. సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన షెడ్యూల్స్ ప్రకటించారు. రూ.5 లక్షలు, రూ.9, 10 లక్షల బరుల షెడ్యూల్స్‌ను ఇప్పటికే వెల్లడించటంతో ఔత్సాహికులు ఎంట్రీలు నమోదు చేస్తున్నారు. వాట్సప్ ప్రయివేటు గ్రూపులు, ఫేస్‌బుక్, యూట్యూబ్, తదితర సోషల్ మీడియా ప్లాట్‌పామ్‌లలో ఈ పందెంల వివరాలు ట్రెండ్ అవుతున్నాయి. ఏలూరు జిల్లా దుగ్గిరాలలో ‘కాకతీయ కోడిపందెల ప్రీమియర్ లీగ్’లో రాష్ట్రవాసులు సైతం అనేక మంది ఎంట్రీలు నమోదు చేసుకున్నారని సమాచారం. సుమారు నాలుగువేల మంది గ్యాలరీలో కూర్చొని వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నారు.
ఇందుకు టిక్కెట్ కూడా నిర్ధారించారంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు చెందిన అనేక మంది పేరుమోసిన రాజకీయ నాయకులు సైతం ఆంధ్రప్రదేశ్ పందేల్లో భాగస్వాములు అవుతున్నారు. ఈసారి కూడా వారు అందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. ఒక్కో బరిలో రోజుకు 25-40 పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గతంకంటే కూడా సరిహద్దు ప్రాంతాల్లో బరులు భారీగా పెరిగాయి. గతంలో 150 వరకు ఉన్న బరులు ఇప్పుడు డబుల్ అయ్యాయని కోడి పందెం ప్రియులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లను బరులుగా మార్చేశారు.
పందెం కోళ్లకు భలే గిరాకీ
ఆంధ్రాలో జరిగే కోడి పందేలకు తెలంగాణలోని పందెం కోళ్లకు గిరాకీ బాగా పెరిగింది. ఒక్కో పందెం కోడి రూ.వెయ్యి మొదలు రూ.లక్షల్లో రేటు పలుకుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి, కల్లూరు తదితర మండలాల్లోని ఆయిల్‌పామ్, మామిడి తోటల్లో ప్రత్యేకంగా పెంచిన కోడిపుంజులను పందెంరాయుళ్లు భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. కుక్కుటశాస్త్ర నిపుణుల సలహాలతో ఈ ఏడాది సంక్రాంతి తిథులు.. పందేలు నిర్వహించే గడియలకు అనుగుణంగా నెగ్గుకొచ్చే కోడి పుంజుల రకాలకు భారీగా ధరలు వెచ్చిస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవన్నపాలెం మేలుజాతి పందెం కోళ్లకు ఖ్యాతిగడించింది. ఇక్కడ ఒక్కో పుంజు ధర రూ.10వేల నుంచి రూ.లక్షకు పైనే పలుకుతున్నాయి. అసీల్, కాకి, నెమలి, డేగ వంటి స్వచ్ఛమైన దేశవాళీ రకాలను శాస్త్రీయ పద్ధతుల్లో పెంచుతున్నారు. పందెం పుంజులకు బాదం, పిస్తా, జీడిపప్పు, ఉడికించిన కోడిగుడ్లు, తృణధాన్యాలను ఆహారంగా ఇచ్చి పెంచుతున్నారు. వీటికి ప్రత్యేక శిక్షణ సైతం ఇస్తున్నారు.
కోడి పందేలను అడ్డుకుంటున్నాం..
కోడి పందేలు జరగకుండా అడ్డుకుంటున్నాం. సంక్రాంతి సందర్భంగా చేపట్టే వివిధ నిషేధిత అంశాలపై దృష్టి సారించాం. కోడి పందేలతో పాటు సింథటిక్ మాంజా వంటివి విక్రయించకుండా చర్యలు చేపట్టాం. ఇప్పటికే సత్తుపల్లి, వైరా డివిజన్‌లలో కోడిపందేల నిర్వాహకులు అనేక మందిపై కేసులు నమోదు చేశాం. ఇటీవల ప్రతిరోజూ సత్తుపల్లి, వైరా డివిజన్‌లలో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. -వసుంధర యాదవ్, ఏసీపీ, సత్తుపల్లి



