దానికి యూడీఎఫ్ మద్దతు ఇస్తోంది: సీఎం పినరయి విజయన్
తిరువనంతపురం: కేరళ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కూడా కేంద్రం వైఖరికి మద్దతు ఇచ్చే వైఖరిని అవలంబిస్తోందని తెలిపారు. ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నప్పుడు కేరళ అభివృద్ధి చెందకూడదనే ‘నీచమైన వైఖరి’తోనే ఆ పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. పాలయం అమరవీరుల స్మారక చిహ్నం ఎదుట నిరసనను ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ చట్టబద్ధమైన డిమాండ్లను పరిరక్షిం చడానికి ఈ ఆందోళనను చేపడుతున్నామని వివరించారు. ”ఈ రాష్ట్రాన్ని నాశనం చేయవద్దని, కేరళకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటిని నిరాకరించవద్దని కేంద్రానికి చెప్పడానికే ఈ నిరసన చేపట్టాం. రాష్ట్రం తనకు అర్హత లేనిది ఏదీ అడగడం లేదు” అని ఆయన చెప్పారు.
ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కేరళను ప్రేమించే వారందరూ ఏకమై గళం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కొన్ని శక్తులు అలా చేయడానికి ఇష్టపడకపోవడం దురదృష్ట కరమని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కేరళపై కేంద్రం సాగిస్తున్న కక్షపూరిత చర్యలకు మద్దతుగా నిలుసు న్నాయని సీఎం పినరయి విజయన్ అన్నారు. ఇది అత్యంత దురదృష్ట కరమైన పరిస్థితి అని తెలిపారు. ఈ పరిస్థితి వల్లే రాష్ట్రం ఇలాంటి పోరాటంలోకి దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో, మంత్రులు, ఎన్నికైన ప్రతినిధులు, ఎల్డీఎఫ్ నాయకుల భాగస్వామ్యంతో పాలయం అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నిరసన జరిగింది. ముఖ్యమంత్రి నాయకత్వంలో గతంలో న్యూఢిల్లీలో జరిగిన ఆందోళనకు ఇది కొనసాగింపు అని సీపీఐ(ఎం), ఎల్డీఎఫ్ నేతలు వెల్లడించారు.
పొలిట్‌బ్యూరో సంఘీభావం
కేరళ ప్రభుత్వం సోమవారం తిరువనంతపురంలో ప్రారంభించిన సత్యాగ్రహానికి పొలిట్‌బ్యూరో సంపూర్ణ మద్దతును ప్రకటించింది. సమాఖ్యవాదంపై కేంద్రం దాడిని, రాష్ట్రాల హక్కులను నిరాకరించడాన్ని నిరసిస్తూ తమ హక్కుల పరిరక్షణ కోసం ఎల్డీఎఫ్ ప్రభుత్వం సాగించిన పోరాటానికి సంఘీభావం తెలిపింది. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కూడా ఈ పోరాటం జరుగుతోందని పేర్కొంది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరించే ఆర్థిక వివక్ష కారణంగానే గత ఐదేళ్ళ కాలంలో కేరళ రూ.57వేల కోట్ల మేరకు రెవిన్యూను కోల్పోయింది.
పన్నుల వాటాల్లో, గ్రాంట్లు, పథకాల నిధుల్లో కూడా కేరళ వాటా కుదించబడింది. రాజ్యాంగ నిబంధనలకు తప్పుగా భాష్యం చెప్పడం ద్వారా రుణాల పరిమితులపై కూడా ఆంక్షలు విధించారు. కేంద్ర పన్నుల్లో కేరళ వాటా 10వ ఆర్థిక సంఘం సమయంలో 3.875 శాతం వుండగా, ప్రస్తుత 15వ ఆర్థిక సంఘం హయాంలో కేవలం 1.925శాతానికి పడిపోయింది. 2024-25లోనే, దీనివల్ల రాష్ట్రానికి రూ.27వేల కోట్ల నష్టం సంభవించింది. రాష్ట్రానికి చెల్లించాల్సిన అనేక చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెడుతూ వస్తోంది. వీటన్నింటి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.



