రామగుండం గడ్డపై సీపీఐ(ఎం) భూపోరాట విజయం
300 మంది నిరుపేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ
హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్
విజయోత్సవ ర్యాలీతో దద్దరిల్లిన గోదావరిఖని
నవతెలంగాణ- కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
అది మూడు సంవత్సరాల కిందటి మాట.. గూడు లేని వేలాది మంది పేద గుండెల్లో సొంతింటి ఆశలు చిగురించిన సమయం. ఎర్రజెండా నీడన, సీపీఐ(ఎం) నాయకత్వంలో గోదావరిఖని, రామగుండం పరిసరాల్లోని ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో వేలాది గుడిసెలు వెలిశాయి. పోలీసుల లాఠీలు ఎదురొచ్చినా, జేసీబీలు గుడిసెలను కూల్చేస్తున్నా.. వెనుకడుగు వేయని ఆ పేదల పట్టుదలకు, సీపీఐ(ఎం) నిరంతర పోరాటానికి నేడు ఫలితం దక్కింది. ఎట్టకేలకు 300 మంది పేదల చేతుల్లోకి ఇండ్ల పట్టాలు అందడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రులు భట్టి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చేతుల మీదుగా పట్టాలు అందుకోవడంతో ఆ పేదల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. రామగుండం పారిశ్రామిక గడ్డపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సాగిన భూపోరాటం చివరకు ఒక సువర్ణ అధ్యాయానికి దారితీసింది.
సుమారు మూడేండ్ల కిందట గోదావరిఖని, రామగుండం పరిధిలోని ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ఇల్లు లేని వేలాది మంది నిరుపేదలతో కలిసి సీపీఐ(ఎం) ‘భూపోరాటం’ ప్రారంభించింది. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వకుండా, పట్టాలు మంజూరు చేయకుండా జాప్యం చేయడంతో అద్దెలు కట్టలేక అల్లాడుతున్న పేదల పక్షాన నిలిచిన ఎర్రజెండా నీడన గుడిసెలు వేశారు. అప్పటి ప్రభుత్వం ఈ పోరాటాన్ని అణచివేసేందుకు ప్రయత్నించింది. జేసిబీలతో గుడిసెలను కూల్చేయడం, కార్యకర్తలను అరెస్టు చేయడం వంటి చర్యలతో భయభ్రాంతులకు గురిచేసినా, పేదలు వెనక్కి తగ్గలేదు. పాములు, తేళ్లు, దోమల కాటుకు ఓర్చుకుంటూ.. కరెంటు, నీళ్లు లేని పరిస్థితుల్లోనూ గుడిసెలను కాపాడుకున్నారు. పోలీసు బలగాలతో నాయకులను నిర్బంధించినా సీపీఐ(ఎం) వెనక్కి తగ్గలేదు. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలతో పాలకుల నిద్రపోగొట్టింది. ‘భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం’ అన్న నినాదంతో రామగుండం నియోజకవర్గంలో భూపోరాటం ఉవ్వెత్తున ఎగిసింది.
విజయోత్సవ ర్యాలీతో దద్దరిల్లిన గోదావరిఖని
ఇండ్ల పట్టాల పంపిణీ అనంతరం సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎర్రజెండాల రెపరెపల మధ్య, డప్పు దరువులతో గోదావరిఖని వీధులు దద్దరిల్లాయి. శ్రామిక భవన్‌లో జరిగిన సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వై.యాకయ్య మాట్లాడుతూ.. మిగిలిన 300 మందికి కూడా తక్షణమే పట్టాలు ఇవ్వాలని, వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేదలు నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న మిగిలిన నిరుపేదలందరికీ ఎలాంటి జాప్యమూ లేకుండా పట్టాలు అందించాలని కోరారు. ‘చదువుకున్న వాడికి పుస్తకం.. సాగు చేసేవాడికి భూమి..నివసించే పేదవాడికి ఇల్లు దక్కేవరకు ఎర్రజెండా పోరాటం ఆగదు’ అన్నరీతిలో విజయం కేవలం 300 మంది కి పట్టాలు రావడం మాత్రమే కాదు, ఐక్యం గా పోరాటం చేస్తే పేదలకు న్యాయం జరుగుతుందని నిరూపించిన అద్భుత ఘట్టంగా నిలిచిపోనుందని అన్నారు.
ఎన్నికల హామీ – నెరవేరిన పట్టాల పంపిణీ
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ పోరాటం తీవ్రరూపం దాల్చడంతో, కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ పేదల పక్షాన నిలబడి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత తన మాటను నిలబెట్టుకుంటూ, ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని 300 మంది పేదలకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లో లక్ష మంది పేదలు ఇదే తరహాలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని, రామగుండం ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రమంతటా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.



