సొమ్మొకడిది..సోకొకడిది..
కేంద్ర పన్నుల్లో తెలంగాణకు నామమాత్రపు చెల్లింపులు
ప్రతీయేటా రిక్తహస్తమే
బడ్జెట్ వేళ నివ్వెరపోతున్న రాష్ట్ర ప్రభుత్వం
బి.వి.యన్.పద్మరాజు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఢిల్లీలో కలిశారు. ‘మా రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు ఇతోధికంగా ఆర్థిక సాయం చేయండి..మాకు ఇస్తున్న వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చండి…’ అంటూ ఆయన కేంద్ర విత్తమంత్రిని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనలకు ఆర్థిక మంత్రి మనసు కరుగుతుందో లేదో తెలియదుగాని.. మోడీ సర్కార్ మాత్రం తెలంగాణకు అడుగడుగునా ధోకా ఇస్తోంది. 2020-21 నుంచి 2024-25 వరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, ఇతర చెల్లింపులు, గ్రాంట్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ ఆరేండ్ల కాలంలో మన రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లింది రూ.4.32 లక్షల కోట్లు కాగా.. అక్కడి నుంచి తెలంగాణకు వచ్చింది మాత్రం రూ.1.84 లక్షల కోట్లే కావటం గమనార్హం. అంటే మన దగ్గరి నుంచి వెళ్లిన పన్నుల్లో రూ.2.48 లక్షల కోట్లను కేంద్రం తన దగ్గర పెట్టుకుని వాడుకున్నదన్నమాట. దీన్నిబట్టే తెలంగాణ పట్ల మోడీ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది.
అదనంగా కేంద్రం వద్ద పోగుపడిన సొమ్ము ఇంచుమించు మన రాష్ట్ర బడ్జెట్ (మన పద్దు ప్రతీయేటా రూ.2 లక్షల కోట్లకు అటుఇటుగా ఉంటోంది)తో సమానంగా ఉందంటే.. తెలంగాణ ఏ మేరకు నష్టపోయిందో అర్థం చేసుకోవచ్చు. సెంట్రల్ ట్యాక్సులు, ఇతర పంపిణీల్లో సొమ్ముకొడది.. సోకొకడిది అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. 2020-21 నుంచి 2024-25 వరకు ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ వసూళ్ల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.4.32 లక్షల కోట్లు కేంద్రానికి వెళ్లాయి. మొత్తం సెంట్రల్ గవర్నరమెంట్‌కు వెళ్లిన దాంట్లో ఇది 3.87 శాతంగా నమోదుకాగా..అక్కడి నుంచి మనకొచ్చింది మాత్రం రూ.1.84 లక్షల కోట్లే. ఇది మొత్తం వసూళ్లలో 2.45 శాతంగా నమోదైంది. రాష్ట్రం పట్ల మోడీ సర్కార్ వైఖరి ఈ విధంగా ఉండటంతో బడ్జెట్ వేళ ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. తెలంగాణ నుంచి ఇంత పెద్ద మొత్తంలో కేంద్రానికి నిధులు వెళుతున్న క్రమంలో.. అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన స్థాయిలో పన్నుల్లో వాటాలు, ఇతర గ్రాంట్లు రాకపోవటంతో అంతిమంగా ఖజానాపై విపరీతమైన భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోగైంది రూ.36 లక్షల కోట్లు…
2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 వరకు పన్ను వసూళ్లు, జీఎస్టీ చెల్లింపుల రూపంలో కేంద్రానికి.. రాష్ట్రాల నుంచి రూ.111 లక్షల కోట్లు సమకూరాయి. వాటిలో ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.75 లక్షల కోట్లను పంపిణీ చేశారు. అంటే రాష్ట్రాల నుంచి వసూలు చేసిన పన్నుల్లో కేంద్రం వద్ద రూ.36 లక్షల కోట్లు అదనంగా ఉండిపోయాయన్నమాట. పన్నుల రూపంలో అత్యధికంగా కర్నాటక నుంచి రూ.14.14 లక్షల కోట్లు వెళితే.. కేంద్రం ఆ రాష్ట్రానికి విదిల్చింది రూ.2.93 లక్షల కోట్లే. మహారాష్ట్ర నుంచి రూ.40.3 లక్షల కోట్లు కేంద్రానికి వెళితే.. అక్కడి నుంచి ఆ రాష్ట్రానికి వచ్చింది రూ.4.99 లక్షల కోట్లే. ‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలను బిచ్చమెత్తుకునే విధంగా తయారు చేసింది. ఇది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం. దేశంలోని ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీసేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర ఇది…’ అని ఆర్థిక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పన్నులు, జీఎస్టీయే కాకుండా సెస్‌లు, సర్ ఛార్జీల రూపంలో రాష్ట్రాల నుంచి లక్షల కోట్లను దండుకుంటున్న కేంద్రం.. వాటిని తిరిగి చెల్లించేందుకు మాత్రం నిరాకరించటం గమనార్హం.



