Tuesday, January 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్

- Advertisement -

దేశంలోనే రోల్‌ మోడల్‌, గేమ్‌ చేంజర్‌
పనుల పూర్తి క్యాలెండర్‌ ఖరారు చేయండి
ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లిస్తాం
జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రాష్ట్ర ప్రభుత్వం డ్రీమ్‌ ప్రాజెక్టు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం ప్రజాభవన్‌ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, చీఫ్‌ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణ ప్రగతిపై ఆరా తీశారు. వాటి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లదేనిని ఆయన స్పష్టం చేశారు. టెండర్లు పూర్తయిన చోట మంత్రి లేదా స్థానిక ఎమ్మెల్యేతో భూమి పూజ చేయించాలనీ, భవనాల నిర్మాణం పూర్తికి క్యాలెండర్‌ ఫిక్స్‌ చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ప్రతి వారం ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణ ప్రగతిపై సమీక్షించాలనీ, నెలలో ఒకసారి కలెక్టర్లు తమ పరిధిలోని ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణ ప్రదేశానికి తప్పకుండా వెళ్లాలని అక్కడే సమీక్ష నిర్వహించాలని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్స్‌ చెల్లిస్తామని తెలిపారు.

సమాజంలో వర్గాలుగా విడగొట్టబడినట్టు ఉన్న వారందరినీ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ ద్వారా ఒకచోటకు తమ ప్రభుత్వం తీసుకురాబోతుందని తెలిపారు. ఈ పాఠశాలలు దేశంలోనే ఒక రోల్‌ మోడల్‌గా, గేమ్‌ చేంజర్లుగా మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ఒప్పందం చేసుకున్న 15 రోజుల్లో కాంట్రాక్టర్లు పని ప్రారంభించక పోతే కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అత్యధిక శాతం స్కూల్స్‌ అందుబాటులోకి రావాలని ఆదేశించారు. స్థానికంగా భూమి, ఇతర సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యే లేదా సీసీఎల్‌ఏ, చీఫ్‌ సెక్రటరీతో కలెక్టర్లు మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. బిల్డింగ్స్‌ నిర్మాణంలో ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్‌ కోసం థర్డ్‌ పార్టీ ఏజెన్సీని ఏర్పాటు చేయాలనీ, నిర్మాణం జరిగే ప్రాంతానికే క్వాలిటీ చెక్‌ బృందం వెళ్లాలని ఆదేశించారు. పనుల ప్రగతిపై వారానికి ఒకసారి చీఫ్‌ సెక్రటరీ కలెక్టర్ల నుంచి నివేదిక తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, ఎంపీ బలరాం నాయక్‌, చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -