Friday, May 1, 2026
E-PAPER
Homeజాతీయండాలర్‌ దెబ్బకు రూపాయి ఢమాల్‌

డాలర్‌ దెబ్బకు రూపాయి ఢమాల్‌

- Advertisement -

రూ.95.34 రికార్డు క్షీణత..వడ్డీ రేట్లు పెరగొచ్చు..
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్‌ కనిష్టాన్ని చవి చూసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, దేశీయ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడం, ఫారెక్స్‌ రిజర్వులపై ఒత్తిడి, ద్రవ్య లోటు పెరగడం తదితర పరిణామాలతో రూపాయి విలువ అగాథంలోకి పడిపోయింది. గురువారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సేంజీలో డాలర్‌తో రూపాయి విలువ 95.01 వద్ద ప్రారంభమైంది. ఓ దశలో కొంత పుంజుకుని 95.25 వద్ద నమోదయ్యింది. తుదకు 0.51 శాతం లేదా 46 పైసలు క్షీణించి 95.34 వద్ద ముగిసింది. ఇంతక్రితం మార్చి 30న 95.24 ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. ఆ తర్వాత మరింత పడిపోవడం ఇదే తొలిసారి. బుధవారం సెషన్‌లో 84.85 వద్ద నమోదయ్యింది.

ద్రవ్యోల్బణ ఒత్తిడి..
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవడం, పెరిగిన చమురు ధరల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరగడం భారత కరెన్సీపై ప్రభావాన్ని చూపింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం, విదేశీ నిధులు బయటకు వెళ్లిపోతుండటంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. రూపాయికి మద్దతును ఇవ్వడానికి గత నెల చివరిలో, ఈ నెల ప్రారంభంలో కేంద్ర బ్యాంక్‌ చేపట్టిన కరెన్సీ మద్దతు చర్యల వల్ల వచ్చిన లాభాలు హరించుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మరిన్ని కొత్త చర్యలు తీసుకోకపోతే గడ్డుకాలమే నని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూపాయిపై ఒత్తిడి ఇలాగే కొనసాగితే, స్పాట్‌ కరెన్సీ మార్కెట్‌లో చమురు సంబంధిత డాలర్‌ డిమాండ్‌ను నియంత్రించడం, బంగారం దిగుమతులను తగ్గించడం, కరెన్సీకి మద్దతుగా ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వంటి చర్యలను రిజర్వ్‌ బ్యాంక్‌ పరిశీలించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు
కరెన్సీ నిరంతరం బలహీనపడటం వల్ల విదేశీ పెట్టుబడిదారుల లాభాలు తగ్గిపోతాయి. దీంతో విదేశీ మూలధన ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే దిగుమతి ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి మరింత పెరుగుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 2026లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు రూ.1.8 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఎక్కువ భాగం మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే జరిగింది. ఇది చరిత్రలోనే అత్యధిక అమ్మకం కావడం గమనార్హం. రూపాయి పతనంతో ద్రవ్యోల్బణం పెరగనుందని.. ధరలను అరికట్టడానికి ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తిరిగి పెంచవచ్చని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌కు చెందిన లీడ్‌ ఎకనామిస్ట్‌ అలెగ్జాండ్రా హెర్మన్‌ ప్రసాద్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -