Friday, May 23, 2025
Homeరాష్ట్రీయం29 నుంచి గ్రూప్‌-2అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

29 నుంచి గ్రూప్‌-2అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

- Advertisement -

జూన్‌ 10 వరకు హైదరాబాద్‌లో నిర్వహణ
టీజీపీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్‌ నికోలస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గ్రూప్‌-2 అభ్యర్థులకు ఈనెల 29 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కార్యదర్శి ఈ నవీన్‌ నికోలస్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చేనెల పదో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి హైదరాబాద్‌ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (పొట్టి శ్రీరాములు)లో ఈ ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన గ్రూప్‌-2 అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు అవసరమైన సమాచారాన్ని వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల 26 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ ధ్రువపత్రాలను తీసుకురావాలని కోరారు. ఈనెల 27 నుంచి వచ్చేనెల 11వ తేదీ వరకు గ్రూప్‌-2 అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాలని తెలిపారు. ఎవరైనా అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలను తీసుకురాకపోతే మరుసటిరోజు తేవాలని సూచించారు. ఆ తర్వాత అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు. కేటాయించిన తేదీలో అభ్యర్థులు గైర్హాజరైతే మరుసటిరోజు హాజరయ్యేందుకు అవకాశముందని పేర్కొన్నారు. అయినా రాకుంటే ఆ తర్వాత జరిగే ప్రక్రియకు అనర్హులవుతారని తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన, గైర్హాజరు, తిరస్కరణ, వెబ్‌ఆప్షన్ల నమోదులో ఇబ్బందుల వల్ల సరిపోయినంత మంది ఎంపిక కాకుంటే అదనంగా ధ్రువపత్రాల పరిశీలన కోసం ఎంపిక చేస్తామని వివరించారు. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ 29న గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్‌-2 పోస్టులకు 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారి కోసం గతేడాది డిసెంబర్‌ 15, 16 తేదీల్లో 33 జిల్లాల్లో రాతపరీక్షలను నిర్వహించారు. వారిలో 2,49,964 మంది అభ్యర్థులు అన్ని పేపర్లకూ హాజరయ్యారు. వారిలో 2,36,649 మంది అభ్యర్థులు జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా (జీఆర్‌ఎల్‌)కు అర్హత సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -