నవతెలంగాణ – ముధోల్
మనవరాలి ఉయ్యాల వేడుక కోసం సామగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్లిన మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్న ఘటన ముధోల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ బిట్ల పెర్సెస్ కథనం ప్రకారం మండలంలోని రాంటెక్ గ్రామానికి చెందిన సీడబోయిన విజయలక్ష్మీ అనే అంగన్‌వాడీ టీచర్, సోమవారం భైంసా పట్టణానికి వెళ్లారు. బస్టాండ్ సమీపంలోని సర్వీస్ పాయింట్‌లో రూ.13,000 నగదు విత్‌డ్రా చేసుకుని, వివిధ వస్తువులు కొనుగోలు చేశారు. అనంతరం ఉయ్యాల ఎక్కడ దొరుకుతుందని తోపుడు బండి వద్ద అడగగా, కూరగాయల మార్కెట్‌లో దొరుకుతుందని తెలియడంతో అక్కడికి వెళ్లి ఉయ్యాల కొనుగోలు చేశారు.
తిరిగి ఆటోలో బస్టాండ్‌కు వచ్చిన సమయంలో అక్కడ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు సహాయం చేస్తానంటూ పరిచయం పెంచుకుని, తాను మాచ్కల్ గ్రామానికి చెందినవాడినని, అక్కడికే వెళ్తున్నానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన విజయలక్ష్మి అతనితో కలిసి ధర్మాబాద్ వెళ్లే బస్సు ఎక్కారు.
రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో మాచ్కల్ ఎక్స్ రోడ్ వద్ద మహిళ బస్సు దిగడంతో ఆ గుర్తుతెలియని వ్యక్తీ కూడా బస్సు దిగాడు. అక్కడ నిందితుడు ఆమెను చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి, ఆమె ముఖంపై బలంగా కొట్టి, చేతిలో ఉన్న కవర్‌ను లాక్కొని పారిపోయాడు. అలాగే ఆమె మెడలో ఉన్న 2 తులల బంగారు చైన్‌ను కూడా లాక్కొన్నాడు. ఈ దాడిలో విజయలక్ష్మి ఒక పన్ను విరిగిపోయింది.
ఆమె వద్ద ఉన్న కవర్‌లో నగదు, మొబైల్ ఫోన్, బ్యాంక్ పాస్‌బుక్, ఏటీఎం కార్డు ఉన్నట్లు తెలిసింది. బాధితురాలు సహాయం కోసం కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఆమెను భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.



