Wednesday, January 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబ్యాగ్‌ బరువు ఉండదక్కడ!

బ్యాగ్‌ బరువు ఉండదక్కడ!

- Advertisement -

దేశంలో విద్యను ఒక సామాజిక హక్కుగా కాకుండా, మార్కెట్‌ వస్తువుగా మార్చే ప్రయత్నాలు పెరుగుతున్న ఈ కాలంలో విద్యావిధానంలో కేరళ రాష్ట్రం తీసుకొస్తున్న మార్పులు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక చర్చకు దారితీస్తున్నాయి. విద్యార్థులు బడికి వెళ్లాలంటే పుస్తకాల సంచి భుజంపై వేసుకుని వెళ్లాల్సిందే. ఆ బరువు మోయలేక చిన్నారులు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో ప్రతి ఒక్కరూ కళ్లారా చూస్తున్నదే. బరువును తగ్గించేందుకు పలు రాష్ట్రాలు ప్రయత్నాలు చేశాయి. పూర్తిస్థాయిలో ఆ భారం లేకుండా చేయలేకుండా పోతున్నాయి. అయితే, కేరళలోని ఎల్డీఎఫ్‌ సర్కార్‌… విద్యార్థులు బరువున్న బ్యాక్‌ప్యాక్‌లతో కాకుండా బ్యాగులు తేలికగా ఉండేలా చర్యలు తీసుకుని శభాష్‌ అనిపించుకుంది. స్కూల్‌బ్యాగుల బరువును తగ్గించడం, బ్యాక్‌బెంచర్లు లేని తరగతి గదులను సృష్టించడం అనే ప్రతిపాదనను ఆ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక స్టీరింగ్‌ కమిటీ ఆమోదించింది. ఇప్పటికే ఎన్నో ప్రజాస్వామిక నిర్ణయాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కేరళ ఒకటి ఆరు తరగతుల పిల్లలకు బ్యాగ్‌ భారం తప్పించబోతుంది. దేశంలోని అక్షరాస్యత విషయంలో దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంగా నిలిచిన కేరళ.. దాన్ని అలానే కొనసాగిం చేందుకు, విద్యార్థులు పాఠశాలలకు పరుగులు తీసేలా వెసులుబాటు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం మెచ్చుకోదగింది.
దేశంలోని ఆయా రాష్ట్రాల పరిస్థితిని పరిశీలిస్తే, విద్యార్థులపై మోపడుతున్న భారం ఎంత తీవ్రమైందో అందరికీ తెలిసిందే. దీనిపై న్యాయస్థానాలు ఎంత మొత్తుకున్నా అమలు చేయించాల్సిన ప్రభుత్వాల మార్గదర్శకాలు కార్పొరేట్‌, ప్రయివేటు విద్యాసంస్థల లాభాపేక్ష ముందు నిర్వీర్యమవుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న చిన్నారులే తమ శరీర బరువులో మూడోవంతుకు పైగా బరువైన బ్యాగులు మోస్తున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్‌బుక్స్‌, గైడ్‌లు, వర్క్‌బుక్స్‌, ప్రయివేట్‌ పాఠశాలల అదనపు మెటీరియల్‌ అన్నీ కలిపి బ్యాగ్‌భారంగా మారింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, న్యాయస్థానాల సూచనలు ఉన్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. పిల్లలు చదువుకోడానికి పాఠశాలకు వెళ్లాలా లేక శ్రమను మోయడానికి కూలీల్లా మారాలా అన్న స్థాయికి వెళ్లింది. కేరళ మాత్రం ఈ సమస్యను పాలనా అంశంగా కాకుండా, బాలల హక్కుల ప్రశ్నగా చూసింది. ఈ విధానం ద్వారా అవసరం లేని పుస్తకాలను తగ్గించడం, తరగతిలోనే ఎక్కువగా నేర్పడం, డిజిటల్‌ వనరులను వినియోగించడం ద్వారా పిల్లలపై భారం తగ్గించాలని అనుకోవడం హర్షనీయం. పుస్తకాలు స్కూల్స్‌లోనే ఉంచేలా ఏర్పాట్లు చేయనుంది. హోం వర్క్‌ ఉండదు. చదువంటే భయం కాదు, ఆనందం కావాలన్న భావన విధానాల రూపంలోకి తీసుకొచ్చింది.
ప్రయివేటీకరణ, కోచింగ్‌ సంస్కృతి, మార్కుల పోటీతో విద్యార్థులపై పెరుగుతున్న మానసిక-శారీరక ఒత్తిడికి భిన్నంగా కేరళ విద్యావిధానం మానవీయతను, సమానత్వాన్ని కేంద్రంగా పెట్టింది. తరగతి గదిలో ముందు బెంచ్‌, వెనుక బెంచ్‌ అనే విభజన కేవలం కూర్చునే పద్ధతి మాత్రమే కాదు; అది సామాజిక అసమానతల ప్రతిబింబం. కొందరిని ‘ప్రతిభావంతులు’, మరికొందరిని ‘అలసత్వం’గా ముద్రవేసే ఈ విధానాన్ని కేరళ సవాలు చేయడం మామూలు విషయం కాదు. వృత్తాకారంగా, సమూహాలుగా కూర్చునే విధానం ద్వారా ప్రతి విద్యార్థికీ సమాన అవకాశాలు కల్పించాలన్న దృక్పథం అక్కడ అమలవుతోంది. ఇది విద్యలో ప్రజాస్వామ్య విలువలను బలపరుస్తుందనేది విద్యావేత్తల ప్రగాఢ విశ్వాసం.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ విద్యా ప్రమాణం అంటే ఎక్కువ పుస్తకాలు, అధిక హోంవర్క్‌, ఎక్కువ పరీక్షలేనన్న అపోహ బలంగా ఉంది. ఫలితంగా పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన, శారీరక సమస్యలు పెరుగుతున్నాయి. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై పెరుగుతున్న చర్చలు కూడా ఈ వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తున్నాయి. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు చదువు ఎలా చెప్పాలన్నా ఆలోచన నుంచి ఎంత త్వరగా సిలబస్‌ పూర్తి చేసి పరీక్షలకు సిద్ధం చేయాలనేది బలంగా నాటుకు పోయింది. ఈ నేపథ్యంలో కేరళ మోడల్‌ ఒక హెచ్చరికలా, ఒక మార్గదర్శకంలా నిలుస్తోంది. పరీక్షలను పూర్తిగా తొలగించకపోయినా, అవే ప్రతిభకు ఏకైక ప్రమాణమనే భావనకు తావు ఇవ్వడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు చాలారాష్ట్రాల్లో కేరళ విద్యావిధానంలో అమలువుతున్న కొన్నింటిని తీసుకుని అమలు చేస్తున్నాయి.
నేటి భారత విద్యావ్యవస్థకు కావలసింది మార్కుల పరుగు కాదు, కోచింగ్‌ సంస్కృతి కాదు, ఒత్తిడి కాదు; ఆలోచించే, ప్రశ్నించే, మానవీయ విలువలతో కూడిన మనిషిని తయారుచేసే విద్య. ఆ దిశగా కేరళ విద్య మోడల్‌ ఒక స్పష్టమైన దారి చూపుతోంది. దేశవ్యాప్తంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాఠాలు నేర్చుకుంటే, భారత విద్యావ్యవస్థ మరింత మానవీయంగా, సమానత్వాన్ని ప్రతిబింబించే విధంగా మారుతుంది. అప్పుడే విద్య నిజంగా జీవితానికి వెలుగును ప్రసాదిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -