నూతన సంవత్సరం సందర్భంగా ఎంతో ఆశావహంగా గడుపుదామను కుంటాంగానీ మన చుట్టూ నిరాశా జనకమైన వాతావరణం అలుముకుని ఉంది. ప్రపంచ పర్యావరణంలో ప్రతి కూల మార్పులు, సాయుధ ఘర్షణలు, వాణిజ్య యుద్ధాలు చోటుచేసుకుంటు న్నాయి. పొంచి ఉన్న అంటు వ్యాధులు, తీవ్రతరమవుతున్న ఆర్థిక అసమానతలు, సంకుచిత దేశభక్తి మాటున చెలరేగు తున్న విద్వేషపు జాతి హననాలు, వర్ణ వివక్ష వంటి అనేక సమస్యలు, సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి. అయినప్పటికీ మన చుట్టూ ఉన్న ప్రపంచం శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లు తుందన్న ఆశాభావం జనాల్లో నెలకొని ఉన్నది. ఆయురారోగ్యాలతో వర్థిల్లమని మనం దీవిస్తుంటాం. అయితే మన ఆరోగ్య రంగం పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ వైద్య సేవలు ఏ మేరకు ఆశాజనకంగా ఉన్నాయి. అన్న ప్రశ్న అదే రంగంలో పనిచేస్తున్న నాకు ఎదురవుతున్నది.
డబ్బుగల వారికి జబ్బు చేసినా ప్రయివేటు ఆస్పత్రుల్లో ఎంత ఖర్చు చేశాయినా తగిన వైద్యం పొందగలుగుతున్నారు. ఈ మధ్యనే ఒక బడా కార్పొరేట్ ఆస్పత్రి తన ఆదాయం ప్రతి రోగికి తలసరిన తొమ్మిది శాతం పెరిగి సుమారు లక్షా డెభ్బై వేల రూపాయలకు పైగా గిట్టుబాటు అవుతున్నదని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో రెండవ త్రైమాసిక ఆర్జన వివరాలు ఆ కార్పొరేట్ ఆస్పత్రిలో పెట్టుబడులు పెట్టిన వాటాదారులకు వీనుల విందుగా ఉండి ఉంటాయి గానీ మనకు తీవ్ర ఆందోళన కలిగిస్తాయి.ప్రజారోగ్య సంరక్షణ పట్ల నాకు ఉన్న అనురక్తి దృష్ట్యా ప్రభుత్వం సార్వజనీన ప్రజారోగ్య సంరక్షణ కోసం కేవలం మాటలకే పరిమితమైతే సరిపోదనిపిస్తుంది. ఈ విశాల భూభాగంలో నివసించే ప్రతిపౌరుడికీ కావాల్సిన సకల వైద్యసేవలు సులువుగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం సుధృడమైన కృషి చేపట్టాలి. ఆరోగ్యవంతమైన జనాభా దేశానికి ఎనలేని పెట్టుబడి అని ప్రభుత్వం గ్రహించాలి. అంతేగాక ఆరోగ్యాన్ని మానవ హక్కుగా పరిగణించాలి. ఆ హక్కును పరిపుష్టం చేసే నైతిక లక్ష్యంతో, భౌగోళిక, ఆర్థిక అడ్డంకులను అధిగమించి పౌరులందరికీ సార్వజనీన వైద్య సౌకర్యం కల్పించేలా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించాలి. ప్రభుత్వం కల్పించాల్సిన ఆరోగ్య సేవలు విస్త్త్తృతంగా ఉండాలి. రోగ నివారణ, రోగ నిర్థారణ, తగిన సమయంలో తగిన వైద్యమందేలా చూడడం, అవసరమైన మేరకు ఆస్పత్రిలో సంరక్షణ కల్పించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి పెద్దఎత్తున ప్రచారం చెయ్యడం వంటి అంశాలన్నీ నెరవేర్చాలి.
క్రియాశీల, సమత్వ, సహాను భూతితో కూడిన ఆర్థికంగా అందరికీ మెరుగైన ఆరోగ్య వ్యవస్థను అందు బాటులోకి తీసుకురావడానికి ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చెయ్యడం మౌలికమైన అవసరమని గుర్తించాలి. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆర్థికంగా, మానవ వనరుల పరంగా అత్యంత పటిష్టంగా ఇంటింటికీ వైద్య సేవలు, అందించేంత శక్తివంతంగా ఉండాలి. వీటిని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు గా, విశాల వేదికగా మలచడం ద్వారా అనేకానేక మానవాభివృద్ధి కార్యక్రమాలకు వీటినే మందుపీఠిన ఉండేలా రూపొందించ వచ్చు.అయితే ప్రాథమిక ఆరోగ్య సేవలు విడిగా మనజాలవు. కొంతమందికి మరింత మెరుగైన వైద్యం అవసరం పడుతుంది. తీవ్రమైన, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు తగిన వైద్యం అందించేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుబంధంగా సెకండరీ లేదా ప్రాంతీయ వైద్య సేవలు కూడా అందు బాటులోకి తీసుకు రావాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ‘రిఫరల్’ కేంద్రాలుగా పనిచెయ్యాలి. అవసరమైన వారికి మెరుగైన, అధునాతన వైద్య సేవలందేలా చూడడంతో పాటు ఆస్పత్రినుండి తిరిగి ఇంటికి వచ్చే శాక కూడా వైద్య పర్యవేక్షణ కొనసాగేలా చూడాలి. ఇదీ ఆదర్శవంతమైన ఆరోగ్య వ్యవస్థ నమూనా. కాని ప్రస్తుతం మన ఆరోగ్య వ్యవస్థ ఈ నమూనాకు అత్యంత దూరంలో ఉందనేది కఠోర వాస్తవం.
మన దేశంలో గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య సేవలు అస్తుబిస్తుగా ఉన్నాయి. గిరిజన గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సేవల అందుబాటు చాలా బలహీనంగా ఉన్నది. ఇక ‘జాతీయ ఆరోగ్య కార్యక్రమం’లో తమ స్థానం ఏమిటో తెలియని అయోమయ స్థితిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ నేషనల్ హెల్త్ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులలో కోతలు పడుతున్నకొద్దీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ డోలాయమాన పరిస్థితులను ఎదుర్కొంటున్నది.ఇక ప్రభుత్వ ప్రాయోజిత హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ‘ప్రధానమంత్రి జన ఆయుష్ యోజన’ (పిఎం.జె.ఎ.వై) ఆస్పత్రిలో ‘ఇన్-పేషెంట్’ ఖర్చులకు పూచీ పడుతుంది కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యసేవల ఖర్చులను ‘కవర్’ చేయడం లేదు. ప్రభుత్వ ప్రాయోజిత ఇన్సూరెన్స్ పథకాలేవీ ‘అవుట్ పేషెంట్’ చికిత్సకయ్యే ఖర్చులను భరించడం లేదు. వాస్తవానికి ‘అవుట్ పేషెంట్’ వైద్యానికి అయ్యే ఖర్చులో 60 నుండి 70 శాతం ఖర్చులు పరీక్షలు చేయించుకోవడానికి, మందులు కొనడానికే అవుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అవసరమైన తక్షణ వైద్య సేవలు అందించడంతో పాటు మెరుగైన వైద్య సౌకర్యం అవసరమైన వారిని మాత్రమే సెకండరీ/ప్రాంతీయ ఆస్పత్రులక ‘రిఫర్’ చేసే పటిష్ట వ్యవస్థగా కూడా పనిచేయాలి. చాలా దేశాల్లో రిఫరల్ వ్యవస్థను అనివార్యం చేశారు. తద్వారా సెకండరీ/ప్రాంతీయ ఆస్పత్రుల మీద ఒత్తిడి తగ్గుతుంది.
మన దేశంలో ప్రయివేటు వైద్యరంగ విస్తృతి చాలా ఎక్కువ. కాబట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ‘రిఫరల్’ వ్యవస్థగా క్రియాశీలంగా పని చేయడంలో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు. ప్రభుత్వ రంగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా ఆస్పత్రి లేదా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని స్పెషలిస్టు డాక్టర్ల నుండి టెలీ వైద్య సలహాలు, సేవలు పొందే వ్యవస్థను అభివఅద్ధి చేయాలి. అయితే ప్రయివేటు కార్పొరేట్ వైద్యరంగ విస్త్తృతి మూలంగా, ప్రాథమిక ఆరోగ్యరంగ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం మూలంగా, వైద్యవృత్తిలో నిపుణులు, నిపుణులు కానివారు కూడా ఉండడం వల్లనా చాలా చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య రంగంలోకి కార్పొరేట్ ప్రయివేటు రంగం కాలుపెడితే ‘రిఫరల్’ వ్యవస్థ ఆసుపత్రులకు లబ్ధి చేకూర్చే సాధనంగా మారుతుంది. కార్పొరేట్ ఆస్పత్రులు ప్రధానంగా నగరాలు, పెద్ద పట్టణాల్లో కేంద్రీకీతమై ఉన్నాయి. ఇవి అత్యంత ఆధునిక వైద్య సేవలు అందిస్తాయి. కానీ దానికయ్యే ఖర్చులు భారీగా ఉంటాయి. ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఎయిమ్స్’ వైద్య సంస్థలను నెలకొల్పడం ద్వారా ‘ప్రాంతీయ’ వైద్య సేవలను ప్రభుత్వ రంగంలో ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ప్రయివేటు యాజమాన్య కాలేజీ ఆస్పత్రులు కూడా ఈ సేవలందించవచ్చు. అయితే సెకండరీ వైద్యసేవల రంగం ఇప్పటికీ బలహీనంగా ఉంది కాబట్టి తక్షణమే జిల్లా ఆస్పత్రులను బలోపేతం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలి. అటు కేంద్ర ప్రభుత్వంగానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలుగానీ జిల్లా ఆస్పత్రులనుబలోపేతం చేయడానికి తగిన నిధులు కేటాయించకపోగా ఇందులో వివిధ సేవలను అవుట్సోర్స్ చేయడం లేదా ప్రయివేటు రంగం మౌలిక సౌకర్యాల పెంపుదలకు పెట్టుబడులు పెడితే యాజమాన్య నిర్వహణను వాటికి అప్పచెప్పడం కొనసాగుతుంది. దీనిమూ లంగా సార్వజనీన ప్రాథమిక ఆరోగ్య సేవలందించాలన్న లక్ష్యం, దీనితో అనుసంధానించి అందించాల్సిన సెకండరీ, ప్రాంతీయ వైద్యసేవలు ప్రజలకు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి.
జిల్లా ఆస్పత్రుల్లో రేడియాలజీ, లేబొరేటరీ సేవలందించ డానికి తగిన యంత్రాంగం, సాంకేతిక సిబ్బంది కొరత వల్ల వీటిని ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ప్రయివేటు రంగానికి అప్పచెప్పారు. అలాగే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటు వైద్య కళాశాలల స్థాపనకు అనువుగా జిల్లా ఆస్పత్రులను ఆయా కాలేజీలకు అప్పజెప్పాలనే ఆలోచనలో ఉన్నాయి. జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించక పోవడం మూలంగా ఈ దుస్థితి నెలకొన్నది.ప్రజారంగ ఆరోగ్య సేవలను ఏకీకృతం చెయ్యడం పట్ల విముఖత, ప్రయివేటు రంగం పట్ల ఉన్న మోజు మూలంగా ఈ ధోరణులు తలెత్తుతున్నాయి. ఇక్కడ మన గమనంలో ఉండాల్సిన ముఖ్యాంశం ఏమిటంటే ప్రయివేటు వైద్య రంగం ప్రధాన లక్ష్యం లాభార్జన మాత్రమే. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రయివేటు వైద్యరంగం అసలు రంగు బయటపడింది. కోవిడ్ వ్యాక్సిన్లలో కూడా ఈ రంగం వాటా కేవలం రెండు శాతమే. ప్రభుత్వమే వ్యాక్సిన్లు సరఫరా చేసినా ప్రజలకు సేవలు అందించడంలో మాత్రం ప్రయివేటు రంగం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. క్షేత్రస్థాయి వాస్తవాలు ఇవీ. ప్రభుత్వ రంగ వైద్య సేవలు అందుబాటు నానాటికీ క్షీణిస్తుంటే ప్రయివేటు రంగం విపరీతంగా ఆదాయాలు పోగేసుకుంటున్నది.
కేంద్ర ప్రభుత్వం వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణను అల్లోపతి, ఆయుర్వేద వైద్యాల జమిలి తరహాలో ఏకీకృతం చెయ్యాలని యోచిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రయివేటు రంగం జిల్లా ఆస్పత్రుల నిర్వహ ణను ఏమేరకు చేపడుతుందనేది సందేహమే. జిల్లా ఆస్పత్రులను బలోపేతం చేసి వాటికి అనుబంధంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను స్థాపించడమే సరైన పరిష్కారమ వుతుంది.జిల్లా ఆస్పత్రులను, వైద్య విద్యను ప్రయివేటీకరించడం మూలంగా సార్వజనీన ఆరోగ్యసేవలను అందజేయాలన్న లక్ష్యం దెబ్బతినిపోతుంది. మిశ్రమ ఆరోగ్య వ్యవస్థలో ప్రభుత్వం ప్రయివేటురంగ సేవలను కూడా యాథశక్తి వినియోగించు కోవాలి గానీ సార్వజనీన ఆరోగ్యసంరక్షణ పట్ల తనకున్న బాధ్యతను వదిలించుకోవాలని చూడకూడదు. చివరిగా, మనం జపాన్ను కూడా వెనక్కినెట్టి ప్రపంచంలోనే నాల్గవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని చెప్పుకుం టున్న నేపథ్యంలో ఆరోగ్యకర భారతదేశం అన్న ఆకాంక్షను సాకారం చేసుకోవాలే తప్ప ఆ బాధ్యతను వదిలించుకోవాలని చూడకూడదు. ప్రభుత్వం మనసుపెట్టి చిత్తశుద్ధితో వ్యవహరిస్తే మన ఆరోగ్యవ్యవస్థను చూసి కెనడా కూడా అసూయపడేలా చూడవచ్చు. గుండె వైద్య నిపుణుడిగా నేను చెప్పే మాటలు అక్షర సత్యాలు. (‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
డా. కె.శ్రీనాథ్‌రెడ్డి



