Wednesday, January 14, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీ కార్యాలయానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు

బీజేపీ కార్యాలయానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు

- Advertisement -

సంబంధాలు, సంప్రదింపులపై చర్చ
న్యూఢిల్లీ :
చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రతినిధులు సోమవారం న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయాన్ని సందర్శించి ఆ పార్టీ నేతలతో చర్చించారు. 2020లో గాల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత ఇరు పార్టీల మధ్య సంప్రదింపులు జరగడం ఇదే మొదటిసారి. చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ విభాగం సీనియర్‌ నేత (వైస్‌ మినిస్టర్‌) సన్‌ హయాన్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిందని బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం ఇన్‌ఛార్జ్‌ విజరు చౌతైవాలే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలియజేశారు. బీజేపీ, సీపీసీ మధ్య సంబంధాలను, సంప్రదింపులను ఎలా ముందుకు తీసుకుపోవాలనే విషయంపై ఇరు పక్షాలు చర్చించాయని ఆయన చెప్పారు. బీజేపీ ప్రతినిధి బృందానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ నేతృత్వం వహించారు. భారత్‌లో చైనా రాయబారిగా పనిచేస్తున్న క్సూ ఫీహాంగ్‌ కూడా చర్చల్లో పాల్గొన్నారు. చారిత్రకంగా చూస్తే బీజేపీ, సీపీసీ మధ్య 2000వ దశకం చివరి నుంచే సంబంధాలు కొనసాగుతున్నాయి. చైనాకు చెందిన సీనియర్‌ నేతలతో సమావేశమయ్యేందుకు అనేక బీజేపీ ప్రతినిధి బృందాలు బీజింగ్‌ వెళ్లాయి. అయితే 2020లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి గాల్వాన్‌లో ఘర్షణలు జరిగిన తర్వాత రెండు పార్టీల మధ్య సమావేశం జరగడం ఇదే మొదటిసారి. గాల్వాన్‌ ఘర్షణల కారణంగా భారత్‌, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. 2024 అక్టోబరులో రష్యాలోని కజన్‌లో జరిగిన బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య తొలి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. కాగా బీజేపీ, సీపీసీ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంపై కాంగ్రెస్‌ విమర్శలు కురిపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -