Wednesday, January 14, 2026
E-PAPER
Homeజాతీయంపౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు ఈసీకి వుంది

పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు ఈసీకి వుంది

- Advertisement -

– తరలింపు అంశం కేంద్రానిదే
– సర్‌పై సుప్రీంలో విచారణ సందర్భంగా ఈసీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో ఓటర్ల పౌరసత్వాన్ని నిర్ధారించడానికి మాత్రమే ఎన్నికల కమిషన్‌ పాత్ర పరిమితమైందని, ఇది, అటోమేటిక్‌గా వ్యక్తుల తరలింపునకు దారి తీయదని, తరలింపునకు సంబంధించిన ప్రక్రియ అంతా చూసేది కేంద్రమేనని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. ఎస్‌ఐఆర్‌పై సుప్రీం కోర్టులో మంగళవారం జరిగిన విచారణలో ఈసీ తరపున సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపించారు. రాజ్యాంగ అసెంబ్లీ చర్చలు, శర్వానంద సోనోవాల్‌ తీర్పులను ఉటంకిస్తూ ద్వివేది, ఎన్నికల ప్రక్రియలో పౌరసత్వ తనిఖీలు అంతర్భాగమని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని తీసుకున్నపుడు మాత్రమే ఆ అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని తెలిపారు.

ఒక వ్యక్తిని ఓటర్ల జాబితాలో వుంచాలా లేదా అని నిర్ణయించేందుకు ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారులు పరిమిత స్థాయిలో విచారణలు జరపవచ్చని ద్వివేది తెలిపారు. నిర్దిష్టమైన పరిస్థితులు, కారణాలు వున్నపుడు మాత్రమే మరింత వివరణతో కూడిన విచారణ అవసరమవు తుందన్నారు. అనుమానాస్పదమైన రీతిలో పౌరులు కాని వారు ఓటు వేయడానికి అనుమతించడం ద్వారా ఎన్నికల విషయంలో రాజీపడరాదని హెచ్చరించారు. పౌరుడు కాని వ్యక్తికి అవకాశం కల్పించడం కోసం ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం లేదా సవరించడమో చేయలేమని ద్వివేది పేర్కొన్నారు. పౌరసత్వం మంజూరు చేసే ప్రక్రియ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మరింత కఠినతరంగా మారుతూ వచ్చిందని జస్టిస్‌ బగ్చి వ్యాఖ్యానించారు. దీనిపై ద్వివేది స్పందిస్తూ రాజ్యాంగ నిర్ణయాక అసెంబ్లీ చర్చల్లో కూడా భారత పౌరసత్వం అంత సులభంగా లభించరాదనే అభిప్రాయం వ్యక్తమైందని అన్నారు. సర్‌, దాని సముచితమైన భావనలు కూడా ఇందుకు చాలా దగ్గరగా వున్నాయన్నారు. భారతదేశంలో నివాసం, జననం (స్వయంగా లేదా తల్లిదండ్రుల్లో ఎవరైనా) ఈ రెండూ కీలకమైన ప్రామాణికాలని ద్వివేదిక పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రాజ్యాంగంలో పౌరసత్వం గురించి పేర్కొంటున్న 5వ అధికరణను ప్రస్తావించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయం నాటి పరివర్తనా స్వభావాన్ని రాజ్యాంగంలోని 5,6,7 అధికరణలు ప్రతిబింబిస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు.

ఆ సమయంలో, ప్రజలు ఎక్కడ నివసించాలనే విషయమై ఇంకా ఎటూ తేల్చుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన 10వ అధికరణ మరింత స్థిరమైన పరిస్థితిని ప్రతిబింబించింది. ఇదొక విచిత్రమైన పరిస్థితి, రాజ్యాంగం రావడానికి ముందునుండే భారత పౌరులుగా వున్నవారు వీరు. కొంతమంది స్వాతంత్య్రం తర్వాత కూడా ఇక్కడున్నారు, మరికొంతమంది వెళ్ళిపోయారు. మళ్లీ భారత పౌరులుగా వుండాలని వెనక్కి వచ్చారని జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. సర్‌ ప్రక్రియను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల కమిషన్‌ అధికారాల పరిధి, పౌరతస్వం, ఓటు హక్కు ఇలా పలు అంశాలపై అనేక రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై తదుపరి విచారణ 15వ తేదీకి వాయిదా వేశారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -