శ్రీనగర్ : ఉగ్రవాదు లతో సంబంధాలు న్నాయన్న ఆరోపణలతో మరో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్ముకాశ్మీర్ యంత్రాంగం వేటు వేసింది. ఉపాధ్యాయుడు, డ్రైవర్, లైన్‌మెన్ సహా ఐదుగురిని తొలగిం చినట్లు జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాద గ్రూపులతో పనిచేస్తున్నారన్న నిఘవర్గాల సమాచారం ప్రకారం.. 2020 నుండి జమ్ముకాశ్మీర్ యంత్రాంగం 85మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(సి) కింద ఉపాధ్యాయుడు మొహమ్మద్ ఇష్ఫాక్, ల్యాబ్ టెక్నీషియన్ తారిఖ్ అహ్మద్ షా, అసిస్టెంట్ లైన్‌మెన్ బషీర్ అహ్మద్ మీర్, అటవీశాఖలో ఫీల్డ్ వర్కర్ ఫరూఖ్ అహ్మద్ భట్, ఆరోగ్య శాఖలో డ్రైవర్ మహ్మద్ యూసఫ్‌లను తొలగించినట్లు వారు తెలిపారు. రాష్ట్ర భద్రత దృష్ట్యా విచారణ నిర్వహించడంసముచితం కాదని రాష్ట్రపతి లేదా గవర్నర్ భావిస్తే, అధికారిక విచారణ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుండి బహిష్కరించడం లేదా సస్పెండ్ చేసేందుకు ఈ నిబంధన అనుమతిస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో రెహ్బర్-ఎ-తలీమ్‌గా నియమితులైన మొహమ్మద్ ఇష్ఫాక్, 2013లో ఉపాధ్యాయుడిగా పదోన్నతి పొందారు.



