Wednesday, January 14, 2026
E-PAPER
Homeబీజినెస్గూగుల్‌తో ఆపిల్‌ జట్టు

గూగుల్‌తో ఆపిల్‌ జట్టు

- Advertisement -

– సిరి ఏఐ అప్‌గ్రేడ్‌ కోసం ఒప్పందం
– గుత్తాదిపత్యమేనని ఎలన్‌ మస్క్‌ ఆందోళన
వాషింగ్టన్‌ :
దిగ్గజ టెక్‌ కంపెనీలు గూగుల్‌, ఆపిల్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. కృత్రిమమేధా (ఏఐ)కు సంబంధించి ఆపిల్‌ తన ఐఫోన్‌ వినియోగదారులకు వర్చువల్‌ అసిస్టెంట్‌ ‘సిరి’ని మరింత శక్తివంతంగా మార్చేందుకు గూగుల్‌ ఎఐ సాంకేతికతను ఉపయోగించుకోనుంది. ఇందుకోసం ఇరు సంస్థలు దీర్ఘకాల భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో గూగుల్‌ క్లౌడ్‌ టెక్నాలజీని ఆపిల్‌ వినియోగించుకోనుంది. దీనిపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో టెక్నాలజీ రంగంలో గూగుల్‌కు గుత్తాధిపత్యం లభిస్తోందని ఎక్స్‌ వేదికగా భగ్గుమన్నారు. గూగుల్‌ ఇప్పటికే ఆండ్రాయిడ్‌, క్రోమ్‌ ద్వారా టెక్నాలజీ రంగాన్ని నియంత్రిస్తోందని ఎలన్‌మస్క్‌ పేర్కొన్నారు. తాజా ఒప్పందం వల్ల మరింత గుత్తాధిపత్యం సంక్రమిస్తుందన్నారు. ఓ రకంగా ఎలాన్‌ మస్క్‌కు చెందిన గ్రోక్‌కు కూడా ఈ ఒప్పందం ఎదురుదెబ్బగా టెక్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఓపెన్‌ఎఐతోనూ ఆపిల్‌ జట్టు కట్టినప్పుడు ఎలన్‌మస్క్‌ ఇదే తరహా ఆందోళన వెలిబుచ్చారు. సిరి, ఇతర ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌లో చాట్‌జీపీటీని ఆప్షనల్‌ ఫీచర్‌గా ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆపిల్‌ విధానాలు ప్రత్యర్థుల ఎదుగుదలకు అవరోధంగా మారుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై దావా కూడా వేశారు.ఈ ఒప్పంద సహకారం ఆపిల్‌ వినియోగదారులకు సరికొత్త, వినూత్నమైన అనుభవాలను అందిస్తుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. దీంతో ఆపిల్‌ ఉత్పత్తులు, జెమిని మోడళ్లు క్లౌడ్‌ టెక్నాలజీ ఆధారంగా పని చేయనున్నాయి. దీనివల్ల ఆపిల్‌ ఏఐ సిరి మరింత మెరుగవ్వనుంది. ఇది ఆపిల్‌ సిరి మరింత శక్తిమంతం చేయనుంది. కాగా.. ఆపిల్‌ గోప్యతా ప్రమాణాలు కొనసాగుతాయని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఒప్పందంతో గూగుల్‌ సామర్థ్యాన్ని తన సొంత సాంకేతిక అందుకోలేదని ఆపిల్‌ ఒప్పుకున్నట్లయ్యిందని ఐడీసీ విశ్లేషకుడు ఫ్రాన్సిస్కో జెరోనిమో పేర్కొన్నారు. సాధారణంగా ఆపిల్‌ తన ఉత్పత్తుల్లో వాడే ప్రతి సాంకేతికతపై పూర్తి నియంత్రణను కోరుకుంటుందని.. కానీ ప్రస్తుత మార్కెట్‌ పోటీని తట్టుకోవడానికి ఆపిల్‌ తన పాత విధానాన్ని పక్కన పెట్టి ఈ ఆచరణాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. కాగా.. గూగుల్‌, ఆపిల్‌ ఒప్పందం విలువను ఆయా సంస్థలు వెల్లడించలేదు, కానీ ఇది బిలియన్ల డాలర్ల వ్యవహారమని అంచనా. అయితే.. ఈ ఒప్పందంపై నియంత్రణ సంస్థలు దృష్టి సారించినట్టు తెలుస్తొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -