Wednesday, January 14, 2026
E-PAPER
Homeబీజినెస్ఒక్క పూట ఆనందం ఆవిరి..

ఒక్క పూట ఆనందం ఆవిరి..

- Advertisement -

సెన్సెక్స్‌ 250 పాయింట్ల పతనం
రిలయన్స్‌ షేర్‌ 2.3 శాతం క్షీణత
ముంబయి :
గడిచిన వారం పూర్తిగా నష్టాలను చవి చూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లకు సోమవారం ఉపశమనం లభించిందనుకునే లోపే మళ్లీ నష్టాలను చవి చూశాయి. మంగళవారం అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో ఇన్వెస్టర్లలో ఒక్క పూట ఆనందం ఆవిరయ్యింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, అమెరికా టారిఫ్‌ భయాలు దలాల్‌ స్ట్రీట్‌ను భయపెట్టాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వెనుజులాపై సాయుధ దురాక్రమణ చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురో దంపతులను అరెస్ట్‌ చేయడం, ఇరాన్‌ అంతరంగిక అంశాల్లో దూరడంతో భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ మదుపర్లు విక్రయాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే కన్సూమర్‌ డ్యూరబుల్స్‌, రియల్టీ స్టాక్స్‌లో అమ్మకాలతో సూచీలు ఒత్తిడి ఎదుర్కొన్నాయి.దీంతో సెన్సెక్స్‌ ఓ దశలో 600 పాయింట్ల మేర పతనమయ్యింది. తుదకు బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 250 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టంతో 83,628కి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 57.95 పాయింట్లు లేదా 0.22 శాతం నష్టంతో 25,732.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ట్రెంట్‌, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌, ఇండిగో, మారుతీ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. ఎటెర్నల్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీ 0.20 శాతం తగ్గగా.. స్మాల్‌ క్యాప్‌ సూచీ 0.60 శాతం పెరిగింది. నిఫ్టీలో కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌ 0.89 శాతం, రియాల్టీ 0.62 శాతం చొప్పున పతనమయ్యాయి.

ఒత్తిడిలోనే రిలయన్స్‌ షేర్‌..
కొత్త ఏడాది 2026లో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ షేర్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. ఇప్పటికే ముకేశ్‌ అంబానీకి చెందిన ఈ కంపెనీ షేర్‌ 8 శాతం క్షీణించింది. మంగళవారం కూడా మరింత పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 2.3 శాతం నష్టపోయి 1.448 వద్ద నమోదయ్యింది. తుదకు బీఎస్‌ఈలో 1.77 శాతం లేదా రూ.23.60 నష్టంతో రూ.1,456.90 వద్ద ముగిసింది. శుక్రవారం ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తంగా వ్యవహారిస్తున్నారు. రష్యా నుంచి రిలయన్స్‌ దొడ్డిదారిన చమురును దిగుమతి చేసుకుంటుందని బ్లూమ్‌బర్గ్‌ ఇటీవల ఓ కథనం వెలువరించినప్పటి నుంచి ఆ కంపెనీ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -