Thursday, January 15, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మహిళా పోరాటాలకు ప్రతీక హైదరాబాద్‌

మహిళా పోరాటాలకు ప్రతీక హైదరాబాద్‌

- Advertisement -

‘ఐద్వా అఖిల భారత మహాసభలు జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాద్‌లో జరగబోతున్నాయి. ఇది మాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే మహిళా ఉద్యమాలకు, హక్కులకు, పోరాటాలకు ప్రతీక హైదరాబాద్‌ మహా నగరం. ఇలాంటి నగరానికి 12 ఏండ్లు నేను ఐద్వా కార్యదర్శిగా పని చేశాను. మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మేము చేసిన పోరాటాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు పి.జ్యోతి. హైదరాబాద్‌ నగర కార్యదర్శిగా, ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం పాటు ఎన్నో మహిళా ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఆమె తన అనుభవాలను మానవితో ఇలా పంచుకున్నారు.

హైదరాబాద్‌లో ఐద్వా ఉద్యమం ప్రారంభమైనపుడు సక్కుగారు, సుగుణ గారు మొదటి అధ్యక్షకార్యదర్ములుగా ఉన్నారు. అప్పటి నుండి అనేక పోరాటాలు చేశాం. అనేక మంది మహిళలు ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. వివిధ బాధ్యతల్లో పని చేశారు. వారందరినీ ఈ మహాసభల ఏర్పాట్లలో భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే వాళ్లు కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు.

స్నేహ ఇంటి పనివారల సంఘం
హైదరాబాద్‌ నగరంలో మధ్యతరగతి, ఉన్నత వర్గాలు ఎక్కువగా నివసిస్తుంటారు. వారందరూ ప్రశాంతంగా వారి ఉద్యోగాలు చేసుకోవాలంటే ఇంటి పనిలో సహాయం కోసం కచ్చితంగా ఓ మనిషిని పెట్టుకోవాల్సింది. అలా ఇండ్లల్లో పని చేసే వారు వేల సంఖ్యలో ఉన్నారు. కానీ వాళ్లకు ఎలాంటి హక్కులు, చట్టాలు లేవు. రక్షణ లేదు. వారి శ్రమకు గుర్తింపు, గౌరవం లేదు. యజమాని దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వారి జీతాలు, ఉద్యోగం ఉంటుంది. ఇలాంటి ఇంటి పనివారల సమస్యపై ఐద్వా హైదరాబాద్‌ నగర కమిటీ దృష్టి పెట్టింది. అందరినీ ఒక దగ్గరకు చేర్చి ‘స్నేహ ఇంటి పనివారల సంఘం’ ఏర్పాటు చేసి 2001లో రిజిస్ట్రషన్‌ చేశాం.

కార్మికులుగా గుర్తించేలా…
ఇండ్లల్లో పని చేసేవారందరూ ఎక్కడెక్కడినుండో వలస వచ్చి హైదరాబాద్‌లో ఉంటారు. భర్తలు కూలీ పని చేస్తుంటే మహిళలు నాలుగిండ్లలో పాచిపని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటారు. సంఘం వాళ్లకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ‘ఇప్పటి వరకు మా గురించి ఆలోచించిన వాళ్లు, మాట్లాడిన వాళ్లు ఎవ్వరూ లేరు’ అంటూ వాళ్లు ఆవేదన చెందితే మా కండ్ల నుండి నీరు కారేది. శ్రమకు తగ్గ ఫలితం, చేసే పనిని బట్టి వేతనం, నెలకు నాలుగు రోజులు సెలవులు వంటి డిమాండ్లతో ఐద్వా అనేక ఉద్యమాలు చేసింది. పౌష్టికాహార లోపాన్ని నివారించడం కోసం వాళ్లకు నెలనెలా ఇచ్చే జీతంతో పాటు కిలో బెల్లం కూడా ఇవ్వాలని డిమాండ్‌ పెట్టాం. లేబర్‌ కమిషనర్‌తో ఎన్నో సార్లు చర్చలు జరిపాం. చివరకు ఇంటిపని వాళ్లను కూడా కార్మికులుగా గుర్తిస్తూ ప్రభుత్వం జీఓ తీసుకొచ్చింది. ఇది ఐద్వా సాధించిన ఘన విజయం. వాళ్లకు గుర్తింపు కార్డులు కూడా ఇప్పించాము. అవి చూసుకొని వాళ్లు ఎంత సంతోషించారంటే అది మాటల్లో చెప్పలేము. తర్వాత కాలంలో వారిపై జరుగుతున్న హింస చాలా వరకు తగ్గిపోయింది. హైదరాబాద్‌లో సాధించిన విజయం చూసి తర్వాత కాలంలో ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తం చేశాము.

సంపూర్ణ మధ్య నిషేధం
నెల్లూరు జిల్లా దువ్వగుంటలో ఆనాడు ప్రారంభమైన మద్య నిషేధ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో ఆ ఉద్యమ ప్రభావం బాగా కనిపించింది. ఐద్వాగా అప్పట్లో మిగిలిన మహిళా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించాము. ఐక్యకార్యచరణ కమిటీకి మల్లు స్వరాజ్యం చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఎంతో మంది ప్రముఖులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. అక్టోబర్‌ 2 సందర్భంగా సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహానికి దండ వేయడానికి రాజకీయ నాయకులందరూ వస్తుంటారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి గాంధీ విగ్రహానికి దండ వేయడానికి వస్తున్నాడని తెలిసి ఉదయం ఏడున్నర గంటలకే ఆ పార్క్‌ వద్దకు వెళ్లి గాంధీ విగ్రహం చూట్టూ కూర్చున్నాం. సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని మాట ఇస్తేనే దారి ఇస్తామని చెప్పాం. కానీ ముఖ్యమంత్రి లోపలికే రాలేదు. పోలీసులు ఎంత బతిమలాడినా మేము అంగుళం కూడా కదలేదు. చివరకు ఆయన వెనక్కు వెళ్లిపోయారు. తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత ఎన్‌.టి.రామారావు వచ్చారు. మా డిమాండ్‌ ఆయన ముందు పెడితే స్వరాజ్యం గారి చెయ్యి పట్టుకొని ‘ఎన్నో రోజుల నుండి మీరు చేస్తున్న పోరాటం చూస్తున్నాను. నేను ముఖ్యమంత్రి అయితే సంపూర్ణ మద్య నిషేధం ఫైల్‌పైనే నా తొలి సంతకం’ అన్నారు. మేము వెంటనే దారి ఇచ్చాం. ఆయన స్వరాజ్యం గారితో కలిసి గాంధీ విగ్రహానికి దండ వేసి వెళ్లారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపూర్ణ మద్య నిషేధంపై మొదటి సంతకం చేశారు. ఇది ఐద్వా సాధించిన మరో విజయం. మేము ఢిల్లీ వెళ్లినప్పుడు మిగిలిన రాష్ట్రాలవారు ‘మద్యనిషేధం మీరెలా సాధించగలిగారు అంటూ ఆశ్చర్యంగా అడిగేవాళ్లు. మద్య నిషేధం తర్వాత కుటుంబాల జీవనప్రమాణం పెరిగింది, నేరాల సంఖ్య తగ్గింది, పొదుపు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది.

డ్వాక్రా గ్రూపుల కోసం
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా పేరుతో పొందుపు సంఘాలు ఏర్పాటు చేశారు. మహిళలందరినీ లక్షాధికారులను చేస్తామని పొదుపు చేయించారు. అయితే చాలామంది ఆ లోన్లు తీసుకొని ఇంటి ఖర్చులకు వాడుకునే వారు. వాటి ద్వారా చిన్న పరిశ్రమలు పెట్టుకొని ఆదాయం ఎలా పొందవచ్చో ఐద్వాగా అవగాహన కల్పించాం. ఉప్పల్‌ ప్రాంతంలో దీనిపై ఓ ప్రయోగం కూడా చేసి మహిళలతో కొన్ని ఉత్పత్తులు చేయించి మార్కెటింగ్‌ చేసుకునేలా కృషి చేశాం. అప్పట్లో ఐద్వా ఆలిండియా కమిటీ ఇండ్లల్లోనే ఉంటూ వివిధ వృత్తులు చేసుకునే వారితో ఓ సమావేశం పెట్టాలని నిర్ణయించింది. ఆ సమయంలో హైదరాబాద్‌ పాత బస్తీలో మేము ఓ సర్వే చేశాం. గాజులు, అగర్‌బత్తీలు, టికిలీలు తయారు చేసే మహిళలు చాలా మంది ఉన్నారు. అందమైన గాజుల వెనుకు వాళ్ల శ్రమ ఎంత ఉందో అర్థమయింది. మహిళల శ్రమను కారుచౌకగా దోచుకుంటున్నారు. ఈ సమస్యలపై కూడా పని చేశాం. అలాగే ఒంటరి మహిళల సమస్యలపై కూడా హైదరాబాద్‌లో పెద్ద పోరాటం చేసి పెన్షన్‌ వచ్చేలా చేయడంలో ఐద్వా కీలకపాత్ర పోషించింది.

వారి స్ఫూర్తితో…
ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప నాయకత్వం హైదరాబాద్‌ నగరంలో ఉంది. అలాంటి వారందరూ హైదరాబాద్‌లో ఐద్వా అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయని తెలిసి వయసులో పెద్దవారైనా తమవంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. పాతతరం నాయకత్వం మొత్తం ఇందులో భాగస్వాములు అవుతున్నారు. సక్కుగారు, సుగుణగారు, అరుణగారు, పర్సా భారతి గారు ప్రస్తుతం లేరు. కానీ వారి స్ఫూర్తితో పని చేసిన నాయకులు, కార్యకర్తలు ఈ మహాసభల విజయవంతాన్ని తమ భుజాకెత్తుకున్నారు. వారే కాక వారి పిల్లలతో కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నారు. సభలు జయప్రదం కావాలని మనసారా కోరుకుంటూ కృషి చేస్తున్నారు.

– సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -