Thursday, January 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిరాష్ట్రాలపై 'ఆర్థిక' దాడి

రాష్ట్రాలపై ‘ఆర్థిక’ దాడి

- Advertisement -

బలమైన రాష్ట్రాలే కేంద్రాన్ని బలంగా నిలబెడతాయి. స్థిరమైన ఆర్థిక వనరులతోనే రాష్ట్రాలు బలంగా నిలుస్తాయి. సమాఖ్య వ్యవస్థ పురోగతికి అత్యంత కీలకమైన ఈ అంశంపైనే నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తోంది. ఆర్థిక హక్కులను క్రమేణా హరిస్తోంది. ఫలితంగా రాష్ట్రాలు ప్రతి చిన్న అవసరానికి కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆదారపడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరగనుండగా, దానికి సన్నాహంగా ఇటీవల నిర్వహించిన ప్రీ బడ్జెట్‌ సమావేశంలో రాష్ట్రాల ఈ దైన్యస్థితి స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రంలో ఎన్డీయే కూటమికి చెందిన పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు సైతం నిధుల కోసం గళం విప్పాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న దుర్బర పరిస్థితులను వివరిస్తూ అదనపు నిధులు కావాలని, జీఎస్టీ పరిహారం కొనసాగిం చాలని సమావేశంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వాలూ విజ్ఞప్తులు చేశాయి. పన్నుల వసూళ్లలో రాష్ట్రాల వాటా తగ్గిస్తూ, గ్రాంట్లు ఆలస్యం చేస్తూ, అప్పుల పరిమి తులను కట్టడి చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే రాష్ట్రాల ఈ దుస్థితికి కారణం.

ప్రీ బడ్జెట్‌ సమావేశంలో రాష్ట్రం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా ఇవ్వాలని కోరారు.హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఫేజ్‌-2, ప్రాంతీయ రింగ్‌రోడ్‌ (త్రిపుల్‌ ఆర్‌) వంటికి మౌలిక ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు, నిధులివ్వాలని కోరారు. రాష్ట్ర శిక్షణ, ఆరోగ్య రంగాల కోసం ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులతో మిన హాయింపులు, కేంద్ర,రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యంలో బాగా పరిగణించబడే పన్నుల పంపిణీ, సర్‌ఛార్జీల పునర్‌నిర్ణయం గురించి సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన మంత్రి హోదాలో నరేంద్రమోడీ పలుమార్లు వచ్చినప్పటికీ తెలంగాణకు సంబంధించిన అనేక విషయాల్లో ఆర్థిక పరిమితులనే విధించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా, ఆర్థిక సాయంపై ప్రధానికి విన్నవించారు. ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన ఏపీ కూడా విభజన హామీల్లో భాగమైన పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులివ్వాలని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. తెలుగ రాష్ట్రాలే కాదు, ఎన్డీయేలో మరో భాగస్వామి అయిన బీహార్‌ ప్రభుత్వం నుండి కూడా ఇటువంటి వినతులే అందాయి. పలు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జీఎస్టీ నష్టపరిహారం, గ్రాంట్ల పెంపు, ప్రత్యేక ప్యాకేజీల కోసం కేంద్రాన్ని కోరినట్లు వార్తలొచ్చాయి.

సీపీఐ(ఎం) నేతృత్వంలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం మరింత కక్షపూరితంగా వ్యవహరి స్తోంది. ఆర్థికంగా దిగ్బంధించడం ద్వారా వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వ ప్రతిష్టను ప్రజల్లో దిగజార్చే కుటిల వ్యూహానికి బీజేపీ తెగ బడుతోంది. ఇలా దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం మంజూరు చేయడానికి నిరాకరిస్తోంది. గత ఐదేళ్లలోనే 57వేల కోట్ల రూపాయలకు కోత పెట్టింది. పన్నుల వాటాను 3.89 శాతం నుండి 1.92 శాతానికి తగ్గించింది. ఈ చర్య వల్ల 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే కేరళ ప్రజలు 27 వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. జీఎస్టీ సంస్క రణల ద్వారా మరో 9వేల కోట్లను ఆ రాష్ట్రం కోల్పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! త్వరలో ఎన్నికలు జరగనున్నఈ రాష్ట్రంలో ఈ తరహా రాజకీయ కక్ష సాధింపు చర్యలు పతాక స్థాయికి చేరడంతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సత్యా గ్రహం చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో కేరళ ప్రజలందరూ భాగస్వాములు కావడం బీజేపీ కుత్సిత రాజకీయాలకు గుణపాఠం! అయితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆర్థిక దిగ్బంధనంపై కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ పెదవి విప్పకపోవడం పచ్చి అవకాశవాదం! ఏమైనప్పటికీ ఈ తరహా ఏకపక్ష విధానాలను నరేంద్రమోడీ ప్రభుత్వం ఇప్పటికైనా విడనాడాలి. రాజ్యాంగ బద్దమైన రాష్ట్రాల హక్కులను గౌరవించాలి. లేని పక్షంలో ఈ తరహా ఆందోళనలు మరిన్ని రాష్ట్రాల్లో చోటుచేసుకునే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -