Thursday, January 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి2025 నుంచి 2026లోకి...

2025 నుంచి 2026లోకి…

- Advertisement -

(గతవారం తరువాయి)
2025లో భౌగోళిక పరిస్థితి ప్రస్తుత వ్యవస్థ పరిమితులను వెల్లడిస్తే, భారతదేశంలోని పరిణామాలు మరింత ఆందోళన కరమైన విషయాన్ని బయటపెట్టాయి. అది దేశాన్ని ఉదేశయపూర్వకంగా నిరంకుశత్వవైపుకు నెట్టే ప్రయత్నం. వివిధ రాష్ట్రాలలో చేపట్టిన ఎన్నికల జాబితా ప్రత్యేక విస్త్తృత సవరణ కాలం చెల్లిన పాత రికార్డులను, డాకుమెంట్లను చూపమని డిమాండ్‌ చేస్తున్నది. ఈ డాక్యుమెంట్లు ఓటర్లలో ఎక్కువమంది దగ్గర లేవు. దాన్ని కారణంగా చూపించి, న్యాయమైన ఓటర్లను పెద్దఎత్తున తొలగించే ప్రయత్నం జరుగుతున్నది. తాము పౌరులమేనని నిరూపిం చుకునే బాధ్యతను ప్రభుత్వం ప్రజలపై మోపింది. మొట్టమొదట దీని బారిన వలస కార్మికులు, పట్టణ పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు పడతారు. ఎన్నికల సంఘం తన బాధ్యత నుండి తప్పుకుని, ఓటర్ల జాబితాలో నమోదు కావటానికి తాము అర్హులమని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై పడ్డది. దొడ్డిదారిన ఎన్‌ఆర్‌సిని అమలు చేసే ప్రయత్నం ఇది. ఎన్నికల సంఘం రాజ్యాం గంలో కల్పించని అధికారాన్ని తీసుకొని, ప్రజలను ఈ దేశ పౌరులే అని నిరూపించుకోమని డిమాండ్‌ చేస్తున్నది. 2026 నుండి జనాభా లెక్కల ప్రక్రియను చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే సాధారణ ఎన్నికల (2029) నాటికి నియోజక వర్గాల పునర్వి భజన ప్రక్రియకోసం ఈ డేటాను ఉపయోగించుకోవాలనే ఆలోచనతో జనాభా లెక్కల ప్రక్రియను త్వరత్వరగా పూర్తిచేయాలని ప్రయత్నిస్తున్నది. సరైన సంప్రదింపులు, ప్రజల భాగస్వామ్యం లేకుండా తీసుకునే ఇటువంటి చర్య దేశానికి వినాశకరంగా మారుతుంది.2025లో సమాఖ్యతత్వం కూడా భారీగా దెబ్బతిన్నది. ఆర్ధిక వత్తిళ్లు, నిబంధనలతో కూడిన పథకాలు, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను పట్టించుకోకపోవడం సాధారణమై పోయింది. గవర్నర్ల పాత్రపై రాష్ట్రపతి చేసిన ప్రస్తావన రాజ్యాంగ సమతుల్యతను పునరుద్ధరించడంలో పెద్దగా సహాయపడలేదు. అది కేవలం సమాఖ్య సూత్రాలపైనా, రాజకీయ వ్యవస్థ సమాఖ్య స్వరూపంపైన జరిగే దాడికి పచ్చజెండా ఊపింది.

పెట్టుబడి కోసమే ఆర్థిక వ్యవస్థ
ఈ పరిణామాలతో పాటు, ఒక స్పష్టమైన ఆర్ధిక ఎజెండా నడుస్తున్నది. దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ప్రతిఘటించిన లేబర్‌ కొడ్స్‌ అమలును ప్రభుత్వం ప్రకటించింది. సమిష్టి బేరసారాల హక్కును బలహీనపరస్తూ, కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నది., కార్మిక భద్రత గాలిలో దీపం అయింది. పెట్టుబడిదారి యజమానులకు అనుకూలంగా పని ప్రపంచాన్ని పునర్నిర్మిస్తున్నారు. కోట్లాది మంది కార్మికులకు ఇది ఉద్యోగ భద్రతకు, వేతనాలకు, గౌరవానికి సంబంధించిన సమస్యగా మారింది.. ఈ ఏడాది తెచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో పసలేని విబి జి రామ్‌ జి పథకం ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెపుతున్నది. ఈ పథకం ఉపాధి చట్టాని కున్న లక్షణాన్ని పూర్తిగా మార్చింది. ఇది ఇక ఏమాత్రం డిమాండ్‌ చేసి ఉపాధి పొందే పధకం కాదు. వేతనాల చెల్లింపులో ఆలస్యం, అరకొర కేటాయింపులు, పధకం నిర్వహణలో అడ్డంకులు,- ఇవన్నీ గ్రామీణ కుటుంబాలకు ఒక్కప్పుడు కీలకంగా వున్న హామీని తుడిచిపెట్టాయి. పనిహక్కు చట్టంలో మాత్రమే ఉంటుంది, దాని సారం క్రమంగా తొలగిపోతుంది. ధరలు పెరుగుతున్న కాలంలో, స్థిరమైన ఉపాధి లేని సమయంలో ఈ తిరోగమనం తీవ్ర పర్యవసానాలను తీస్తుంది. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను దులిపేసుకోవాలనుకుంది, ఇప్పటికే వనరుల కొరతతో బాధపడుతున్న రాష్ట్రాలపై ఈ పధకం నలభైశాతం భారాన్ని మోపింది.విద్యుత్‌ చట్టాలలో ప్రతిపాదించిన మార్పులకూ ఇదే తర్కం వాడుకున్నారు. లాభాలు వచ్చే విభాగాలను ప్రయివేటు రంగం చేతులకు అప్పగిస్తూనే, ప్రయివేటీకరణ, క్రాస్‌ సబ్సిడీలను తొలగించడం, కేంద్రీకృత నియంత్రణతో రైతులు, సాధారణ వినియోగదారులు విద్యుత్‌ చార్జీలను అందుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రాల హక్కులను తగ్గించే ఈ సవరణలు యాదృచ్ఛికంగా చేసినవి కాదు. కేంద్రీకరణ, కార్పొరేటీకరణ చేతిలో చేయి వేసుకుని కలిసి నడుస్తున్న ఫలితం.

ఇప్పుడున్న దృశ్యానికి మరోపొర న్యూక్లియర్‌ రంగానికి చెందిన శాంతి బిల్లు. అణు బాధ్యత నిబంధనలను నీరుగార్చే ప్రయత్నమే శాంతి బిల్లుగా చెప్తున్నారు. ఇక్కడ మళ్లీ ఒక విషయం సుస్పష్టం. ప్రజలకు కలిగే ప్రమాదాన్ని అంగీకరించ వచ్చు గానీ, ప్రయివేట్‌ పెట్టుబడిదారుల లాభాలు చెక్కు చెదరకూడదు. భద్రత, జవాబుదరీతనం, ప్రజా ప్రయోజనాలను బాధ్యతగా కన్నా అడ్డంకిగా చూస్తున్నారు.దీని తర్వాత చూడవలసింది, ఇన్సూరెన్స్‌ రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆమోదించే బిల్లు.ఇకపై సామాజిక బాధ్యతలను పంచుకోవడానికి ప్రభుత్వ రంగ బీమా కంపెనీల వైపు మనం చూడలేము, ఎందుకంటే వాటిని నెమ్మదిగా బలి పీఠం ఎక్కిస్తున్నారు. ఈ రంగంలో ప్రవేశం కల్పించిన ప్రయివేటు, విదేశీ సంస్థలకు సామాజిక బాధ్యత లాంటిదేమి ఉండదు. అంతేకాకుండా, బీమా బాధ్యతలను నెరవేర్చకపోయినా వారు జవాబుదారులుగా ఉండరు. ఈ చర్యలను కలిపి చూస్తే, ఇదొక స్పష్టమైన ఆలోచనగా కనపడుతుంది. ఇవి ఆర్ధిక ప్రాధాన్యతల క్రమాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చినట్టు కనబడుతుంది.

నిఘా పెట్టడమూ ఒక పాలనా పద్ధతే
నిఘా పెట్టటం సాధారణమయిన పనిగా 2025 చూసింది. సంచార్‌ సాథీ లాంటి వాటిని ప్రారంభించటం ప్రజలకు ఒక రక్షణ చర్యగా ప్రచారం చేశారు. అయితే, ఆచరణలో ఇవి తక్కువ పారదర్శకతకలిగి ఉండి, సరైన పర్యవేక్షణ లేకుండా ప్రజల సమాచార సంబం ధాలపై నిఘా పెట్టే ప్రభుత్వ సామర్ధ్యాన్ని విస్తరింపచేసేవిగా ఉన్నాయి.2025లో నోటిఫై చేయబడిన డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ రూల్స్‌ ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేసింది. సమ్మతి, రక్షణ అనే మాటలు పదేపదే ఉచ్ఛరిస్తు న్నప్పటికీ ప్రభుత్వం కోసం ఇందులో విసఅ్తతమైన మినహాయిం పులు కల్పించారు.. దీర్ఘకాలంగా పారదర్శకతకు ఉపయోగపడిన సాధనలను బలహీనపర్చారు. ముఖ్యంగా సమాచార హక్కు కాళ్లు విరగ్గొట్టారు. సమానత్వం లోపించిన సమాజం లో, బలవంతం మీద ఇచ్చే సమ్మతి నిజానికి సమ్మతి కాదు.ఇది కేవలం డాటాకు సంబంధించిన సంగతి మాత్రమే కాదు, అధికారానికి సంబంధించి నది. పౌరులపై భారీ నిఘా పెట్టే ప్రభుత్వం అసమ్మ తిని నిరుత్సాహ పరుస్తుంది. సంస్థలను ముక్కలు చేస్తుంది. ఎవరికి వారే సెన్సార్‌ చేసుకునే వాతావర ణాన్ని కల్పిస్తుంది. డిజిటల్‌ సదుపాయల మీద ప్రభుత్వంతో పాటు, కార్పొరేట్ల పట్టు వుంటే, పౌరులపై నిశితంగా నిఘా పెట్టే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది.

సాంస్కృతిక సిద్ధాంత స్థలాలు
అన్ని రంగాల్లో ప్రజాస్వామిక వాతావరణం కుచించుకుపోతున్నది. తిరోగమన సిద్ధాంత బోధనా వేదికలుగా సాంస్కృతిక సంస్థలు మారాయి. చలన చిత్రోత్సవాలు, సాహిత్య సంస్థలు, ప్రజా స్మారక కార్యక్రమాల చుట్టూ వున్న వివాదాలు వ్యక్తుల గురించి మాత్రమే కాదు. ఈ వివాదాలు విమర్శ పట్ల అసహనం, చారిత్రక జ్ఞాపకాలకు సంబంధించి ఆందోళనను ప్రతిబింబిస్తాయి. ప్రతిఘటనను గురించి చెప్పే సినిమాలు, పుస్తకాలు, చర్చలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సమాజం తనని ఎలా గుర్తు పెట్టుకోవాలో సంస్కృతి రూపొంది స్తుంది. దాని మీద తనిఖీ పెట్టడమంటే జ్ఞాపకాన్ని తిరగరాయటమే. వామపక్షల దృష్టిలో సాంస్కృతిక స్వేచ్ఛను సమర్ధించటమంటే, ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో అది ఎప్పుడూ ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. కళాకారుల నుంచి, రచయితల నుంచి నేర్చుకోవటానికి భయపడే సమాజం అధికార రాజకీయాలకు అనుగుణంగా నడుచుకోవటానికి సిద్దపడుతుంది.

హింసను సాధారణం చేసిన హిందూత్వం
ఈ పరిణామాల వెనక హిందుత్వాన్ని ప్రభుత్వ సిద్ధాంతంగా చేసే ప్రయత్నాలు నిరంతరంగా సాగాయి. ప్రధానమంత్రి బహిరంగంగా ఆరెస్సెస్‌పై ప్రశంసల జల్లు కురిపించడం హిందూ మత భావనలకు అనుగుణంగా పౌరసత్వాన్ని, జాతీయతను పునర్నిర్వచించి, రాజకీయ అధికారాన్ని గట్టిపరుచు కునే ప్రయత్నం. మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు మీద దాడులు ఆందోళన కలిగించే విధంగా నిరంతరం సాగుతున్నాయి. బహిష్కరణలు చట్టబద్దంచేసిన రాజకీయ వాతావరణం వల్ల, హిందుత్వ శక్తుల చేతుల్లో బందీయైన సంస్థల వలన ఈ దాడులు సాధ్యమైనాయి. దీన్ని ఎదుర్కోవటానికి సహనం, చైతన్యంతో కూడిన ప్రయత్నాలు అవసరం. మన ప్రజాస్వామ్య గణతం త్రాన్ని బలోపేతం చేసిన లౌకికవాదం, సమానత్వం, రాజ్యాంగ విలువలను పరిరక్షంచటానికి నిలకడతో కూడిన రాజకీయ కార్యాచరణ అవసరం.

2025లో సీపీఐ(ఎం)
ఈ నేపథ్యంలో జరిగిన సీపీఐ(ఎం) 24వ పార్టీ మహాసభ ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. పార్టీ స్వతంత్ర పాత్రను దృఢ పరచడం, మతతత్వం, నిరంకుశత్వానికి, ప్రభుత్వం మీద, దాని వ్యవస్థల మీద ఫాసిస్ట్‌ ఆరెస్సెస్‌ పట్టుకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని, నయా- ఉదార వాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంతో అనుసంధించాల్సిన అవసరం వుంది. అదే సమయంలో, మనలో వున్న పరిమితుల పై కూడా పోరాడాల్సి వుంది. దేశమం తటా పార్టీని విస్తరింప చేసే పనిచెయ్యాలి, మన వ్యవస్థాగత బలహీనతలను సరిదిద్దుకోవాలి, బలమైన పార్టీగా పునరుద్ధరించటానికి కృషిచేయాలి.

ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలి
ప్రజలపై దాడులు ఆగలేదని, ప్రజలు ఆ దాడులకు తలొగ్గరని, ప్రతిఘటన ఆగదని 2025 సంవత్సరం చూపించింది. ఈ ప్రతి ఘటనలు హెచ్చుతగ్గుల తోను, కొన్నిసార్లు సంకోచంతోను నడిచాయి.పని ప్రాంతాలలోను, వీధులలోనూ, సాంస్కృతిక స్థలాలలోనూ, అసమ్మతిని మౌనంగా వ్యతిరేకించడం లోను ఈ ప్రతిఘటన కనపడ్డది.మన ముందు ఉన్న కర్తవ్యం తప్పక సాధించి తీరాలని డిమాండ్‌ చేస్తున్నది. కర్తవ్యం ఎప్పుడూ డిమాండే చేస్తుంది. దాన్ని జాగరూ కతతో, వెనకడుగు వేయకుండా సాధించాలి. ప్రజల మధ్య గట్టిగా నిలబడి పనిచేయటం, వర్గ పోరాటాన్ని, ప్రజా పోరాటాన్ని ధృఢంగా సాగించటం ద్వారా ఈ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. సమాజం నుంచి విచ్ఛిన్న శక్తులను తరిమికొట్టేదాకా విశ్రాంతి లేదు మనకు.
(”పీపుల్స్‌డెమోక్రసీ” సౌజన్యంతో)
అనువాదం : కర్లపాలెం

ఎం.ఏ. బేబీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -