కోట్లాది మంది భక్తుల కొలువు.. అడవితల్లి ఒడిలో జరిగే ఆధ్యాత్మిక వేడుక మేడారం జాతర. అయితే, ఈ భక్తి ప్రవాహం వెనుక పర్యావరణ విధ్వంసం పొంచి ఉన్న పరిస్థితుల్లో ప్లాస్టిక్ రహిత జాతర సాధ్యమేనా అనే ప్రశ్న సహాజంగానే ఉత్పన్నమవుతుంది. ఈ తరుణంలో గిరిజన సంస్కృతిని కాపాడుతూనే ప్రకృతిని రక్షించుకునేలా ముందుకు సాగాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతిఒక్కరిపై ఉందనేది మరువకూడదు. ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగే ఈ జాతరకు సుమారు కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా. ఈసారి రెండు కోట్ల జన సంద్రం తప్పదనే అంచనాలు కూడా ఉన్నాయి. వపదేవతల జాతరను ఆధునీకరిస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో జనసమీకరణ జరిగే అవకాశం గతంకంటే ఎక్కువగా ఉన్నది. ఇలాంటప్పుడు పర్యావరణంపై ఒత్తిడి పడటం సహజం.
జాతర ముగిసిన తర్వాత టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు, విస్తరాకులు, గాజు సీసాలు అడవిలోనే మిగిలిపోతున్నాయి. ఇది వన్యప్రాణుల మనుగడకు ముప్పుగా మారుతోంది. ఇక మరోవైపు పవిత్రంగా భావించే జంపన్న వాగులో భక్తులు స్నానాలు ఆచరించే సమయంలో సబ్బులు, షాంపూలు వాడటం.. దుస్తులు వదిలివేయడం వల్ల నీరు కలుషితమవుతోంది. ఇలాంటి గతకాలపు అనుభవాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.ఇంకోవైపు ప్రభుత్వం ప్రతియేటా కోట్లాది రూపాయలను జాతర ఏర్పాట్ల కోసం ఖర్చు చేస్తోంది. గతంకంటే కూడా ఈసారి బడ్జెట్ పెంచి అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, ప్రణాళికలు కూడా రచించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఈసారి ప్రత్యేకదృష్టి సారించాల్సిన అవసరమున్నది. వేల సంఖ్యలో పారిశుధ్య కార్మికులను నియమించి, ఎప్పటికప్పుడు చెత్తను తరలించేలా ‘స్వచ్ఛ మేడారం’ కార్యక్రమం తోడ్పాటును అందించాలి. అడవికి హాని కలగకుండా పర్యావరణ హితమైన తాత్కాలిక మరుగుదొడ్లు, వసతి సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.అలాగే ”మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకండి.. పర్యావరణాన్ని రక్షించండి” అని ప్రభుత్వం నినాదంగా ముందుకు సాగడం మంచి విషయమే. కానీ, ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. వారి వసతికి సంబంధించి తాత్కాలిక ఏర్పాట్లు చేసి పర్యవేక్షించాలి. కల్తీ మద్యం, మాంసం పట్ల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తత చేయాల్సిన బాధ్యత సర్కార్‌దే. ప్లాస్టిక్ ప్యాకెట్లు, బాటిల్స్ వాడటం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం సంభవిస్తుంది. నదులు, అడవులు కాలుష్యం కావటం, వన్య ప్రాణులకు ప్రమాదం. ఇవి జాతర ప్రభావంతో మరింత తీవ్రమవుతాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రయత్నాలు ఎన్ని ఉన్నా, క్షేత్రస్థాయిలో కొన్ని సవాళ్లు ఎదురవక తప్పదు. ఇలాంటి స్థితిలో భక్తుల్లో పర్యావరణం పట్ల స్పృహ పెరగాలి. అమ్మవారికి బంగారం (బెల్లం) సమర్పించడం పుణ్యంగా భావించేవారు, అడవిని శుభ్రంగా ఉంచడం అంతే ముఖ్యం. జంపన్న వాగు శుద్ధి కోసం అత్యాధునిక ఫిల్ట్రేషన్ పద్ధతులను ప్రవేశపెట్టాలి. జాతర పరిసరాల్లోనే వ్యర్థాలను వేరు చేసి రీసైకిల్ చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించే అవకాశాలు ఉంటాయి. మేడారం కేవలం ఒక జాతర మాత్రమే కాదు, అది గిరిజన అస్తిత్వానికి ప్రతీక. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, భక్తులు సమన్వయంతో పనిచేసినప్పుడే అడవి తల్లి ఒడి చల్లగా ఉంటుంది. పర్యా వరణాన్ని కాపాడుకుంటూ జరుపుకునేదే అసలైన జాతర.
-దారా
మేడారం మహాజాతర – ప్రకృతి, సవాళ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



