Thursday, January 15, 2026
E-PAPER
Homeఆటలుడారిల్‌ మిచెల్‌ అజేయ సెంచరీ

డారిల్‌ మిచెల్‌ అజేయ సెంచరీ

- Advertisement -

– విల్‌ యంగ్‌ మెరుపులు
– రెండో వన్డేలో న్యూజిలాండ్‌ విజయం
– సిరీస్‌ సమం
– రాహుల్‌ రికార్డు శతకం వృధా
రాజ్‌కోట్‌:
భారత్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌ విధించిన 285 పరుగులు లక్ష్యచేధనలో డారిల్‌ మిచెల్‌ (131 నాటౌట్‌, 117 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో అజేయంగా నిలవగా, విల్‌ యంగ్‌ (87; 98 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 47.3 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఈ మూడు వన్డేల సిరీస్‌ను కివీస్‌ 1-1తో సమం చేసింది. లక్ష్య చేధనలో కివీస్‌ ఓపెనర్లు డేవాన్‌ కాన్వే (16), హెన్రీ నికోల్స్‌ (10) త్వరగానే నిష్క్రమించినా.. తర్వాత వచ్చిన విల్‌ యంగ్‌, డారిల్‌ మిచెల్‌ మూడో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. జట్టు స్కోరు 208 పరుగుల వద్ద విల్‌ యంగ్‌ మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరుకున్నాడు. తరువాత క్రీజ్‌లోకి వచ్చిన గ్లెన్‌ ఫిలిప్స్‌ (32, 25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. భారత బౌలర్లలో హర్షిత్‌ రాణా, ప్రసిద్ధ్‌ కష్ణ, కుల్‌దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. రెండో వన్డేలో విజయంతో సిరీస్‌ను కివీస్‌ సమం చేయడంతో చివరిది, మూడో వన్డే కీలకంగా మారింది. ఈ సిరీస్‌ నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 18న ఇండోర్‌లో జరగనుంది.

బుధవారం మ్యాచ్‌లో ముందుగా టాస్‌ ఓడిన భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఒక దశలో కష్టాల్లోఉన్న భారత్‌ను కెఎల్‌ రాహుల్‌ (112; 92 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో ఆదుకున్నాడు. దీనికి ముందు ఓపెనర్‌, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (56; 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా రెండో అర్ధ శతకం చేశాడు. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ జట్టులో ఓపెనర్లు రోహిత్‌, గిల్‌ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. రోహిత్‌(24 పరుగులు)ను తొలివికెట్‌గా క్రిస్టియన్‌ క్లార్క్‌ వెనక్కి పంపాడు. ఒక దశలో 99/1తో పటిష్ఠ స్థితిలో భారత్‌ నిలిచింది. అయితే ఈ దశలో గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (8), విరాట్‌ కోహ్లీ (23) వరసగా పెవిలియన్‌ చేరడంతో 118/4తో కష్టాల్లో పడింది. 18-27 ఓవర్ల మధ్య భారత బ్యాటర్లు ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా (27 పరుగుల)తో కలిసిరాహుల్‌ భారత్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 88 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

అయితే ఐదో వికెట్‌గా జడేజా మైకేల్‌ బ్రాస్‌వెల్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్‌కుమార్‌రెడ్డితో జతకట్టిన.. రాహుల్‌ 52 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. నితీశ్‌ (20 పరుగులు) ఫౌక్స్‌ ఔట్‌ చేయగా.. కాసేపటికే హర్షిత్‌ రాణా (2)ను జేడెన్‌ లెనాక్స్‌ పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి 87 పరుగులతో ఉన్న రాహుల్‌ జేమీసన్‌ వేసిన 49 ఓవర్‌లో ఫోర్‌, సిక్స్‌ కొట్టి శతకం (87 బంతుల్లో) అందుకున్నాడు. చివరి ఓవర్‌లో రాహుల్‌ రెండు ఫోర్లతో భారత్‌కు మొత్తంగా 12 పరుగులు లభించాయి. రాహుల్‌తో పాటు సిరాజ్‌ (2) అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో కెఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. అలాగే రాజ్‌కోట్‌లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.న్యూజిలాండ్‌ బౌలర్లలో క్రిస్టియన్‌ క్లార్క్‌ 3, జేమీసన్‌, ఫౌక్స్‌, జేడెన్‌ లెనాక్స్‌, మైకేల్‌ బ్రాస్‌వెల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -