– 6,784 మంది కార్మికులకు లబ్ది : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చేనేత కార్మికుల రుణమాఫీ కోసం రూ.16.27 కోట్ల అదనపు నిధులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో రూ. 33 కోట్ల నిధులు చేనేత కార్మికుల అకౌంట్లలో జమ చేసేందుకు ఆయా జిల్లాలకు విడుదల చేశామని తెలిపారు. వాటికి అదనంగా ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 2017 ఏప్రిల్ ఒకటి నుంచి 2024 మార్చి 31 వరకు వ్యక్తిగత రుణాలు తీసుకున్న చేనేత కార్మికులకు ఈ రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. ఫలితంగా మొత్తం 6,784 మంది లబ్ధి పొందుతున్నట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ.960 కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. చేనేత కార్మికులకు ఎల్లప్పుడూ పని కల్పించాలనే ఉద్దేశ్యంతో అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో నుంచే వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని వివరించారు. ఇప్పటివరకు రూ.896 కోట్ల విలువైన వస్త్రాలకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఆర్డర్లు వచ్చాయని తెలిపారు. ఇందిరా మహిళాశక్తి చీరల పథకం ద్వారా 30 వేల మరమగ్గాలకు నిరంతరం పని కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. రూ.150 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నామనీ, గత ప్రభుత్వం కార్మికులకు బకాయి పడ్డ రూ.290 కోట్లను నేతన్నకు చేయూత పథకం కింద కార్మికుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఈ ఏడాది జిల్లా సహకార బ్యాంకుల ద్వారా 78 సహకార సంఘాలకు రూ.19 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ మంజూరు చేశామని మంత్రి వివరించారు.
చేనేత రుణమాఫీకి రూ.16.27 కోట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



