Thursday, January 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరియల్టర్ల గుండెల్లో 'రెరా' గుబులు

రియల్టర్ల గుండెల్లో ‘రెరా’ గుబులు

- Advertisement -

– జోక్యంతో బాధితులకు విముక్తి
– ఇండ్లు నిర్మిస్తామంటూ కొనుగోలుదారులతో కంపెనీ ఒప్పందాలు
– చేతులెత్తేసిన కంపెనీ గుర్తింపు రద్దు
– 60 మందికి ఓనర్‌షిప్‌ కల్పించిన రెరా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ అథారిటీ (రెరా) గుబులు పుట్టిస్తోంది. బాధితులకు భరోసా కల్పిస్తోంది. బాధితులు రెరాకు ఫిర్యాదు చేస్తే మధ్యవర్తిత్వం చేసి, రియల్టర్ల చేతుల్లో మోసపోయిన బాధితులకు అండగా నిలబడుతోంది. ఇండ్లు నిర్మిస్తామంటూ భారీ ప్రాజెక్టుతో ముందుకొచ్చిన జయంప్లాటినం డెవలపర్‌ 60 మందితో ఒప్పందాలు చేసుకుంది. అందుకుగానూ బాధితుల నుంచి అడ్వాన్స్‌గా కొంత సొమ్ము కూడా వసూలు చేసింది. ఆ తర్వాత బాధితులతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయకుండా కంపెనీ యాజమాన్యం ముఖం చాటేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితులు రెరాను సంప్రదించారు. దీంతో రెరా జోక్యం చేసుకుని సుదీర్ఘంగా విచారణ జరిపింది. చివరకు బాధితుల పక్షాన నిలబడింది. ఆ కంపెనీ నుంచి వారికి విముక్తి లభించడంతో 60 మందికి ఇండ్లు దక్కాయి. ఈ నేపథ్యంలో దీన్ని పరిష్కరించడమే కాకుండా బాధితులకు కంపెనీ నుంచి విముక్తి కల్పించడంలో మొదటి కేసుగా రెరా అధికారులు చెబుతున్నారు.

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ అథారిటీ (రెరా) జోక్యం తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘంతో సంప్రదింపులు జరిపారు. రెరా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని దుండిగల్‌ మున్సిపాల్టీలోని బౌరంపేటలో ఉన్న జయ ప్లాటినం అనే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ డెవలపర్‌ జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌ ప్రాజెక్టు పేరిట ఇండ్లు నిర్మిస్తామని ఒప్పందం చేసుకుంది. సకాలంలో ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంలో సదరు కంపెనీ విఫలమైంది. కంపెనీ ప్లాన్‌లో 2731.78 చదరపు గజాల విస్తీర్ణంలో 60 నివాస యూనిట్లు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ, స్థానిక మున్సిపాల్టీ ఆమోదించిన మంజూరైన ప్రాజెక్టులో 60 యూనిట్లలో 51 యూనిట్లు అమ్ముడ య్యాయి. అందులో 49 మంది ఇండ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని కంపెనీ దగ్గర ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆలస్యానికి కారణాలను కూడా చెప్పకుండా చేతులెత్తేసింది. దీంతో బాధితులు రెరాను ఆశ్రయించారు. ఫిర్యాదు అందిన తర్వాత పనులను ప్రారంభించక పోవడం, కంపెనీ ఆర్థిక పరిస్థితులను రెరా పరిశీలించింది. డెవలప్‌మెంట్‌ కోసం అడ్వాన్స్‌గా తీసుకున్న సొమ్మును కంపెనీ దారి మళ్లించినట్టు తేలింది. చివరకు త్రైమాసిక నివేదికలను సమర్పించకపోవడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడినట్టు రెరా తేల్చింది. దీనిపై విచారణ చేయాల్సిందిగా రెరా ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (అస్కీ) విచారణ చేయాలని ఆదేశించింది. జూన్‌ 2022లో ఆ పనులు ఆగిపోయాయని వెల్లడించింది. కంపెనీ 66 శాతం పనులు మాత్రమే పూర్తయినట్టు తేల్చింది. అయితే ఇండ్ల నిర్మాణం నిరంతరాయంగా చేసినా మరో ఏడాది కాలం పట్టవచ్చు అని రెరా అంచనా వేసింది. ‘జయ ప్లాటినం’ కోసం డెవలపర్‌ లైసెన్స్‌ను రద్దు చేసింది. ఎనిమిది నెలల్లోపు ప్రాజెక్ట్‌ను పూర్తి చేసుకునేందుకు బాధితులకు అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా మరో ఆరు నెలల గ్రేస్‌ పీరియడ్‌ ఇచ్చినట్టు అధికారులు చెప్పారు. ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రతినిధులు, రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు, కొనుగోలుదారులతో కూడిన పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది.

చట్ట ప్రకారం ఇదొక ముందడుగు : రెరా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి
ఈ తరహా కేసు ఇదే మొదటిదని రెరా కార్యదర్శి డి. శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ‘నవతెలంగాణ’తో ఆయన మాట్లాడుతూ డెవలపర్లు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడంలో విఫలమయ్యారని తెలిపారు. టీజీరెరా చట్టంలోని సెక్షన్‌ 7 కింద అథారిటీ చర్యలు ప్రారంభిందని చెప్పారు. ఏప్రిల్‌ 30, 2024న ప్రాజెక్ట్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, ప్రమోటర్లును డిఫాల్టర్‌గా ప్రకటించిందని వివరించారు. టీజీ రెరా చట్టంలోని సెక్షన్‌ 8 కింద, ప్రభుత్వంతో సంప్రదించి, ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కొనుగోలుదారుల సంఘానికి అప్పగించామని తెలిపారు. వారికి జనవరి 5న ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసినట్టు వివరించారు. రుణాలు, ప్రభుత్వ బకాయిలు, సరఫరాదారులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలతోసహా గతంలోని అన్ని ఆర్థిక బాధ్యతలకు అసలు డెవలపరే బాధ్యత వహిస్తారని తెలిపారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ సమయంలో అయిన ఖర్చుల కోసం కంపెనీ రెరాకు రూ.3.5 లక్షలు చెల్లించాలని ఆదేశించినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -