– 19 నుంచి ఫిబ్రవరి 21 వరకు తరగతులు
– జిల్లాల వారీగా షెడ్యూల్ ఖరారు
– చట్టంపై అవగాహన, ప్రజలకు మెరుగైన సేవే లక్ష్యంగా కార్యక్రమాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రామ పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ శిక్షణా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. సర్పంచ్‌లకు వారి విధులు, నిధులు, బాధ్యతలు, హక్కులతో పాటు చట్టంపై లోతైన అవగాహన కల్పించేలా శిక్షణా మాడ్యూల్‌ను రూపొందించారు. ఇప్పటికే సర్పంచ్‌ల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్, కరదీపికను సిద్ధం చేశారు. మొత్తం 12,760 మంది సర్పంచ్‌లకు టీజీఐఆర్డీ ద్వారా శిక్షణను అందించనున్నారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు, పారదర్శక పరిపాలన లక్ష్యంగా ఈ శిక్షణ ఉండనుంది. సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా పనిచేసేలా, గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 21 వరకు జిల్లాలవారీగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ప్రతి జిల్లాలో ఐదు బ్యాచ్‌లుగా ఐదు రోజుల పాటు సర్పంచ్‌లకు శిక్షణ ఇస్తారు. ఒక్కో బ్యాచ్‌లో కనీసం 50 మంది సర్పంచ్‌లు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,760 మంది సర్పంచ్‌లకు బస, భోజనం, శిక్షణా ఖర్చుల కోసం ఒక్కరికి రూ.5,000 వరకు ప్రభుత్వం వెచ్చించనుంది. శిక్షణను సమర్థవంతంగా అందించేందుకు మొత్తం 253 మంది మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి, వారికి టీజీఐఆర్డీలో ఇప్పటికే ఓరియంటేషన్ పూర్తిచేశారు. వీరు సర్పంచ్‌లకు ప్రాక్టికల్‌గా ఉపయోగపడే విధంగా, పాలన, అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, ప్రజాసేవ అంశాలను బోధిస్తారు. సర్పంచ్ శిక్షణా తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీచేసింది. సర్పంచ్‌లకు సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామ పంచాయతీలు బలోపేతం అవుతాయనీ, పారదర్శకమైన పాలన, సమర్థవంతమైన నిధుల వినియోగం, ప్రజల అవసరాలకు వేగంగా స్పందించే వ్యవస్థ ఏర్పడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
నూతన సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



