Thursday, January 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడారంలో భూములు ఇచ్చిన రైతులకు ఇండ్ల స్థలాలు

మేడారంలో భూములు ఇచ్చిన రైతులకు ఇండ్ల స్థలాలు

- Advertisement -

– పట్టాలు పంపిణీ చేసిన మంత్రి సీతక్క
నవతెలంగాణ-ములుగు

ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఏర్పాట్ల కోసం తమ భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంత్రి సీతక్క బుధవారం మేడారం ఐటీడీఏ అతిథి గృహంలో ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం శాశ్వత అభివృద్ధి కోసం ప్రభుత్వం కోరగానే స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులను తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటమన్నారు. ప్రతి రైతుకూ న్యాయమైన పరిహారం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇంచర్ల ప్రాంతంలో, జాతీయ రహదారి వద్ద ఇండ్ల స్థలాలు కేటాయించినట్టు తెలిపారు. మేడారం జాతర సందర్భంగా వారికి షాపుల కేటాయింపును కూడా చేపట్టి, అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. మేడారం భూసేకరణ పనులను పూర్తిగా పారదర్శకంగా, నమ్మకంగా పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్‌ దివాకర టి.ఎస్‌, ఆర్డీఓ వెంకటేష్‌ను మంత్రి సీతక్క అభినందించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సమన్వయంతో పని చేయడం వల్లే ఈ ప్రక్రియ విజయవంతమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ దివాకర టి.ఎస్‌, జిల్లా ఎస్పీ రామ్‌నాథ్‌ కేకన్‌, ఐటిడిఏ పీఓ చిత్ర మిశ్ర, ఆర్డీఓ వెంకటేష్‌, భూములు కోల్పోయిన రైతులు, పూజారులు, ఆదివాసీ సంఘాలు, మేడారం గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -