వార్తా కథనాలకు బెదిరేది లేదు.. బరాబర్ 24/7 కొనసాగుతది!
నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలో మద్యం ఏరులై పారుతోంది. నిబంధనలకు పాతర వేస్తూ, సిండికేట్ల అండతో సాగుతున్న ఈ ‘మద్యం దందా’ వెనుక స్థానిక రాజకీయ నేతల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు నిర్ణీత సమయాల్లోనే నడవాల్సి ఉన్నప్పటికీ, పరకాల పట్టణంతోపాటు మండలంలోని పల్లె గ్రామాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అర్ధరాత్రి దాటినా, తెల్లవారుజామునైనా మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. లైసెన్స్ ఉన్న షాపుల కంటే, అనధికారికంగా నడిచే కౌంటర్లు, బెల్ట్ షాపుల ద్వారానే భారీగా ఆదాయం గడిస్తున్నట్లు తెలుస్తోంది.
నేతల అండ.. అడ్డుఅదుపు లేని దందా!
మద్యం వ్యాపారంలో పట్టణంలోని ఓ కీలక నేత పెట్టుబడులు కలిగి ఉండడమే ఈ అక్రమ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. “వార్తలు రాసుకుంటే రాసుకోండి.. మా వెనుక పెద్దలున్నారు.. మా దందా 24 గంటలూ సాగుతుంది” అంటూ కొందరు వ్యాపారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం చూస్తుంటే, చట్టం అంటే వీరికి ఎంత చులకన భావం ఉందో అర్థం చేసుకోవచ్చు. పత్రికల్లో వస్తున్న కథనాలకు భయపడేది లేదని, తమ వ్యాపారం ‘బరాబర్’ 24/7 కొనసాగుతుందని కొందరు నేతలు బాహాటంగానే సవాల్ విసురుతుండటం గమనార్హం.
అంతుచిక్కని.. అధికారుల మౌనం!
వేళాపాళా లేకుండా వైన్స్ నిర్వహణ, విచ్చలవిడి బెల్ట్ షాపులు, హోటళ్లు, కిరాణా షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నా, ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తమకేం బాధ్యత లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తనిఖీలు నామమాత్రంగానే చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పత్రికా కథనాలపై స్పందించి చర్యలు తీసుకోవాల్సింది పోయి, అధికారులు మౌనం వహించడం వెనుక అంతార్థం ఏమిటోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. అక్రమ మద్యం అమ్మకాల విషయమై వివరణ కోరడానికి ఎక్సైజ్ అధికారి తాతాజీని కలవడానికి కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. ఫోన్లో సంప్రదించినప్పటికీ ఆయన స్పందించలేదు.
అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలి: బోట్ల చక్రపాణి (సీపీఐ(ఎం) జిల్లా నాయకులు)
వేళాపాళా లేకుండా విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం మూలంగా పేదలు, యువకులు మద్యానికి బానిసలుగా మారుతున్నారు. దీంతో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడుతున్నాయి. అనేకమంది యువతులు మూడు పదుల వయసులోనే భర్తలను కోల్పోయి విధవలుగా మారుతున్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయి పిల్లలను పోషించుకోలేక వారి జీవితం దుర్భరంగా మారుతోంది. అధికారులు తక్షణమే స్పందించి మద్యం విక్రయాలు నిబంధనల మేరకు జరిగేలా చర్యలు చేపట్టాలి. బెల్ట్ షాపులను అరికట్టి, వైన్స్ సమయానుకూలంగా నడిచేలా చూడాలి. అంతేకాకుండా హోటళ్లు, కిరాణా షాపుల్లో మద్యం విక్రయాలు చేపడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టాలి. లేనట్టయితే సిపిఎం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంతోనే విచ్చలవిడి మద్యం అమ్మకాలు: శనిగరపు రాజు (బీఎస్పీ జోనల్ నాయకులు)
పరకాలలో మద్యం సిండికేట్‌తో ఎక్సైజ్ అధికారులు అవగాహన కుదుర్చుకోవడంలో భాగంగానే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. పరకాలలో ఎక్సైజ్ కార్యాలయం ఉన్నప్పటికీ ఆ శాఖ అధికారులు మాత్రం ఎక్కడా కానరావడం లేదు. ఒకటి రెండు దాడులు జరిగినప్పటికీ అవి నామమాత్రపు దాడులుగానే కొనసాగుతున్నాయి. పరకాల మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఎక్సైజ్ కార్యాలయాన్ని తమ జేబు సంస్థగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆ శాఖ అధికారులు తమ నిజాయితీని నిరూపించుకోవాలంటే తక్షణమే బెల్ట్ షాపులను అరికట్టాల్సిన అవసరం ఉంది. పరకాలలోని కిరాణా షాపులు, హోటళ్లు, దళిత కాలనీల్లో విచ్చలవిడి అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా వాటన్నింటినీ అరికట్టి ఆ శాఖ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.



