- జీపు జాతా ప్రారంభోత్సవంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి:
గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాకుండా రాష్ర్టాల హక్కులను హరిస్తూ నష్టం చేసే చట్టాలను చేస్తుందని సీఐటీయూ రాష్ర్ట అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో, సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో కార్మిక, కర్షక పోరు యాత్రను జెండా ఊపి సీఐటీయూ రాష్ర్ట అధ్యక్షుడు చుక్క రాములు ప్రారంభించారు.
ఈ సందర్బంగా చుక్క రాములు మాట్లాడుతూ ఒక వైపున కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం వల్లిస్తూనే 11సంవత్సరాల పాలనలో కార్పొరేట్ సంస్థలకు రూ.16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిందన్నారు. చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ వంటి బడాపెట్టుబడి దారులకు కట్టబెడుతున్నదని మండిపడ్డారు. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను అమలు చేయడంతో పాటు విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, వీబీ-జీ రామ్ జీ చట్టం, బీమా రంగంలోనికి 100శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి, అణు రంగంలోనికి ప్రవేట్ కంపెనీలకు అనుమతినిస్తూ అణు చట్టం చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకుడు జి.జయరాజ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, వ్యాకాస జిల్లా కార్యదర్శి నర్సింలు, సీఐటీయూ నాయకులు శివ, భీం రెడ్డి, ప్రవీణ్ కుమార్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.




