నవతెలంగాణ-హైదరాబాద్: హింసాత్మక నిరసనల నేపథ్యంలో …. వాణిజ్య విమానాల రాకపోకలకు ఇరాన్ గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ”ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన కొన్ని విమాన సర్వీసులను దారి మళ్లిస్తున్నాం. ప్రత్యామ్నాయ మార్గాలు సాధ్యం కాని కొన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాం.
ప్రయాణికులు అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఈ అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. కానీ.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం” అని ఎయిరిండియా సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.మరో విమానయాన సంస్థ ఇండిగో కూడా ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్ గగనతలం మూసివేయడంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడిందని తెలిపింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు తమకు సహకరించాలని కోరింది.



