నవతెలంగాణ-హైదరాబాద్ : నల్గొండ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కార్మికుల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్రరూపం దాల్చి ఒక వ్యక్తి హత్యకు దారితీసింది. నల్గొండ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన సంభవించింది. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికుల మధ్య వివాదం తలెత్తడంతో పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు.
ఈ ఘటనలో నాగర్‌కర్నూలు జిల్లా, తెలకపల్లికి చెందిన చంద్రు అనే వ్యక్తి మృతి చెందాడు. చంద్రు సోదరుడితో పాటు మరో వ్యక్తికి గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చంద్రు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్గొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



