Saturday, January 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇరాన్‌పై వేలాడుతున్న అమెరికన్‌ కత్తి !

ఇరాన్‌పై వేలాడుతున్న అమెరికన్‌ కత్తి !

- Advertisement -

దాడులు చేస్తామన్న తన హెచ్చరికల కారణంగానే 800 మందిని ఉరితీసేందుకు నిర్ణయించిన ఇరాన్‌ వెనక్కు తగ్గిందని అమెరికా ప్రకటించింది. తామసలు అలాంటి ఆలోచనే చేయలేదని, తమ మీద యుద్ధానికి దిగితే ప్రతిఘటిస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. సౌదీ అరేబియాతో సహా ఎవరూ మద్దతు తెలపకపోవటం, వ్యూహాత్మకంగా అయినా కావచ్చు అమెరికా ప్రస్తుతానికి వెనక్కు తగ్గిందని చెబుతున్నారు. బహుశా ఈ కారణంగానే కావచ్చు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్‌ తిరిగి తెరిచింది. గురువారంనాడు భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపి ఇరాన్‌లో ఉన్న పరిస్థితిని, అమెరికా బెదిరింపుల గురించి చర్చించింది. ఎవరికి వారు తమ ఎత్తుగడలతో ముందుకుపోతున్నారు. ఒకవైపు కొన్ని ప్రాంతాల నుంచి మిలిటరీ ఉపసంహరణ వార్తలతో పాటు మరింతగా బలగాలను సమీకరిస్తున్నదనే విషయాలు కూడా వెల్లడైనందున అమెరికా సామ్రాజ్య వాదుల మాటలను నమ్మటానికి లేదు. ఇరాన్ను, ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నట్లుగా కనిపిస్తున్నది. తాము సంఘర్షణ కోరుకోవటం లేదని, అమెరికా గనుక దాడులకు దిగితే తగిన విధంగా స్పందిసామని, తమ దేశంలో ఆందోళనల వెనుక వాషింగ్టన్‌ హస్తం ఉందని భద్రతా మండలిలో ఇరాన్‌ ప్రతినిధి పేర్కొన్నాడు.

నిరసనలకు టెహరాన్‌ పాలకులే కారణమని అమెరికా ఆరోపించింది తప్ప ట్రంప్‌ చెప్పినట్లుగా దాడులు జరుపుతామనే పదజాలం భద్రతామండలిలో లేదు. అక్కడ జరిగిన ఉదంతాల్లో 150మంది వరకు భద్రతా సిబ్బంది కూడా మరణించారని వస్తున్న వార్తలు నిజమే అయితే నిరసనలు ఒక పథకం ప్రకారమే జరిగినట్లు చెప్పవచ్చు. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసినందున ప్రపంచ మీడియాలో వస్తున్న సమాచారమంతే అమెరికా కనుసన్నలలో నడిచే వార్తా సంస్థల కథనాలే గనుక వాటిని నమ్మటానికి లేదు. ఐరాస అధికారి కూడా అవునని, కాదని చెప్పలేమని పేర్కొన్నారు. అమెరికా యత్నాలను సౌదీ అరేబియా వ్యతిరేకించింది. ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం జరిగిన 1979 నుంచి అమెరికా ప్రభావంలో ఉన్న సౌదీ అరేబియా టెహరాన్‌తో శత్రుపూరిత సంబంధాలలో ఉంది. చైనా మధ్యవర్తిత్వంలో 2023లో రెండు దేశాలూ సాధారణ సంబంధాలు నెలకొల్పుకున్నాయి. ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనలు దాని అంతర్గత అంశమని, అక్కడి పాలకులను మార్చాలా లేదా అనేది ఇరానియన్లు నిర్ణయించుకోవాలి తప్ప వేరేవారెలా నిర్ణయిస్తారని సౌదీ విదేశాంగ మంత్రి జుబేర్‌ ప్రశ్నించటం ఒక కీలక పరిణామంగానూ, ఈ వైఖరి కారణంగా ట్రంప్‌ వెనక్కి తగ్గినట్లు కూడా చెబుతున్నారు.

ఇరాన్‌ కరెన్సీ రియాల్‌ విలువ విపరీతంగా పతనం కావటంతో ఆందోళన వెలిబుచ్చుతూ రాజధాని టెహరాన్‌ గ్రాండ్‌ బజార్‌ వర్తకులు డిసెంబరు 28న ప్రారంభించిన ఆందోళన దేశమంతటికీ విస్తరించింది. మన ఒక రూపాయికి 465 ఇరానియన్‌ రియాల్స్‌ సమానం. నిరసనలను ఉక్కుపాదంతో అణచివేసినట్లు వందలాది మంది మరణించినట్లు వచ్చిన వార్తలు సందేహాస్పదంగా ఉన్నాయి. అయితే ఇరాన్‌ పాలకులు అణచివేతకు పెట్టింది పేరు గనుక అసలేమీ జరగలేదని అనుకోరాదు. గతమంతా ఘనంగా ఉన్నట్లు ఇప్పటి పాలకులే ప్రాణాలు తీస్తున్నట్లు పశ్చిమదేశాల మీడియా చిత్రిస్తున్నది. మహమ్మద్‌ రెజా పహ్లవీ రాజుగా ఉన్న సమయంలో తన ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిని, తిరుగుబాటు చేసిన వారిని 60వేల మంది వరకు చంపివేసినట్లు 1979లో అధికారానికి వచ్చిన ఇస్లామిక్‌ ప్రభుత్వం ప్రకటించింది. మాజీ రాజు వారసుడు 17 సంవత్సరాల రెజా పహ్లవీ విప్లవ సమయంలో అమెరికాలో ఉన్నాడు, తరువాత అక్కడే స్థిరపడ్డాడు. ఇప్పుడు అతన్ని రాజుగా చేయాలని ఇరానియన్లు కోరుతున్నట్లు అమెరికా ప్రచారం చేస్తున్నది.

అసలు ఇరాన్‌కు అమెరికాకు ఉన్న పంచాయతీ ఏమిటన్నది అనేక మందిలో ఉన్న ప్రశ్న. రాజు షా హయాంలో 1968లో అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై ఇరాన్‌ సంతకం చేసింది.1979లో కొత్త ప్రభుత్వం అమెరికా వ్యతిరేక వైఖరిని అనుసరించటంతో దాన్ని ఎలాగైనా అస్థిరపరచాలని అప్పటి నుంచి పెంటగన్‌, సిఐఏ చేయని కుట్రలేదు.1980 ఇరాక్‌తో అమెరికా దాడులు చేయించింది. ఆ యుద్దం ఎనిమిది సంవత్సరాల పాటు సాగింది, సద్దామ్‌ హుసేన్‌కు అన్ని రకాలుగా అమెరికా సాయపడింది. మరోవైపున ఎన్‌పిటి ఒప్పందాన్ని ఉల్లంఘించి అణు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఇరాన్‌పై ప్రచారం చేసింది. ఐరాస ద్వారా ఆంక్షలను విధించింది. అది చివరకు చినికి చినికి గాలి వానలా మారినట్లు ఎన్‌పిటితో తమకు సంబంధం లేదని అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఇరాన్‌ ప్రకటించింది.

2016లో ఇదే ట్రంప్‌ నాయకత్వంలో ఐదు భద్రతా మండలి దేశాలు, జర్మనీ ఒక ఒప్పందం చేసుకొని క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రకటించాయి. అయితే 2018లో ఏకపక్షంగా ట్రంప్‌ ఒప్పందం నుంచి వైదొలిగి తిరిగి కయ్యానికి కాలుదువ్వాడు. మొత్తం మీద చూసినపుడు తనకు లొంగని ఇరాన్‌పై కక్ష సాధించేందుకు అమెరికా కుట్రలకు కొనసాగిస్తూనే ఉంది. తాజా పరిణామాలు దానిలో భాగమే. ముందే చెప్పినట్లు ఎప్పుడు ఇరాన్‌పై దాడి చేస్తుందో తెలియదు, అమెరికా వైఖరిని యావత్‌ ప్రజాస్వామిక శక్తులు ఖండించాలి. ఇరాన్‌ పాలకుల గతాన్ని చూసినపుడు ఇప్పుడు జరుగుతున్న అణచివేత చర్యలను వ్యతిరేకించాల్సిందే. అయితే ఆ పేరుతో అమెరికా జోక్యం చేసుకోవటాన్ని కూడా అంగీకరించకూడదు. ఒక దేశ భవిష్యత్‌ను నిర్ణయించటానికి, పాలకులను మార్చటానికి మరోదేశానికి ఎలాంటి హక్కులేదు. తేల్చుకోవాల్సింది ఇరానియన్లు తప్ప ఇతరులు కాదు !

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -