Saturday, January 17, 2026
E-PAPER
Homeఆటలుబంగ్లా క్రికెట్‌లో కుంపటి

బంగ్లా క్రికెట్‌లో కుంపటి

- Advertisement -

బీపీఎల్‌ మ్యాచ్‌ల బహిష్కరణ

ఢాకా (బంగ్లాదేశ్‌) : బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో ముసలం. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు భారత్‌లో ఆడాలా? వద్దా? అనే అంశంతో మొదలైన వివాదం ఇప్పుడు ఆ దేశ క్రికెట్‌ బోర్డును సంక్షోభంలోకి నెట్టివేస్తోంది!. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) డైరెక్టర్‌, ఫైనాన్స్‌ కమిటీ చీఫ్‌ మహ్మద్‌ నజ్ముల్‌ ఇస్లామ్‌ బుధవారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో క్రికెటర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు నిరాకరిస్తే ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులపై విలేకరులు ఆడిగిన ప్రశ్నకు నజ్ముల్‌ ఇస్లామ్‌ ఘాటుగా బదులిచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో అంతిమంగా క్రికెటర్లే నష్టపోతారని, ఎంతో డబ్బు వెచ్చించినా అంతర్జాతీయ స్థాయిలో బంగ్లా క్రికెటర్లు రాణించటం లేదని నజ్ముల్‌ విమర్శించాడు.

ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్లు మండిపడ్డారు. గురువారం జరగాల్సిన బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌) మ్యాచ్‌లను బహిష్కరించారు. నజ్ముల్‌ ఇస్లామ్‌ను డైరెక్టర్‌ పదవి నుంచి తప్పించిన తర్వాతే చర్చలకు వస్తామని డిమాండ్‌ చేశారు. నష్ట నివారణ చర్యలకు దిగిన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు.. నజ్ముల్‌ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, తక్షణమే ఫైనాన్స్‌ కమిటీ నుంచి తప్పిస్తూ ప్రకటించింది. క్రికెట్‌ బోర్డుతో క్రికెటర్ల సంక్షేమ సంఘంం ప్రెసిడెంట్‌ మహ్మద్‌ మిథున్‌ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం నుంచి బీపీఎల్‌ మ్యాచ్‌లు యథాతథంగా సాగేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. నజ్ముల్‌కు బీసీబీ షోకాజ్‌ నోటీసు ఇవ్వగా.. 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసింది. నజ్ముల్‌ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, బీసీబీ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పుకోవాలని క్రికెటర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -