మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
ఐద్వా జాతీయ మహాసభల బెలూన్ ఆవిష్కరణ
నవతెలంగాణ – ముషీరాబాద్
భారతీయ సమాజంలో మహిళలపై జరుగుతున్న హింస, లైంగికదాడులు ఆగాలంటే కఠినమైన చట్టాలతో పాటు సామాజిక వ్యవస్థలో మౌలికమైన మార్పు రావాలని ఐద్వా జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఐద్వా జాతీయ మహాసభలు ఈ నెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్ నగరంలో జరగనున్న నేపథ్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా జాతీయ మహాసభల ప్రచార బెలూన్‌ను ఆయన ఆవిష్కరించారు. మహిళా సమస్యలపై ఈ మహాసభల్లో విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని జూలకంటి చెప్పారు. మహాసభకు మహిళలు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈనెల 25న జరిగే బహిరంగసభకు వేలాదిగా మహిళలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి మాట్లాడుతూ మహిళలపై పెరుగుతున్న వేధింపులు, లైంగికదాడులు, హింస సమాజానికి సవాల్ విసురుతున్నాయన్నారు. పేదల నడ్డి విరుస్తున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయని తెలిపారు. మీడియాలో స్త్రీలను అసభ్యంగా, అశ్లీలంగా చిత్రీకరించడంతోపాటు అందాల పోటీల పేరుతో ఆమెను మార్కెట్ సరుకుగా దిగజారుస్తున్నారన్నారు. నయా ఉదారవాదం పెంచి పోషిస్తున్న వినిమయ సంస్కృతిపై యుద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి, ప్రజాసంఘాల నాయకులు అబ్బాస్, టీ సాగర్, భూపాల్, శ్రీరామ్ నాయక్, వెంకట్ రాములు, మూడు శోభన్, ఉడుత రవీందర్, కోట రమేష్, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.



