Saturday, January 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమున్సి'పోల్స్‌'లో అభివృద్ధికే పట్టం కట్టండి

మున్సి’పోల్స్‌’లో అభివృద్ధికే పట్టం కట్టండి

- Advertisement -

నిధులు, అభివృద్ధి కోసం ఎన్నిసార్లయినా ప్రధానిని కలుస్తా : సీఎం
వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ అధికారంలోకి వస్తాం
బాసర ట్రిపుల్‌ ఐటీలోనే ఆదిలాబాద్‌ యూనివర్సిటీ
పదివేల ఎకరాల్లో పారిశ్రామికాభివృద్ధి
నిర్మల్‌ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
చనాక-కొరాట బ్యారేజ్‌ నుంచి ప్రధాన కాలువకు సాగునీరు.. సదర్‌మాట్‌ బ్యారేజ్‌ ప్రారంభం

నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘గత ఎన్నికల్లో గెలిచాం.. రాబోయే ఎన్నికల్లోనూ గెలుస్తాం.. రాష్ట్రంలో మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తాం. మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి చేసే వారిని, అభివృద్ధి చేసే వారినే గెలిపించండి. నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు మంచి చేయడా నికే ఉపయోగిస్తా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిం చారు. మొదట ఆదిలాబాద్‌ జిల్లాలోని బోరజ్‌ మండలంలోని చనాక-కొరాట బ్యారేజ్‌ నుంచి ప్రధాన కాలువకు సాగునీరు వదిలారు. నిర్మల్‌ జిల్లాలోని మామడ మండలంలో గల సదర్‌మాట్‌ బ్యారేజ్‌ని ప్రారంభించారు. అనంతరం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన – ప్రగతిబాట’ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం అని, జల్‌ జంగల్‌ జమీన్‌ అని నినదించిన పోరాటాల గడ్డ ఇది అని తెలిపారు.

పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్‌ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాకు కేటాయించాలనుకుంటున్న యూనివర్సిటీని నిర్మల్‌ జిల్లా బాసరట్రిపుల్‌ ఐటీలో ఏర్పాటు చేస్తామన్నారు. యూనివర్సిటీని అన్ని ప్రాంతాల నాయకులు తమ ప్రాంతానికే కేటాయించాలని కోరుతున్నారన్నారు. అందుకే బాసరలో ఏర్పాటు చేస్తామని నాయకులందరూ సహకరించాలని కోరారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల లక్షల ఎకరాలకు సాగునీరు అందకుండా పోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు తట్టెడు మట్టి తీయలేదని, ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. బడ్జెట్‌ సమావేశాలలోపు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై సంపూర్ణ నివేదిక ఇవ్వాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి సూచించారు.

ఆదిలాబాద్‌లో ఎయిర్‌ పోర్టు ఒక్కటే ఏర్పాటు చేసుకుంటే సరిపోదని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అందుకు 10వేల ఎకరాలు అవసరం ఉందని తెలిపారు. నిర్మల్‌ జిల్లాలో అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి నాగోబా జాతరకు రూ.22కోట్లు కేటాయిస్త్తున్నట్టు ప్రకటించారు. ప్రజల కోసం.. ప్రాంత అభివృద్ధి కోసం ఎవరినైనా కలవడానికి వెనకాడనని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, నిధుల కోసం ప్రధానిని ఎన్నిసార్లయినా కలుస్తానని తెలిపారు. ఇందుకు బీజేపీ ప్రజా ప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. తాను పైరవీల కోసం ఎవరి దగ్గరకు వెళ్లనని, నాకు పర్సనల్‌ ఎజెండాలు లేవన్నారు. ఆనాటి పాలకులు చేసిన అప్పులు.. ఉరితాడుగా మారి ప్రజల ఊపిరి తీసే పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రజలకు మంచి జరుగుతుంటే పదేండ్లు అధికారం అనుభవించిన వాళ్లు చూసి ఓర్వలేకపోతున్నారని, అయినా తాను ఓడిపోయినవారి గురించి, పడిపోయినవారి గురించి మాట్లాడదలచుకోలేదన్నారు. చనాక- కోర్టకు సీ. రామచంద్రారెడ్డి పేరు, సదర్మట్‌ బ్యారేజీకి నర్సారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌, ఎమ్మెల్యేలు పాయల శంకర్‌, అనిల్‌ జాదవ్‌, వెడ్మ బొజ్జు పటేల్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రామారావు పాటిల్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, పలువురు ప్రజాప్రతినిధులు, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్‌, ఎస్పీలు అఖిల్‌ మహాజన్‌, జానకి షర్మిల పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -