రెండు వారాల్లో స్పీకర్ తన నిర్ణయాన్ని తెలపాలని సుప్రీం ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా పడింది. రెండు వారాల తర్వాత తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తన నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే నాలుగు వారాల సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో పురోగతిని పరిశీలించి అవసరమైతే మరో రెండు వారాల గడువు పెంచుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. శుక్రవారం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది.
బీఆర్‌ఎస్ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారనీ, మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయానికి కొంత సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాది కోరారు. స్పీకర్‌కు కంటి శస్త్ర చికిత్స జరగడంతో ఆస్పత్రిలో ఉన్నారనీ, అసెంబ్లీ కార్యదర్శిగా కొత్త అధికారి నేపథ్యంలో ప్రక్రియ ఆలస్యమైందని న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ కోర్టుకు నివేదించారు. ఇప్పటివరకు స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను నివేదిక రూపంలో ఆయన కోర్టుకు సమర్పించారు. మిగతా ముగ్గురు సభ్యులపై నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాల సమయం కావాలని ధర్మాసనానికి స్పీకర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
గత ఏడాదిగా ఇదే చెబుతున్నారంటూ బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతంలో మూడు నెలల్లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదని పాడి కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది శేషాద్రినాయుడు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారనీ, మిగిలిన ముగ్గురిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ కోర్టును కోరారు. అయితే రెండు వారాలు సమయం ఇస్తున్నామనీ, రెండు వారాల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో కోర్టుకు చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఆ తరువాత అవసరమైతే మరో రెండు వారాల సమయం ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం చెబుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
స్పీకర్‌పై బీజేపీ పిటిషన్
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మూడు నెలల గడువులోగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నిర్ణయం తీసుకోలేదని బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలతోపాటు పలు అంశాలు పిటిషన్‌లో పేర్కొన్నారు.



