రాష్ట్ర గిరిజన శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకుని విధానాలను రూపొందిస్తే సత్ఫలితాలను సాధించగలుగుతామని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గిరిజన సాంప్రదాయ వైద్యుల జాతీయ స్థాయి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని తెలిపారు. రవాణా సదుపాయాల లేమి, సమాచార లోపాలు, భాషా-సాంస్కృతిక బేధాలు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై నమ్మకం లోపించడం వంటి సమస్యలను గిరిజనులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గిరిజన వైద్యుల సామర్థ్యం పెంచితే సకాలంలో వైద్యం అందించడం సాధ్యమవుతుందని వివరించారు. కేంద్ర గిరిజన శాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ప్రకటించారు.
కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరాం మాట్లాడుతూ భారతీయ ఆదివాసీ వైద్య సంప్రదాయాలను వలస పాలకులు కూడా నిర్మూలించలేకపోయారని గుర్తుచేశారు. ఆ సంప్రదాయ వైద్యులకు తగిన సాంకేతిక శిక్షణ అందిస్తే వైద్యంతో పాటు దానిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారికి కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హార్ట్‌ఫుల్‌నెస్ గ్లోబల్ గైడ్ పూజ్య దాజీ, కేంద్ర గిరిజన సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే, అదనపు కార్యదర్శి మనీష్ ఠాకూర్, కార్యదర్శి రంజనా చోప్రా, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర గిరిజనశాఖ, ఐసీఎంఆర్ ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం, (భువనేశ్వర్) మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ‘ప్రాజెక్ట్ దృష్టి’ కింద భారత్ ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ పేరుతో దేశంలో తొలి జాతీయ గిరిజన ఆరోగ్య పరిశీలనా కేంద్రం ఏర్పాటు కానుంది.
వాస్తవాల ఆధారంగా విధానాలతో సత్ఫలితాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



