Saturday, January 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఘనంగా 'హాట్‌ ఎయిర్‌ బెలూన్‌' ఫెస్టివల్‌

ఘనంగా ‘హాట్‌ ఎయిర్‌ బెలూన్‌’ ఫెస్టివల్‌

- Advertisement -

ఈ రైడ్‌ గొప్ప అనుభూతిని ఇచ్చింది : జూపల్లి
13 కిలోమీటర్లు విహరించిన మంత్రి
పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్‌క్లబ్‌ వేదికగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభమైంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంతరం మంత్రి జూపల్లి ఇతర అధికారులతో కలిసి స్వయంగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో విహరించి అలరించారు. ఆకాశమార్గంలో సుమారు గంటన్నరపాటు 13 కిలోమీటర్లు విహరించారు. హైదరాబాద్‌ గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్‌క్లబ్‌ నుంచి ప్రారంభమైన హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ అప్పాజిగూడ శివారులో దిగింది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయమని వ్యాఖ్యానించారు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదిక అని చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.

ఒకవైపు ‘ఇంటర్నేషనల్‌ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ ద్వారా తెలంగాణ సంస్కృతి సంప్రదాయం, ఆతిథ్యాన్ని చాటుతుండగా, మరోవైపు ‘హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, డ్రోన్‌ ఫెస్టివల్‌ ద్వారా ఆధునిక సాంకేతికతను, భవిష్యత్తు దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా తెలంగాణలోని సహజ సౌందర్యాన్ని, చారిత్రక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని అభిప్రాయపడ్డారు. ”డెస్టినేషన్‌ తెలంగాణ” అనే బ్రాండ్‌ను బలోపేతం చేస్తూ, కేవలం దేశీయ పర్యాటకులనే కాకుండా విదేశీ యాత్రికులను కూడా ఆకర్షించేలా ఇటువంటి సాహసోపేత క్రీడలు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యాటకులు కేవలం సందర్శించడమే కాకుండా, ఒక గొప్ప అనుభూతిని పొందేలా వినూత్న కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షిస్తూ, భాగస్వామ్య పద్ధతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నాణ్యమైన సేవలను అందుబాటులోకి తెస్తున్నామని గుర్తుచేశారు. ఈ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి, ఆదాయ మార్గాలను పెంచడమే లక్ష్యమన్నారు. ఇదొక అద్భుత అనుభూతి. సంప్రదాయానికి గౌరవం, సాంకేతికతకు స్వాగతం పలుకుతూ పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పారు. ‘ఆకాశంలో ఎగురుతున్న ఈ బెలూన్లు.. తెలంగాణ పర్యాటక రంగం ప్రపంచ స్థాయి ఎత్తులకు చేరుకోబోతోంది అనడానికి నిదర్శనం’ అని మంత్రి ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, యువత, పిల్లలందరికీ ఈ ఫెస్టివల్‌ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందనీ, ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరక్టర్‌ క్రాంతి వల్లూరి, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -