మీ ఖాతా ఫ్రీజ్ చేస్తానని హెచ్చరించినా ఆందోళన పడొద్దు
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సీసీఎస్ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులను కొందరు డిజిటల్ అరెస్ట్‌తో మోసపోతున్నారు. క్షణాలు, నిమిషాలు, గంటల వ్యవధిలో బ్యాంక్ ఖాతాలో ఉన్నదంతా కోల్పోతున్నారు. ముఖ్యంగా వృద్ధులను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరస్తులు వారిని భయాందోళనకు గురిచేసి ఉన్నదంతా స్వాహా చేస్తున్నారు. మోసగాళ్లు వాట్సాప్ ద్వారా సీబీఐ, ఎన్‌ఐఏ, టాస్క్‌ఫోర్సు, నేవీ అధికారికులుగా నటించి మోసం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం నగరంలో వృద్ధ వ్యాపారిని టార్గెట్ చేసిన నిందితులు 7.12కోట్లు స్వాహా చేశారు. ఓ కంపెనీ సీఈఓ నుంచి సైతం కోట్లాది రూపాయలు వసూలు చేశారు. వీరిని డిజిటల్ అరెస్ట్ చేసి డబ్బులు బదిలీ చేయించుకున్నారు. 2025లో సైబర్ క్రైమ్ పోలీసులు 86 డిజిటల్ అరెస్ట్ కేసులను నమోదు చేశారు. ఈ కేసుల్లో బాధితులు 33,81,56,854 నగదును కోల్పోయారు.
చట్టంలోనే లేదు…
డిజిటల్ అరెస్టు పూర్తిగా మోసం. చట్టంలో అలాంటి అరెస్ట్‌లు లేవు. సైబర్ నేరస్తులు తాము పోలీసులమని, సీబీఐ లేదా ఇతర అధికారులమని చెప్పి, వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీడియోలో యూనిఫారం వేసుకుని, ఆందోళన కలిగించే మాటలు చెప్పడంతో వృద్ధులు భయానికి గురై వారు చెప్పిన విధంగా చేస్తున్నారు.
నగర వాసులను అప్రమత్తం చేస్తున్న సీసీఎస్ పోలీసులు
రోజురోజుకు ‘డిజిటల్ అరెస్టు స్కామ్స్ పెరుగుతోంది’. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు నగర వాసులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ స్కామ్‌లో నకిలీ పోలీస్, ప్రభుత్వ అధికారుల లేదా కొరియర్ కంపెనీల ప్రాతినిధ్యాన్ని చేసుకుని, బాధితులను మనీ లాండరింగ్, ట్రాఫికింగ్, నార్కోటిక్స్, టెర్రరిజం వంటి నేరాల్లో అరెస్ట్ చేయబోతున్నట్టు, ఖాతాలు ఫ్రీజ్ అవుతాయని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భయపెడుతుంటారని వివరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత, బ్యాంక్ సమాచారాన్ని పంచుకోకూడదని ప్రచారం చేపట్టారు. అనుమానాస్పద కాల్స్‌కు, మెసేజ్‌లకు స్పందించకూడదన్నారు.
నాన్-బైలబుల్ అరెస్ట్ వారెంట్లు, ఆర్‌బీఐ లెటర్లు పంపి నమ్మిస్తారని, తీవ్ర శిక్ష లేదా కుటుంబ పరువు పోతుందని బెదిరిస్తారని, మీరు డిపాజిట్ చేసిన డబ్బులను ‘సుప్రీం కోర్టులో సమర్పించాలని’ చెప్పి డబ్బును తీసుకుంటారని పోలీసులు వివరిస్తున్నారు. ఎవరికి భయపడాల్సి అవసరం లేదని, వీడియో కాల్స్ స్పందించొద్దని వారు అవగాహన కల్పిస్తున్నారు. నిజమైన అధికారులు డబ్బు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అడగరని, అలాంటి కాల్స్‌ను వెంటనే కట్ చేయాలన్నారు. వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్స్‌లైన్ (1930)కు లేదా సైబర్ పోర్టల్ లో గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేర బాధితుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ‘వర్చువల్ హెల్ప్‌డెస్క్’ ఈ సీ-మిత్రకు సమాచారం పంపొచ్చని తెలుపుతున్నారు.



