ఇంటి వద్దకే బంగారం.. పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన ‘సమ్మక్క సారలమ్మ’ జాతర ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో అమ్మవార్లకు బంగారం సమర్పించాలనుకునే భక్తుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చింది. ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మలను పూజించడానికి తండోప తండాలుగా వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారనే విషయం అందరికీ విదితమే. అంతేగాక దర్శనం చేసుకుని బంగారం సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేని భక్తులకు బంగారం ప్రసాదం తమ ఇంటి వద్దకే చేర్చేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.
దేవాదాయ శాఖ సహకారంతో, మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం ప్యాకెట్‌లో దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేస్తారు. ఇందుకుగాను బంగారం ప్రసాదం ప్యాకెట్ పొందాలనుకునే భక్తులు కేవలం రూ.299/- చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి సమీపంలోని టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇతర వివరాల కోసం టీజీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ 040-69440069, 040-23450033 నంబర్లలో సంప్రదించవచ్చని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పోస్టర్‌ను శుక్రవారం బస్‌భవన్‌లో ఆవిష్కరించారు.



